Updated : 06 Apr 2022 06:18 IST

Amaravathi: అమరావతికి తోడ్పాటు ఇవ్వండి

మీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించండి

కేంద్ర మంత్రులకు అమరావతి రైతుల వినతి

తమ శాఖ భవనానికి వచ్చేనెలలో శంకుస్థాపన చేస్తామన్న రాణే

ఈనాడు, దిల్లీ: అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని.. దాన్ని అక్కడినుంచి కదిలించడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు సుస్పష్టమైన తీర్పునిచ్చి, వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఆదేశించినందున కేంద్ర ప్రభుత్వం నూతన రాజధాని అభివృద్ధికి మద్దతివ్వాలని అమరావతి రైతులు పలువురు కేంద్రమంత్రులకు విజ్ఞప్తిచేశారు. నూతన రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల కోసం ఇదివరకే కేటాయించిన స్థలాల్లో వెంటనే నిర్మాణం చేపట్టాలని అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఆధ్వర్యంలో దిల్లీకి తరలివచ్చిన 116 మంది రైతు ప్రతినిధుల బృందం మంగళవారం కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, నారాయణ్‌రాణే, జితేంద్రసింగ్‌లను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల సిద్ధాంతం వల్ల ఉత్పన్నమైన ఇబ్బందులు, 841 రోజులుగా తాము చేస్తున్న పోరాటం గురించి వివరించి కేంద్రం తరఫున తమకు తోడ్పాటునందించాలని కోరారు.

ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలకు కేటాయించిన భూముల్లో వెంటనే వాటి కార్యాలయ భవనాల నిర్మాణం మొదలయ్యేలా చూడాలని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. రెయిల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌, రెయిల్‌ టెల్‌ కార్పొరేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌కు కేటాయించిన స్థలాల్లో వాటి ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించాలని రైల్వే, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. సీబీఐ, సివిల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కేటాయించిన స్థలాల్లో వాటి కార్యాలయాలకు శ్రీకారం చుట్టాలని సిబ్బంది వ్యవహారాలు, శాస్త్రసాంకేతిక శాఖల మంత్రి జితేంద్రసింగ్‌ను కోరారు. కొబ్బరి అభివృద్ధి బోర్డుకు కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని మొదలుపెట్టాలని వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు మొరపెట్టుకున్నారు. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌కు కేటాయించిన స్థలంలో దాని భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కోరారు. రాష్ట్ర రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులు మూడేళ్లుగా అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకపోవడం వల్ల ఉన్న జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన అమరావతి అభివృద్ధికి కేంద్రం తన వంతు మద్దతుగా వెంటనే ఇక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టాలని కోరారు.

తెలుగులో పలకరించిన రైల్వేమంత్రి
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అమరావతి నుంచి వచ్చిన 116 మందితో సమావేశమై తెలుగులో ‘బాగున్నారా?’ అని పలకరించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆయనకు హిందీ, ఇంగ్లిష్‌లో వివరించబోతే తెలుగులో చెప్పమని కోరారు. తన శాఖ పరిధిలోని అంశాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ విజ్ఞప్తులపై కేంద్రమంత్రులంతా సానుకూలంగా స్పందించినట్లు రైతు ప్రతినిధి మాదాల శ్రీనివాస్‌ మీడియాతో పేర్కొన్నారు. అలాగే తమ శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి మేలో శంకుస్థాపన చేస్తామని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల మంత్రి నారాయణ్‌రాణే హామీ ఇచ్చారని, దీనిపై అధికారులను అక్కడికక్కడే ఆదేశించారని చెప్పారు. ఆర్థికశాఖ పరిధిలోని సంస్థలకు కేటాయించిన భూముల్లో వెంటనే పనులు ప్రారంభించాలని, శంకుస్థాపన కార్యక్రమానికి మీరూ రావాలని నిర్మలా సీతారామన్‌ను కోరినప్పుడు ఆమె తప్పకుండా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

అమరావతి రైతులపై నిఘా

ఈనాడు, దిల్లీ: అమరావతి సమస్యను కేంద్రమంత్రులకు వివరించడానికి దేశ రాజధానికి వచ్చిన రైతులపై దిల్లీ పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా మంగళవారం దిల్లీకి రావడంతో ఆయనను రైతులు ఘెరావ్‌ చేస్తారేమోనని ఏపీ భవన్‌ అధికారులు దిల్లీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని