Amaravati Farmers: నాడు అవమానాలు.. నేడు ఆదరాభిమానాలు

జగన్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 1,631 రోజుల సుదీర్ఘ పోరాటం చేసిన రాజధాని అమరావతి రైతులు, మహిళలు ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర నిర్వహించారు.

Published : 24 Jun 2024 05:09 IST

తుళ్లూరు నుంచి ఇంద్రకీలాద్రికి..అమరావతి రైతుల పాదయాత్ర
అమ్మవారికి మొక్కులు చెల్లింపు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకోలు 

ప్రకాశం బ్యారేజీ మీదుగా సాగుతున్న అమరావతి రైతులు, మహిళల పాదయాత్ర

ఈనాడు, అమరావతి-తుళ్లూరు, ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 1,631 రోజుల సుదీర్ఘ పోరాటం చేసిన రాజధాని అమరావతి రైతులు, మహిళలు ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర నిర్వహించారు. తమ కోరిక నెరవేరడంతో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతి నిర్మాణం శరవేగంగా జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. 

2020 జనవరి 10న.. రాజధాని రైతులు చేపట్టిన ‘దుర్గమ్మకు ముడుపుల యాత్ర’ను అప్పట్లో పోలీసులు భగ్నం చేశారు. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉందంటూ తీవ్ర ఆంక్షలు విధించారు. అక్రమంగా అరెస్టులు చేశారు. పోలీసుల నిర్బంధాన్ని లెక్కచేయక ముందుకు కదిలిన రైతులను లాఠీలతో చితకబాదారు. పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు కాగా, మరికొందరు స్పృహతప్పి పడిపోయారు. దీంతో అప్పట్లో పాదయాత్ర ఆగిపోయింది. 

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అమరావతి రైతులు, మహిళలు

నాలుగున్నరేళ్ల తర్వాత.. ఇప్పుడు ఆ యాత్ర పూర్తి చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు తుళ్లూరు శిబిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మొత్తం 24 కి.మీ దూరం సాగి ఇంద్రకీలాద్రికి చేరింది. నిరాటంకంగా 6 గంటల పాటు ఈ యాత్ర సాగింది. జై దుర్గ.. జైజై దుర్గ.. జై అమరావతి.. జై కాళి.. న్యాయం గెలిచింది.. అమరావతి నిలిచింది అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తింది. అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, కర్లపూడి, నేలపాడు, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, మందడం, మల్కాపురం, వెంకటపాలెం గ్రామాల రైతులు, స్థానికులు పాదయాత్రలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రెండుసార్లు రాజధాని రైతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చినప్పుడు ఆంక్షలు ఎదురయ్యాయి. పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. మెడలో పచ్చ కండువాలు ఉన్నాయని ఆలయ అధికారులు అడ్డు చెప్పారు. ఇందుకు భిన్నంగా ఉంది ఆదివారం నాటి పరిస్థితి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అమరావతి రైతులను ఆలయ మర్యాదలతో అధికారులు, పోలీసులు తోడ్కొని వెళ్లారు. అమరావతి రైతులకు సంఘీభావంగా వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి దుర్గమ్మ దర్శనం చేయించారు. దుర్గగుడి ఈవో రామారావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని