Amaravathi: రాజధాని భూముల అమ్మకం

రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంత సుముఖంగా లేకపోవడంతో నిధుల సమీకరణకు రాజధానిలోని భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండుచోట్ల మొత్తం 15 ఎకరాల్ని ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ఈ నెల ఆరో తేదీన ఉత్తర్వులు జారీచేసింది. అనేక జీవోల్లాగానే దాన్నీ ఈ-గెజిట్‌ పోర్టల్‌లో ఉంచకపోవడంతో... ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. రాజధాని మీదుగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కాజ-గుండుగొలను బైపాస్‌ రహదారి పక్కనే నవులూరు గ్రామం వద్ద 10 ఎకరాలు

Updated : 26 Jun 2022 06:44 IST

అమరావతి పనుల కోసం 15 ఎకరాలను విక్రయించేందుకు సీఆర్‌డీఏకి అనుమతి
6వ తేదీన ఇచ్చిన జీవో ఆలస్యంగా వెలుగులోకి
దశలవారీగా 500 ఎకరాలను విక్రయించే యోచనలో ప్రభుత్వం
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంత సుముఖంగా లేకపోవడంతో నిధుల సమీకరణకు రాజధానిలోని భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండుచోట్ల మొత్తం 15 ఎకరాల్ని ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ఈ నెల ఆరో తేదీన ఉత్తర్వులు జారీచేసింది. అనేక జీవోల్లాగానే దాన్నీ ఈ-గెజిట్‌ పోర్టల్‌లో ఉంచకపోవడంతో... ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. రాజధాని మీదుగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కాజ-గుండుగొలను బైపాస్‌ రహదారి పక్కనే నవులూరు గ్రామం వద్ద 10 ఎకరాలు (అయిదేసి ఎకరాల ప్లాట్లు రెండు), సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలు (రెండేసి ఎకరాల ప్లాట్లు రెండు) విక్రయించేందుకు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సీఆర్‌డీఏ తన బాధ్యత నిర్వర్తించేందుకు ఆ భూముల్ని విక్రయించాలని నిర్ణయించినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ ఒక ఎస్క్రో ఖాతా తెరిచి, భూముల్ని విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని దానిలో జమచేయాలని, దాంతో రాజధానిలో పనులు చేపట్టాలని సూచించారు. విక్రయించే భూముల కనీస ధరను నిర్ణయించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఒక కమిటీని నియమించారు. దానిలో సంబంధిత ఆర్డీవో, జిల్లా రిజిస్ట్రార్‌, ఏపీఆర్‌ఎస్‌సీఎల్‌ ఎండీ సభ్యులుగా ఉంటారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

రూ.3,500 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీపై చర్చ

రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం, భూములిచ్చిన రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి రూ.3,500 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్న సీఆర్‌డీఏ... దానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఇప్పటికే కోరింది. ఆ ప్రతిపాదన ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. ఈ అంశంపై శుక్రవారం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీఆర్‌డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే 20 ఏళ్లలో దశలవారీగా రాజధానిలో భూములు విక్రయించి రుణం తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఏఎంఎల్‌) సంస్థతో డీపీఆర్‌ సిద్ధం చేయిస్తున్నామని సీఆర్‌డీఏ అధికారులు చెప్పినట్టు తెలిసింది. దశలవారీగా 500 ఎకరాలు విక్రయించే యోచనలో ఉన్నామని చెప్పినట్టు సమాచారం.


అమ్మితే రాజధాని కోసమే ఖర్చు పెట్టాలి

- ఉన్నం మురళీధరరావు, సీనియర్‌ న్యాయవాది

రాజధాని నిర్మాణానికి తప్ప... మరే ఇతర అవసరాలకూ అమరావతిలోని భూమిని విక్రయించడం గానీ, తనఖా పెట్టడం గానీ చేయరాదని హైకోర్టు స్పష్టం చేసినట్టు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తెలిపారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ని ప్రభుత్వం తు.చ. తప్పక అమలు చేయాల్సిందేనని, ఒకవేళ రాజధాని నిర్మాణానికి భూములు అమ్మాలనుకున్నా, భవిష్యత్తు అవసరాల కోసం విడిగా ఉంచిన భూముల్నే అమ్మాలని స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం వివిధ అవసరాలకు నిర్దేశించిన భూముల్ని, దానికి భిన్నంగా వేరే కార్యకలాపాల కోసం విక్రయించేందుకు వీల్లేదని ఆయన తెలిపారు.


ఎకరం రూ.10 కోట్లకు ఎవరు కొంటారు?

రాజధానిలో 248.34 ఎకరాల్ని ఎకరం రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లకు విక్రయించేందుకు సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొందించిందని, ఇటీవల పురపాలకశాఖ, సీఆర్‌డీఏలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారని శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. గతంలో బీఆర్‌ షెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాల్ని, లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాల్ని సీఆర్‌డీఏ విక్రయించనుందని, తదుపరి ఏటా 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల్ని విక్రయించాలనుకుంటోందని ప్రచారం జరిగింది. మంగళగిరికి సమీపంలో, జాతీయ రహదారికి దగ్గర్లో 20 ఏళ్ల క్రితమే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో స్థలాలు అమ్మేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నిస్తేనే కొనేందుకు ఒకరిద్దరు తప్ప ఆసక్తి చూపలేదు. అలాంటిది రాజధానిలో ఎకరం రూ.10 కోట్లకు అమ్ముతామంటే కొనేందుకు ఎవరు ముందుకు వస్తారన్న చర్చ విస్తృతంగా జరిగింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు