Amaravati: అమ్మకానికి అమరావతి భూములు

అమరావతి రాజధాని భూములపై ప్రభుత్వం కన్ను పడింది. రాజధానిని అభివృద్ధి చేయకపోగా ఇక్కడి భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

Updated : 09 Mar 2023 07:54 IST

రాజధాని ప్రాంతంలో 14 ఎకరాలు ఈ-వేలానికి నిర్ణయం
రైతుల నిరసన

ఈనాడు, అమరావతి: అమరావతి రాజధాని భూములపై ప్రభుత్వం కన్ను పడింది. రాజధానిని అభివృద్ధి చేయకపోగా ఇక్కడి భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతానికి సొమ్ము కేటాయించి అభివృద్ధి చేయకపోవడంతో ఇప్పటికే చేపట్టిన రూ.వేల కోట్ల పనులు నిరుపయోగంగా మారాయి. సగంలో ఆగిన భవన నిర్మాణాలు, రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఈ తరుణంలో అమరావతిలో 14 ఎకరాల భూములను ఈ-వేలం ద్వారా అమ్మడానికి గుంటూరు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ధర నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలందరితో ముడిపడి ఉన్న రాజధాని అంశాన్ని తేల్చకుండా భూములు అమ్మడమేంటని రైతులు నిలదీస్తున్నారు. రాజధాని ప్రాంతం మీదుగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కాజ- గుండుగొలను బైపాస్‌ రహదారి పక్కనే ఉన్న నవులూరు వద్ద 10 ఎకరాలు విక్రయించనున్నారు. ఇక్కడ ఎకరం ధర రూ.5,94,50,000గా నిర్ణయించారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్కనే పిచ్చుకలపాలెం వద్ద నాలుగు ఎకరాలు విక్రయిస్తారు. ఎకరం ధర రూ.5,41,04,400. ఈ రెండు భూములూ అత్యంత విలువైనవి. ధరలు నిర్ణయం కావడంతో ఈ-వేలంలో అమ్మేందుకు సీఆర్‌డీఏ పూర్తి వివరాలతో త్వరలోనే ప్రకటన ఇవ్వనుంది.

గతంలో ఒకసారి ప్రయత్నించినా...

గతేడాది జూన్‌లో రాజధాని భూముల్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అప్పట్లో వేలం నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. అయినా ప్రభుత్వం అమరావతి అభివృద్ధి విషయంలో ముందడుగు వేయకపోగా కనీసం రైతులకు ఇచ్చిన ప్లాట్లనూ అభివృద్ధి చేయలేదు. మూడు రాజధానుల పేరుతో మూడేళ్లుగా మభ్యపెడుతూ వస్తోంది. ఈ తరుణంలో రాజధాని కోసం పొలాలు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టడానికే భూముల అమ్మకాన్ని తెరపైకి తెచ్చారా? లేక అనుచరులకు వాటిని కట్టబెట్టేందుకు కుట్రపన్నారా అని రాజధాని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో తట్టెడు మట్టి వేయకుండా భూములను ఎలా విక్రయిస్తున్నారని రైతులు నిలదీస్తున్నారు.


త్యాగం చేస్తే నిరుపయోగం
- శ్రీదేవి, మహిళా రైతు, మందడం

రాజధానికి భూములు త్యాగం చేస్తే విలువ లేకుండా నిరుపయోగం చేస్తున్నారు. రాజధానికి తప్పితే ఇతర అవసరాలకు భూములు వాడుకోకూడదని న్యాయస్థానం చెప్పినా లెక్కచేయకుండా ఈ రోజు అమ్మకానికి పెట్టారు. శ్మశానం, ఎడారి అని చెప్పిన ఈ ప్రాంతంలో ఎకరం రూ.6 కోట్లకు విక్రయిస్తున్నారంటే ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందుతుందని చెప్పకనే చెబుతున్నారు. ఇది 29 గ్రామాల సమస్య కాదు.. 29 రాష్ట్రాలకు విస్తరించే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి గుర్తించాలి. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సార్థకత చేకూరేలా చూడాలని విన్నవిస్తున్నాం.


ఉద్యమం ఉద్ధృతం చేస్తాం
- వరలక్ష్మి, రాజధాని మహిళా రైతు, మందడం

మహిళా దినోత్సవం రోజున అమరావతి ఉద్యమం తప్పడం లేదు. ఇది రాష్ట్రసమస్య కాదని కేంద్రం గుర్తించాలి. పసుపు, అరటి, చెరకు, కంద పంటలు పండే భూములను రాజధాని కోసం ప్రభుత్వానికి ఇస్తే మాకు మాటమాత్రంగానైనా చెప్పకుండా అమ్మకానికి ఎలా పెడతారు? సీఎం జగన్‌కు అమరావతి రాజధాని అనడానికి నోరు రాదు గానీ అమరావతిలో భూములు అమ్ముతారా? సెంటు భూమి అమ్మినా ఊరుకునేది లేదు. ఉద్యమం ఉద్ధృతం చేస్తాం. ప్రధానమంత్రి మా సమస్యను గుర్తించి అందరికీ న్యాయం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని