Amaravathi: ఇదేనా వికేంద్రీకరణ?

గ్రామ పంచాయతీలకు విధులు, నిధులతోనే పాలన వికేంద్రీకరణ. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పల్లెలకు విధులివ్వకపోగా, వివిధ రూపాల్లో సమకూరిన ఆదాయాన్ని మళ్లించుకుంటోంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చిన

Updated : 06 Apr 2022 05:55 IST

విధుల్లేవు.. నిధుల్లేవు..

భగ్గుమంటున్న సర్పంచులు

ఏడాదిలో రూ.2,000 కోట్ల నిధుల మళ్లింపు

సర్పంచి పదవి నామమాత్రం.. సచివాలయాలదే పెత్తనం

ఈనాడు - అమరావతి

గ్రామ పంచాయతీలకు విధులు, నిధులతోనే పాలన వికేంద్రీకరణ. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పల్లెలకు విధులివ్వకపోగా, వివిధ రూపాల్లో సమకూరిన ఆదాయాన్ని మళ్లించుకుంటోంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ.1,245 కోట్లు లాగేసుకుంది. ఇంటి, నల్లా పన్నులు వంద శాతం వసూలు చేయాలంటూ సర్పంచులు, పంచాయతీ సిబ్బంది మెడపై కత్తిపెట్టి వసూలు చేయించిన సొమ్మును ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధి పేరిట ఒక్కో ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం.. పంచాయతీలకు మాత్రం పైసా ఇవ్వకపోవడం వికేంద్రీకరణ ఎలా అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

నిత్యం అప్పుల కోసం వెంపర్లాడుతున్న సర్కారు.. ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో సర్పంచులకు తెలియకుండానే పంచాయతీల ఖాతాల్ని ఖాళీ చేస్తోంది. ఎంత సొమ్ము తీసుకుంది? ఎప్పుడు తిరిగి ఇస్తుందో కూడా చెప్పడం లేదు. కొత్త పాలకవర్గాలు ఏర్పడిన ఏడాదికాలంగా గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చేయూత ఇవ్వకపోగా, నిర్వీర్యం చేస్తోందని సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీల నుంచి ప్రభుత్వం రూ.2 వేల కోట్లకు పైగా వాడుకుంది. ఇందులో 14, 15 ఆర్థిక సంఘాల నిధుల కింద కేంద్రం ఇచ్చిన రూ.1,245 కోట్లను విద్యుత్తు ఛార్జీల కింద రెండు విడతల్లో తీసుకుంది. 2021-22 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రెండో విడత కింద కేంద్రం రూ.960 కోట్లు మార్చి నెలాఖరులోగా ఇవ్వాల్సి ఉంది. కేంద్రం ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదా? లేక కేంద్రమే జాప్యం చేస్తోందా? అనేది స్పష్టత లేదు.

రాష్ట్రంలో 13,371 పంచాయతీలున్నాయి. ఒక్కో సగటున రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సాధారణ నిధులు ఉండొచ్చని అంచనా. పెద్ద పంచాయతీల్లో రూ.కోట్లలోనే ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 65 శాతానికిపైగా పన్నులు వసూలయ్యాయి.

ఒక్కో పంచాయతీలో సగటున రూ.5 లక్షల చొప్పున సాధారణ నిధులు ఉన్నాయనుకున్నా.. రూ.668 కోట్లకుపైగా నిధులు ఖాళీ చేసినట్లు అంచనా. రూ.1,000 కోట్లకుపైగా తీసుకున్నారన్నది సర్పంచుల వాదన. వారు రోడ్డెక్కుతున్నా, భిక్షాటన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. సాధారణ నిధుల ఖాతాలు ఖాళీ చేయడం మునుపెన్నడూ లేదని విశ్రాంత పంచాయతీ అధికారి ఒకరు చెప్పారు.

ఇవిగో ఉదాహరణలు
* కృష్ణా జిల్లా ప్రసాదంపాడు పంచాయతీలో రూ.15 లక్షల సాధారణ నిధులు మళ్లించడంతో ఖాతా ఖాళీ అయ్యింది. వేసవిలో తాగునీటి అవసరాలకు బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన దశలో ఇది వెలుగుచూసింది. ఇదే పంచాయతీ నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ఆర్థిక సంఘం నిధులు రూ.75 లక్షలు మళ్లించారు.

* కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీలో రూ.90 లక్షలు మళ్లించారు. పన్నులతోపాటు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి వచ్చే అద్దెలు,   ఇతర ఆదాయం ఖాతాలో జమచేసుకోగా, మార్చి 31 వరకు ఉన్న సొమ్ము ఏప్రిల్‌ 1న ఖాళీ అయ్యింది.

* కడప జిల్లా మెరుగుడి పంచాయతీకి ఆస్తి పన్నులే ఆదాయ వనరు. రూ.8.40 లక్షల సాధారణ నిధిని మళ్లించడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

* ప్రకాశం జిల్లా పర్చూరు, వీరన్నపాలెం పంచాయతీకి చెందిన రూ.22.98 లక్షలు మళ్లించి ఖాతా ఖాళీ చేశారు.

* తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం కేసనపల్లి పంచాయతీలో రహదారి వేద్దామనుకుంటుండగానే, రూ.3.50 లక్షలు తీసుకున్నారు.

మౌలిక వసతులకు నిధులేవి?
సాధారణ నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అత్యవసర పనులతో పాటు పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. వేసవి  కావడంతో తాగునీటి సరఫరా, మరమ్మతులపై పంచాయతీలు దృష్టి సారించాల్సి ఉంది. సాధారణ నిధుల్ని ప్రభుత్వం మళ్లించడంతో, ఇప్పుడీ పనులు చేపట్టేందుకు చేతిలో పైసా లేదని సర్పంచులు వాపోతున్నారు. అనివార్యంగా కొందరు సర్పంచులు, కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారని, ఇలా ఎంతకాలం చేయగలమని కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ సర్పంచి ఒకరు ప్రశ్నించారు. గ్రామ సచివాలయాలపై సర్పంచుల పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా ప్రభుత్వం వీరి అధికారాలపై కత్తెర వేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇక్కడి సిబ్బందికి సెలవు మంజూరు అధికారాన్ని సర్పంచులకు కల్పిస్తున్నట్లు 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రభుత్వం.. తర్వాత జీవోను సవరించింది. ప్రస్తుతం సిబ్బందిపై పర్యవేక్షణ బాధ్యతను అధికారుల చేతుల్లో పెట్టిందని, వాలంటీర్లు తమ మాట వినడం లేదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సర్పంచి అన్నారు.


ప్రజలకే లేఖలు పంపుతాం
‘గ్రామ పంచాయతీలపై ప్రభుత్వ వైఖరి మారకపోతే.. పరిపాలన చేయడం మా వల్ల కాదని ప్రజలకే నోటీసులు పంపాలనుకుంటున్నాం. ప్రభుత్వమే మా ఖాతాలు ఖాళీ చేస్తుంటే ఏం న్యాయం చేయగలం? మాపై పెట్టుకున్న ఆశలు ఎలా నెరవేర్చగలం? నిధులున్నాయనే ఉద్దేశంతో ఉగాది సందర్భంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల్ని అప్పు తెచ్చి చేయించా. బిల్లులు అప్‌లోడ్‌ చేసేలోగా ఖాతా ఖాళీ చేశారు.’

- కె.శ్రీనివాసులుయాదవ్‌, సర్పంచి, అంబాపురం, కర్నూలు జిల్లా


చేతిలో చిల్లిగవ్వలేదు

‘మా పంచాయతీ ఖాతాలో రూపాయి కూడా లేదు. ఆర్థిక సంఘం, సాధారణ నిధులు కలిపి ఏడాదిలో రూ.10.50 లక్షలు ప్రభుత్వం వెనక్కి లాగేసింది. ఊళ్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోర్లు వేయాలంటే డబ్బుల్లేవు. రూ.8 లక్షల వరకు అప్పు చేసి మరీ పనులు చేయిస్తే, రూ.లక్ష బిల్లు కూడా రాలేదు.

- జి.అరుణమ్మ, సర్పంచి, దుర్గకుంట, అనంతపురం జిల్లా


ఏం సమాధానం చెప్పాలి?

‘ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రామస్థులకు సమాధానం చెప్పలేకున్నాం. పంచాయతీ ఖాతాలు ఖాళీ చేస్తుంటే.. ఊళ్లో ప్రజా అవసరాలకు నిధులెలా వస్తాయి? రెండు రోజుల కిందట మోటారు దెబ్బతిని మంచినీళ్లు రాలేదు. కొత్త మోటారుకు రూ.60 వేలు కావాలి. ఖాతాలో పైసా లేదు.’

- ఎం. శివశంకరరావు, సర్పంచి, బొడ్డపాడు కృష్ణా జిల్లా


ఆశలన్నీ ఆవిరవుతున్నాయి

‘ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా చేయాలన్న ఆశతో వచ్చాం. వెనక్కి తిరిగిచూస్తే బాధేస్తోంది. పనుల కోసం ఇంజినీర్లతో అంచనాలు వేయించి కూడా నిధుల్లేక పక్కన పెట్టాం. మా అనుమతి లేకుండా నిధులెలా మళ్లిస్తారు? ఇన్నాళ్లూ ఓపిక పట్టాం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు వివరిస్తాం.’

- ఆనెపు వరలక్ష్మి, సర్పంచి, పెద్దపీట, శ్రీకాకుళం జిల్లా


మండల పరిషత్‌ల ఖాతాలూ ఖాళీ!

ఈనాడు-అమరావతి, పర్చూరు-న్యూస్‌టుడే: గ్రామపంచాయతీ ఖాతాల్లో సాధారణ నిధులు ఖాళీ కావడంపై సర్పంచులు ఒకవైపు ఆందోళన చేస్తుండగా, మరోవైపు మండల పరిషత్‌ల ఖాతాల్లోనూ నిధులకు రెక్కలొచ్చాయి. ఈ విషయాన్ని 4రోజుల ఆలస్యంగా ప్రజానిధులు, అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్‌ల్లోనూ నిధులు మళ్లించారా? కొన్ని జిల్లాల్లోనే ఖాళీ అయ్యాయా? అనేది తేలాల్సి ఉంది.

బాపట్ల జిల్లాలో..
* చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలో సాధారణ నిధులు రూ.1.40 కోట్లు, ఆర్థిక సంఘం నిధులు రూ.70లక్షలు మార్చి నెలాఖరు వరకు ఉన్నాయి. ఏప్రిల్‌1న ఖాతా ఖాళీ అయ్యింది.

* కారంచేడు మండలంలో సాధారణ నిధులు రూ.24 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు 53 లక్షలు మార్చి నెలాఖరువరకు ఉండి ప్రస్తుతం ఖాళీ అయ్యాయి.

* బల్లికురవ మండలంలో సాధారణ నిధులు రూ.2.10 కోట్లు, ఆర్థిక సంఘం నిధులు రూ.78 లక్షలు మళ్లించారు.

* మార్టూరు మండలంలో సాధారణ నిధులు రూ.50 లక్షలు, ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షలు మార్చి నెలాఖరు వరకున్నాయి. ఏప్రిల్‌ 1న కనిపించలేదు.

* బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండలంలో సాధారణ నిధులు సుమారు రూ.75 లక్షలు, ఆర్థిక సంఘం నిధులు రూ.కోటి మళ్లించడంతో ఖాతా ఖాళీ అయ్యింది.

పోలీసులకు ఫిర్యాదు
ఉరవకొండ: తమ గ్రామపంచాయతీల్లో ఆర్థిక సంఘం, సాధారణ నిధుల మళ్లింపుపై విచారణ జరపాలని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని తెదేపా మద్దతుదారులైన వ్యాసాపురం, పెద్ద ముష్టూరు, పెద్ద కౌకుంట్ల సర్పంచులు సీతారామ్‌, సరస్వతి, అంజలి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచులు, కార్యదర్శులకు తెలియకుండా.. వారి అనుమతి లేకుండా ప్రభుత్వం నిధులు మళ్లించిందని పేర్కొన్నారు. గతేడాది జులై 17, నవంబరు 22న, ఈ ఏడాది మార్చి 31న పంచాయతీ ఖాతాల నుంచి మొత్తం రూ.71.50 లక్షలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరిగి జమ చేసేలా చూడాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని