Andhra News: పోటీ ఎక్కువ.. పోస్టులు తక్కువ

ఉద్యోగాల ఖాళీల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నా తక్కువ సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తుండటం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు.

Updated : 28 Mar 2022 05:49 IST

గ్రూపు-2 కోసం లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు

పోస్టులు తక్కువగా చూపడంపై ఆవేదన

పోలీసు, లెక్చరర్ల ఖాళీల భర్తీ మాటేమిటని నిలదీత

ఈనాడు, అమరావతి: ఉద్యోగాల ఖాళీల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నా తక్కువ సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తుండటం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూసే...గ్రూపు-1, గ్రూపు-2, పోలీసు, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా కాలం నుంచి వెలువడలేదు. గత ఏడాది జూన్‌ 18న జారీ చేసిన క్యాలెండర్‌లో గ్రూపు-1, 2 కింద కేవలం 36 పోస్టులు ప్రకటించారు.

ఇవి మరీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. తర్జనభర్జనల అనంతరం శుక్రవారం గ్రూపు-1 కింద 110 పోస్టులు, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువగా ఉండడం పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016లో గ్రూపు-1 కింద 74, గ్రూపు-2లో 980, 2018లో గ్రూపు-1 కింద 160, గ్రూపు-2లో 443 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. గ్రూపు-2 పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. ఈ పోస్టుల కోసం నాలుగైదు సంవత్సరాల నుంచి సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఉన్నారు.

రాష్ట్ర సచివాలయంలో 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా.. కొన్ని పోస్టుల భర్తీకే అవకాశం కల్పించారు. ఇలాగే ఇతర శాఖల్లోనూ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 66,309 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. అన్ని శాఖల్లో కలిపి 7,71,177 పోస్టులు మంజూరు కాగా... 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉపాధి కల్పనా కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు 6.16 లక్షల మంది ఉన్నారు. పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగ ఐకాస, ఉద్యోగ పోరాట సమితి నేతలు హేమంతకుమార్‌, సిద్ధిక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నోటిఫికేషన్ల జారీ ఎప్పుడు?

కొత్తగా ప్రకటించిన గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల నోటిఫికేషన్ల జారీకి ఎంత కాలం పడుతుందన్న దానిపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ఆమోదం తెలిపిన ప్రకారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది జరిగిన అనంతరం సంబంధిత శాఖల నుంచి నేరుగా ఏపీపీఎస్సీకి ఇండెంట్లు వెళ్లాలి. రిజర్వేషన్లు, అర్హతలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చాక.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇందుకు నెలకు పైగానే సమయం పడుతుంది.

పోలీసు, లెక్చరర్ల పోస్టుల మాటేమిటి?

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం పోలీసు శాఖలో 450 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులోనే నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు జారీ కాలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2018 డిసెంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పుడు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్స్‌ పోస్టుల భర్తీకి గత జనవరిలోనే నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. విశ్వవిద్యాలయాల్లో 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గతనెలలో ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు అతీగతీలేదు.

వెల్లడికాని గ్రూపు-1 ఫలితాలు

గత నోటిఫికేషన్‌కు సంబంధించి గ్రూపు-1 ప్రధాన పరీక్షల ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని హైకోర్టు ఆదేశాలను అనుసరించి పెన్ను-పేపరు విధానంలో ప్రస్తుతం చేస్తున్నారు. గత అక్టోబరులో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లో మూల్యాంకనం పూర్తికావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని