Amaravati: అమరావతి రూపశిల్పికి అపూర్వ స్వాగతం

నిప్పులు చెరిగే ఎండను లెక్క చేయలేదు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోతను ఖాతరు చేయలేదు.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి రూపశిల్పి చంద్రబాబు కోసం రైతులు, మహిళలు, యువత వేల మంది రోడ్డుపైకి వచ్చారు.

Published : 14 Jun 2024 05:38 IST

చంద్రబాబు వాహనశ్రేణి సాగే మార్గం మొత్తం పుష్పమయం
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై నిలబడి పూలుచల్లిన రైతులు, మహిళలు
వెంకటపాలెం అడ్డరోడ్డు నుంచి సచివాలయం వరకు సీఎం వెంట పరుగులు 

రైతులు పూల దారిగా మార్చిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై సాగిపోతున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌

ఈనాడు, అమరావతి: నిప్పులు చెరిగే ఎండను లెక్క చేయలేదు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోతను ఖాతరు చేయలేదు.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి రూపశిల్పి చంద్రబాబు కోసం రైతులు, మహిళలు, యువత వేల మంది రోడ్డుపైకి వచ్చారు. జననేతపై పూలు చల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించేందుకు గురువారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయానికి వస్తుండటంతో బాబును అభినందించేందుకు పెద్ద సంఖ్యలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపైకి వచ్చారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో నరకం చవిచూసిన రాజధాని రైతులు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.. తొలిసారి రాజధానిలో అడుగుపెడుతున్న సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఆయన్ను స్వాగతించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన బాబు కాన్వాయ్‌.. వెంకటపాలెం సీడ్‌ యాక్సెస్‌ వద్దకు రాగానే రైతులు భారీ క్రేన్‌తో గజమాలను తీసుకొచ్చారు. అక్కడ భారీగా రైతులు, మహిళలు ఉండటంతో తన వాహనం నుంచి కిందకు దిగి వారికి అభివాదం చేశారు. గజమాలను స్వీకరించి మందుకు సాగారు. 

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ వెంకటపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభంలో రైతులు పూలు చల్లి సిద్ధం చేసిన రహదారి

5 కి.మీ మేర పూలబాట

వెంకటపాలెం క్రాస్‌ నుంచి సచివాలయం వరకు దాదాపు ఐదు కి.మీ. మేర రోడ్డుపై టన్నుల కొద్దీ బంతిపూలు, రోజాపూలను పర్చారు. పూలబాటపై చంద్రబాబు కాన్వాయ్‌ ముందుకు సాగింది. రోడ్డుపై రైతులు, మహిళలు, యువత నిలబడి ఆయనపై పూలజల్లు కురిపించారు. వారి అభినందనలను స్వీకరించేందుకు చంద్రబాబు కారు ఫుట్‌రెస్ట్‌పై నిలబడి చిరునవ్వుతో రెండు చేతులు జోడించి అభివాదం చేశారు. జై బాబు.. జైజై బాబు అంటూ ఆయన కాన్వాయ్‌ వెంట వారు పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా ఉప్పొంగిన అభిమానంతో ముఖ్యమంత్రికి స్వయంగా పుష్పగుచ్ఛాలు ఇచ్చేందుకు పోటీపడ్డారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం గ్రామం, మల్కాపురం క్రాస్‌ మీదుగా సచివాలయంలోకి ప్రవేశించారు. దారి వెంబడి పెద్ద సంఖ్యలో రైతులు ఉండడంతో చంద్రబాబు కాన్వాయ్‌ నెమ్మదిగా సాగింది. 5 కి.మీ. దూరానికి సుమారు 30 నిముషాల సమయం పట్టింది.

తాళ్లాయపాలెం వద్ద స్వాగతం పలుకుతున్న అమరావతి రైతులకు అభివాదం తెలుపుతున్న సీఎం చంద్రబాబు 


ప్రజాస్వామ్యం గెలిచింది.. అమరావతి నిలిచింది

సీఎం చంద్రబాబుకు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అడుగడుగునా పసుపు, ఆకుపచ్చ బెలూన్లతో స్వాగతం పలికారు. రోడ్లకు ఇరువైపులా నిలబడి రైతులు అమరావతి ఉద్యమ జెండాలు, తెదేపా జెండాలను ఊపుతూ అభినందనలు తెలిపారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి, హర్షం వ్యక్తం చేశారు. సీడ్‌యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం వెళ్లే మలుపులో వైకాపా ఆధ్వర్యాన గతంలో మూడు రాజధానుల శిబిరం నడిచిన ప్రాంతం వద్ద అమరావతి రైతులు న్యాయదేవత విగ్రహాన్ని ఉంచి, చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది.. అమరావతి నిలిచింది’, ‘న్యాయం గెలిచింది.. అమరావతి నిలిచింది’, ‘ఆంధ్రుడు మేల్కొన్నాడు.. అమరావతిని కాపాడుకున్నాడు’ అంటూ నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని