Andhra News: తగ్గనున్న టోల్‌ గేట్లు!

వాహనంతో జాతీయ రహదారిపైకి వస్తే చాలు టోల్‌బాదుడు మొదలవుతుంది. కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్నవాటిని విస్తరించడం ఇలా ఏదో ఒక కారణంతో రోజురోజుకూ టోల్‌గేట్ల సంఖ్య పెరిగిపోతుండటంతో రుసుములు కట్టలేక వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Updated : 28 Mar 2022 09:28 IST

జాతీయ రహదారులపై 60 కి.మీ.లోపు ఉంటే మూసేస్తామన్న కేంద్రం

అలాంటివి రాష్ట్రంలో 15

ఈనాడు - అమరావతి

వాహనంతో జాతీయ రహదారిపైకి వస్తే చాలు టోల్‌బాదుడు మొదలవుతుంది. కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్నవాటిని విస్తరించడం ఇలా ఏదో ఒక కారణంతో రోజురోజుకూ టోల్‌గేట్ల సంఖ్య పెరిగిపోతుండటంతో రుసుములు కట్టలేక వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే జాతీయ రహదారులపై 60 కి.మీ.లోపు ఉన్న టోల్‌గేట్లను మూసివేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఇది అమలైతే రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో దాదాపు 15 వరకు మూతపడే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఆ మేరకు వాహనదారులకు ఊరట కలుగుతుందా? లేక తొలగించిన టోల్‌ప్లాజాల రుసుములను కూడా ఉన్నవాటిలోనే కలుపుతారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

కోల్‌కతా-చెన్నై రహదారిపైనే అధికం

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారులపై మొత్తం 57 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఇవన్నీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం 60 కి.మీ.కు ఓ టోల్‌ప్లాజా మాత్రమే ఉండాలి. అయితే వివిధ చోట్ల రహదారుల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో అదనంగా టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని చోట్ల 60 కి.మీ.లోపే టోల్‌ప్లాజాలు వచ్చాయి. రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగే కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారి (నంబర్‌ 16)పై అత్యధికంగా 19 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 60 కి.మీ.లోపు దూరంలో ఉన్నవి 7.

* తెలంగాణలోని నకిరేకల్‌ నుంచి మన రాష్ట్రంలో ఏర్పేడు వరకు జాతీయ రహదారి-565లో దావులపల్లి- మార్కాపురం- వగ్గంపల్లి మధ్య మిల్లంపల్లి, మేకలవారిపల్లిల వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య దూరం 53.8 కి.మీ. పెంచలకోన- ఏర్పేడు మధ్య ఉన్న చింతలపాలెం, రాపూరు టోల్‌ప్లాజాల మధ్య దూరం 56.35 కి.మీ.

* కర్ణాకలోని హుబ్లి నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి-67లో దోర్నాల -ఆత్మకూరు- నెల్లూరు మధ్య డీసీపల్లి, బుచ్చిరెడ్డిపాళెం వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటి మధ్య దూరం 42.35 కి.మీ..

కత్తిపూడి- ఒంగోలు మధ్య ఎన్ని?

కేంద్ర మంత్రి తాజా ప్రకటనతో.. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు అయిదు కోస్తా తీరప్రాంత జిల్లాలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారి-216లో ఎన్ని టోల్‌ప్లాజాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కాకినాడ బైపాస్‌ వద్ద, ఈపూరుపాలెం- ఒంగోలు మధ్య చినగంజాం వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. మధ్యలో మరో అయిదు ఏర్పాటు కావాల్సి ఉంది. ఆయా ప్యాకేజీల్లో పనులు పూర్తయితే వీటిని ఆరంభిస్తారు. అయితే వీటిలో రెండు, మూడు టోల్‌ప్లాజాలు 60 కి.మీ.లోపే ఉండనున్నాయి. దీంతో వేటిని ఆపేయాల్సి ఉంటుందో స్పష్టత రావాల్సి ఉంది.

తగిన ఆదేశాలు వచ్చాకే నిర్ణయం

60 కి.మీ.లోపు ఉండే టోల్‌ప్లాజాల తొలగింపునకు సంబంధించి దిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి వచ్చే సూచనలు బట్టే నిర్ణయాలు ఉంటాయని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల్లో కొన్ని ప్యాకేజీలు ‘నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ), మరికొన్ని ఈపీసీ విధానంలో నిర్మించారన్నారు. ఆయా గుత్తేదారులకు టోల్‌ వసూళ్లకు ఇంకా గడువుందని చెప్పారు. వాటిలో కొన్ని మూసివేయాల్సి వస్తే, గుత్తేదారులకు ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలు పాటిస్తామని, ఆ తర్వాతే రాష్ట్రంలో ఎన్ని టోల్‌ప్లాజాలు మూసివేస్తామనేది స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని