Andhra News: రహస్యం బయటకొచ్చింది!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర గ్యారంటీ ఇచ్చిన అంశం ఎట్టకేలకు అధికారికంగా బడ్జెట్‌ పుస్తకాల్లో నమోదైంది. 2021-22 ఆర్థిక

Updated : 13 Mar 2022 06:48 IST

2020-21లోనే ప్రభుత్వ గ్యారంటీలు

నాటి బడ్జెట్‌ పుస్తకంలో చూపక వివాదమైన వైనం

నాడు గ్యారంటీ ఇవ్వలేదన్న మంత్రి బుగ్గన

తాజా బడ్జెట్‌ పుస్తకాల్లో చోటు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర గ్యారంటీ ఇచ్చిన అంశం ఎట్టకేలకు అధికారికంగా బడ్జెట్‌ పుస్తకాల్లో నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించిన నాటికే ఆ రూపేణా అప్పులు తెచ్చి వాడేసినా, ఆ విషయాన్ని శాసనసభకు సమర్పించే గ్యారంటీల లెక్కల్లో చేర్చలేదు. అప్పట్లోనే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఈ విషయం ప్రశ్నిస్తే అసలు ఆ గ్యారంటీలు వినియోగించుకుంటే కదా అని సమాధానం ఇచ్చారు. నిజానికి అప్పటికే ఏపీఎస్‌డీసీ ద్వారా రుణం తెచ్చి కొంత సొమ్ము ఖర్చు చేసినట్లు బడ్జెట్‌ ఖర్చుల్లో చూపించారు. ఆ రుణానికి గ్యారంటీ సంగతి దాచిపెట్టారు. ‘ఆ గ్యారంటీలను కలిపితే అప్పటికే రుణ పరిమితి దాటిపోయేది. అందుకే గ్యారంటీల అంశాన్ని బడ్జెట్‌ పుస్తకాల్లో చూపలేదు’ అని ఆర్థిక నిపుణులు అప్పట్లోనే విమర్శించారు. ఈ గ్యారంటీలను బడ్జెట్‌ పుస్తకాల్లో చేర్చాలని తాము సూచించినా ప్రభుత్వ పెద్దలు వద్దన్నారని నాడు ఆర్థికశాఖలో పని చేసిన ముఖ్య అధికారులు వెల్లడించారు. అప్పట్లో దాచి పెట్టిన ఏపీఎస్‌డీసీ రుణాల గ్యారంటీలు ఇప్పుడు బయట పెట్టాల్సి వచ్చింది. బడ్జెట్‌ పుస్తకం 5/2లో అప్పులు, గ్యారంటీల వివరాలు శాసనసభకు సమర్పించాలి. ప్రస్తుతం బడ్జెట్‌ ప్రతిపాదన సందర్భంగా సభకు సమర్పించిన వివరాల్లో ఏపీఎస్‌డీసీకి రూ.25వేల కోట్ల గ్యారంటీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

2020లోనే గ్యారంటీ ఒప్పందాలు, మంత్రిమండలి ఆమోదాలూ!

రాష్ట్రాభివృధ్ధి కార్పొరేషన్‌ రుణాలు పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులతో గ్యారంటీ ఒప్పందాలు 2020 నవంబరులోనే పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్యారంటీదారుగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణదాతలుగా, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ రుణగ్రహీతగా, ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్‌ సెక్యూరిటీ ట్రస్టీగా ఈ ఒప్పందం 2020 నవంబరు 5న కుదిరింది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంకు రుణదాతలు. ఈ మూడు బ్యాంకులు రూ.13,500 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అదే రోజు ఎస్క్రో ఒప్పందమూ కుదిరింది.

*  2020 నవంబరు 24న 5 బ్యాంకులతో ఒప్పందం కుదిరింది. రూ.21,500 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్‌బీఐ రూ.6,000 కోట్లు, పీఎన్‌బీ రూ.5,000 కోట్లు, ఇండియన్‌ బ్యాంకు 2,500 కోట్లు, యూబీఐ రూ.5,000 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ.3,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ ఒప్పందంలో అంగీకరించాయి. పై కార్యకలాపాలు పూర్తయ్యాక అన్ని జీవోలనూ ర్యాటిఫై చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. నవంబరు 27న నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశం 21 కింద దీన్ని మంత్రిమండలి ముందుంచారు. మూడు జీవోలకు సంబంధించి తీర్మానం 204/2020లో వాటన్నింటినీ మంత్రిమండలి ఆమోదించింది. అయినా, గ్యారంటీలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

ఎప్పుడో గ్యారంటీ జీవోలు

*  ఏపీఎస్‌డీసీ నుంచి రుణం తెచ్చేందుకు ప్రభుత్వం 2020లోనే గ్యారంటీలు ఇచ్చింది. ఆ వివరాలు 2021 బడ్జెట్‌ పుస్తకాల్లో నమోదు కావాలి.

*  రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల గ్యారంటీలు నిబంధనలు, షరతులకు లోబడి ఇస్తున్నట్లుగా 2020 నవంబరు 3న జీవో 92 విడుదలైంది.

*  కార్పొరేషన్‌ రుణం తీసుకుని ఆ మొత్తం చెల్లించేందుకు వీలుగా అదనపు ఎక్సయిజ్‌ సుంకం విధించి ఆ మొత్తాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేసేందుకు వీలు కల్పిస్తూ జీవో 90 వచ్చింది.

*  కార్పొరేషన్‌ మూలనిధిని రూ.2,500 కోట్లకు పెంచుతూ జీవో 91 విడుదల చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని