Andhra News: అందరికీ ఉన్నత వైద్యం

ప్రజలందరికీ ఉన్నత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మారుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. 104, 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, నాడు-నేడు ....

Updated : 02 Apr 2022 05:08 IST

అదే ప్రభుత్వ లక్ష్యం
ఆసుపత్రుల రూపురేఖలను మారుస్తున్నాం
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌
ఈనాడు - అమరావతి

ప్రజలందరికీ ఉన్నత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మారుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. 104, 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, నాడు-నేడు పనులతో ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల్లో భాగంగా ఆధునిక సౌకర్యాలతో తయారు చేసిన 500 ఏసీ వాహనాలను విజయవాడ బెంజి సర్కిల్‌వద్ద శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. ‘ప్రతి అక్క, చెల్లెమ్మకు మంచి జరగాలని తొలి నుంచీ ప్రభుత్వం అవసరమైన అడుగులు వేస్తోంది. చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే వారికి అండగా ఉంటూ పలు రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. చెల్లెమ్మ 108కి ఫోన్‌ చేయగానే వాహనం ఆమె వద్దకే వెళ్లి ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. ఆసుపత్రిలో నాణ్యమైన సేవలందించి డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులను ఇస్తున్నాం. ప్రసవానంతరం ఇంటికి వెళ్లేటప్పుడు సిజేరియన్‌ అయితే రూ.3వేలు, సాధారణ ప్రసవమైతే రూ.5వేలు ఆరోగ్య ఆసరా కింద బాలింతలకు అందజేస్తున్నాం. గతంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకం అమలు తీరు ఘోరంగా ఉండేది. వాహనాలు అరకొరగా ఉండటమే కాకుండా... వాటి పనితీరు సక్రమంగా లేదు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జెండా ఊపిన అనంతరం వాహనాలు కేటాయించిన జిల్లాలకు వెళ్లాయి. కార్యక్రమం బెంజి సర్కిల్‌లో ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి కొంతసేపు ఇబ్బందులు తలెత్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని