Andhra News: నెల కాదు.. 60 నెలలు కావాలి

రాజధాని అమరావతిలో నిలిచిపోయిన ప్రధాన మౌలిక వసతుల పనులను కోర్టు చెప్పినట్లుగా ఒక నెలలో పూర్తి చేయడం సాధ్యం కాదని, 60 నెలలు కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన

Updated : 03 Apr 2022 05:35 IST

మీరు నిర్దేశించిన గడువులోగా రాజధానిని నిర్మించలేం

ప్రభుత్వానికి ఉన్నవి పరిమిత వనరులే

మౌలిక వసతులకు గడువులైనా తొలగించండి.. ఐదేళ్ల సమయమైనా ఇవ్వండి

రాజధానిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో నిలిచిపోయిన ప్రధాన మౌలిక వసతుల పనులను కోర్టు చెప్పినట్లుగా ఒక నెలలో పూర్తి చేయడం సాధ్యం కాదని, 60 నెలలు కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ హైకోర్టులో శుక్రవారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాజధాని కేసుల్లో మార్చి 3న ఇచ్చిన తీర్పులో... రాజధాని అమరావతిలో, సీఆర్‌డీఏ పరిధిలో ప్రధాన మౌలిక వసతులను నెల రోజుల్లో కల్పించాలని, అభివృద్ధి చేసిన స్థలాలను రైతులకు 3 నెలల్లోనే ఇవ్వాలని, 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. తీర్పు వెలువడి ఆదివారానికి నెల రోజులవుతున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 21 పేజీల అఫిడవిట్‌ దాఖలు చేసింది. దానికి అనుబంధంగా జతచేసిన పత్రాలతో కలిపి మొత్తం 190 పేజీలుంది. రాజధానిలో నెల రోజుల్లోగా ప్రధాన మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలన్న నిబంధనను తొలగించాలని, లేదంటే ఐదేళ్ల గడువైనా ఇవ్వాలని కోర్టును ప్రభుత్వం అభ్యర్థించింది. తీర్పుపై న్యాయపరంగా తమ ముందున్న అవకాశాల్ని, ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని, ఈలోగా కోర్టు తీర్పు అమల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆచరణ సాధ్యం కాని అంశాల్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడానికి ఈ అఫిడవిట్‌ దాఖలు చేస్తున్నామని సీఎస్‌ పేర్కొన్నారు. ‘కోర్టు చెప్పిన గడువులోగా మొత్తం రాజధాని నగరం, సీఆర్‌డీఏ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, నెరవేర్చాల్సిన లక్ష్యాలు ఉన్నాయి. వాటికే చాలా డబ్బు కావాలి. ఆ నేపథ్యంలో రాజధాని నగరం, సీఆర్‌డీఏ ప్రాంత అభివృద్ధికి ఏళ్ల సమయం పడుతుంది. రాష్ట్రానికి పరిమిత ఆర్థిక వనరులే ఉన్నాయి. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత అభివృద్ధి, పురోగతి అన్నది నిర్దిష్ట గడువులకు లోబడి పూర్తి చేయలేం. ఆ నేపథ్యంలో నిర్దిష్ట కాలావధులు నిర్దేశించడంగానీ, ఇంత డబ్బు ఖర్చు పెడతామనిగానీ, ఫలానా సమయంలోగా ఇంత అభివృద్ధి చేస్తామనిగానీ చెప్పలేని పరిస్థితి ఉంది’ అని పేర్కొన్నారు.

అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలు..

సీఆర్‌డీఏ చట్టం ప్రకారం... భూసమీకరణ నిబంధనలు, రైతులతో సీఆర్‌డీఏ చేసుకున్న 9.14 ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం రాజధాని నగరానికే పరిమితం. సీఆర్‌డీఏ తుది మాస్టర్‌ప్లాన్‌ ఇంకా ఖరారు కాలేదు. ముసాయిదా ప్రణాళికను 2015 డిసెంబరు 26న నోటిఫై చేస్తే... 12,263 అభ్యంతరాలొచ్చాయి. వాటిని ఇంకా పరిష్కరించాలి. అయినా ఈ ప్రాంతంలో రహదారులు, ఫ్లైవోవర్ల నిర్మాణం, పార్కులు, డ్రైనేజీల అభివృద్ధి వంటి... రూ.433 కోట్ల పనుల్ని ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టింది. విజయవాడ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు దీనిలో భాగమే.

* గతంలో వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన కాంట్రాక్టు పనులను పునరుద్ధరించడానికి సమయాన్ని పొడిగిస్తూ.. గుత్తేదారులతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలి. వారిలో ఏడుగురికి మార్చి 15న సమాచారం అందజేశాం. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు వస్తాయన్న ఉద్దేశంతో... గతంలో పలు పనులు ప్రారంభించారు. ఆ ప్రతిపాదనలేవీ ఫలవంతం కాలేదు. ఈ అంశంపై ఆర్థిక సంస్థలను సంప్రదించాలి.

* ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల కోసం మార్చి 23న వివిధ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాం. ప్రధాన కార్యాలయ అధికారులను సంప్రదిస్తామని బ్యాంకర్లు చెప్పారు. సీఆర్‌డీఏ నుంచి వారు డీపీఆర్‌ కావాలన్నారు. సీఆర్‌డీఏ ఆర్థిక స్థాయి, రుణం తిరిగి చెల్లించేందుకు ఉన్న వనరుల గురించీ సమాచారం కోరారు.

* రహదారుల అలైన్‌మెంట్‌, భూసేకరణతో ముడిపడి ఉన్న వ్యవహారంపై 28 వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి.

* మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం రూ.1.09 లక్షల కోట్లు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టులో కేంద్రానికి లేఖ రాసింది. రూ.62,625 కోట్ల అంచనాతో డీపీఆర్‌ సమర్పించాం. కేంద్రం దానిపై స్పష్టత కోరింది. అది ఇచ్చే పనిలో ఉన్నాం.

* రాజధాని ప్రాంతంలో పనులు పూర్తి చేయడానికి రూ.42,231 కోట్లను అంచనాగా గతంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2015-19 మధ్య రూ.1,377 కోట్లు, 2020-22 మధ్య రూ.1,646 కోట్లు మంజూరు చేసింది. సీఆర్‌డీఏ సేకరించిన రుణం రూ.5,122 కోట్లు. మౌలిక సదుపాయాలు, రాజధాని నగర నిర్మాణాన్ని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం విడతల వారీగా అమలు చేయాలి. మాస్టర్‌ప్లాన్‌ అమలు కోసం... బ్యాంకుల నుంచి సీఆర్‌డీఏ రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అయితే సీఆర్‌డీఏ ఆ మేరకు నిధులు సమకూర్చలేకపోయింది. ప్రభుత్వ హామీని పొడిగించాలని కోరుతూ సీఆర్‌డీఏ తాజాగా ప్రతిపాదనలు పంపింది.

* ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి గతంలో బ్యాంకుల కన్సార్షియం రూ.2,060 కోట్లు మంజూరు చేసింది. రూ.1,862 కోట్లు ఇదివరకే విడుదల చేసింది. మిగతా రూ.198 కోట్ల విడుదలకు అంగీకారం తెలిపి ఇటీవలే యూబీఐ రూ.93 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.105 కోట్లు త్వరలో అందుతాయని భావిస్తున్నాం. ఈ పనులు మళ్లీ మొదలయ్యాయి. వాటి పూర్తికి ఈ ఏడాది నవంబరు వరకు సమయం పొడిగించాం. ఎన్జీవో అపార్టుమెంట్లు, గెజిటెడ్‌ అధికారుల టైప్‌-1, టైప్‌-2 అపార్టుమెంట్లు, గ్రూప్‌-డి అపార్టుమెంట్ల పనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.

60 నెలల సమయం ఇలా..

ఎ) గుత్తేదారు సంస్థలు గడువు పొడిగింపు ప్రతిపాదనలు సమర్పించేందుకు, వాటిపై చర్చించి, ఆమోదించి, అనుబంధ ఒప్పందం చేసుకునేందుకు 2 నెలలు పడుతుంది.

బి) సర్వే, డిజైన్లు పూర్తికి 4 నెలలు కావాలి.

సి) యంత్రాలు, మానవ వనరులను సమకూర్చుకునేందుకు 2 నెలల సమయం పడుతుంది.

డి) రహదారుల నిర్మాణానికి 16 నెలల సమయం పడుతుంది.

ఈ) రహదారుల పనులు పూర్తయ్యాక నీటి సరఫరా, మురుగు రవాణా వ్యవస్థ, విద్యుత్‌ తదితర పనులు చేపట్టేందుకు 36 నెలలు పడుతుంది.

* ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీర్పులో పేర్కొన్న నిర్దిష్ట సమయంలో రాజధాని నగర ప్రాజెక్టు, రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. వాటిని పూర్తి చేయడానికి నిధులు అవసరం. రాజధాని నగరాన్ని పూర్తి చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది.

* భూసమీకరణ పథకం నిబంధనల ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి.. భూసమీకరణ పథకం తుది నోటిఫికేషన్‌ ఇచ్చిన 3 నెలల్లో రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు తిరిగి ఇవ్వాలి. ఆ కాలాన్ని మరో నాలుగేళ్లు (2024 జనవరి వరకూ) పొడిగిస్తూ.. 2020 జులై 10న సీఆర్‌డీఏ చట్టంలోని అధికారాన్ని వినియోగించి తీర్మానించారు.

* రాజధాని ప్రాంతంలో భూసమీకరణ ద్వారా సేకరించడం సాధ్యం కాని 2,630 ఎకరాల ‘భూసేకరణ’కు ప్రక్రియను ప్రారంభించాం. 2,100 ఎకరాల విషయంలో ముసాయిదా ప్రకటన జారీచేశాం. 191 ఎకరాల విషయంలోనే అవార్డు జారీచేశాం. భూసేకరణ ప్రక్రియపై చాలా వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి.

* రైతులకు ఇచ్చిన స్థలాల్లో, ఇంకా రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఉన్న 22,276 స్థలాల్లో... 17,357 రిజిస్ట్రేషన్‌కు అర్హమైనవి. మిగిలిన 4,919 ప్లాట్లకుగానూ 1,598 ప్లాట్ల విషయంలో వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 31లోగా రిటర్నబుల్‌ ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని యజమానులకు సమాచారం ఇచ్చాం. 16,055 ప్లాట్ల విషయంలో 6,149 మంది యజమానులకు సమాచారం పంపించాం. అందులో 241 నివాస, 107 వాణిజ్య ప్లాట్లు మాత్రమే 2022 మార్చి 3 నుంచి రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి.

* ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు సంబంధించి గతంలో భూసమీకరణలో తక్కువ మందే భూములివ్వడం, మిగతావి భూసేకరణలో తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడం, దానిపై కోర్టులో వ్యాజ్యాలు పడటంతో... రైతులకు స్థలాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి కాలేదు. 643 ఎకరాలకు సంబంధించిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు 6 నెలలు పడుతుంది.

* రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని భూముల అమ్మకం ద్వారా సమకూర్చుకునే అధికారం సీఆర్‌డీఏకి ఉంది. కానీ 2019 ఫిబ్రవరి 5న జారీచేసిన జీవో నం.50 ప్రకారం 2023 నుంచి మాత్రమే సీఆర్‌డీఏ భూముల్ని విక్రయించి నిధులు సమకూర్చుకోగలదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని