Amaravati: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు.. అమరావతి రైతుల నీరాజనం

Published : 19 Jun 2024 06:42 IST

పూలబాటగా మారిన సీడ్‌ యాక్సెస్‌ రహదారి
సచివాలయానికి వెళ్తుండగా అపూర్వ స్వాగతం

వెంకటపాలెం వద్ద అమరావతి రైతులకు, అభిమానులకు నమస్కరిస్తున్న పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి, తుళ్లూరు, న్యూస్‌టుడే: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు అమరావతి రైతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన ఆయనకు అడుగడుగునా రైతులు, మహిళలు, కూలీలు నీరాజనాలు పలికారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి నుంచి వెలగపూడి సచివాలయం వరకు పూలు పరిచి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు పవన్‌ రాగా, అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా ముళ్లకంచెలు దాటుకొని వచ్చి మరీ రైతులకు అండగా నిలబడ్డారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతలు పవన్‌ మెడలో ఆకుపచ్చ కండువాలు, భారీ గజమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లాయ పాలెం కూడలి వద్ద న్యాయదేవత విగ్రహానికి పవన్‌ పుష్పాంజలి ఘటించారు. కాన్వాయ్‌కు ఎదురుగా మహిళలు మోకాళ్లపై నిల్చొని నమస్కరించగా, వారితో కరచాలనం చేసి ముందుకు సాగారు. సుమారు 6 కి.మీ ప్రయాణానికి గంట సమయం పట్టింది. దారి పొడవునా ఎన్డీయే పార్టీల జెండాలు, బ్యానర్లతో నింపేశారు. 

పూలమయమైన సీడ్‌ యాక్సెస్‌ రహదారి

యువత జోరు.. నినాదాల హోరు

జై అమరావతి, న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, ఐదు కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి అంటూ పవన్‌ కాన్వాయ్‌ ముందు రైతులు నినాదాలతో హోరెత్తించారు. యువకులు పుష్పగుచ్ఛాలిచ్చి, సెల్ఫీలు దిగారు. టపాసులు కాల్చారు. డప్పులు, డీజేలు, గీతాల హోరు నడుమ నృత్యాలు చేశారు. మహిళలు హారతులిచ్చి, గుమ్మడికాయలతో దిష్టి తీశారు. జనసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేల ఫొటోలతో కూడిన దండను ఓ అభిమాని పవన్‌కు అందజేయగా, ఆయన దాన్ని ఆసక్తిగా చూసి, భద్రపర్చాలంటూ సిబ్బందికి ఇచ్చారు. ఓ మహిళా అభిమాని తన కుమార్తెతో రాగా, పవన్‌ ఆ చంటి బిడ్డను ఎత్తుకొని ఆప్యాయత చాటారు. ర్యాలీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, రాజధాని ఐకాస నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని