Andhra News: అందుబాటులో జిల్లా కేంద్రం

జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో జిల్లా కేంద్రాలు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే 3 జిల్లా కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా

Updated : 04 Apr 2022 12:45 IST

3 చోట్ల జిల్లా కేంద్రాలను మార్చి ప్రకటించాం
సౌలభ్యం కోసమే ‘ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో’ అనే నిబంధనను సడలించాం
‘ఈనాడు-ఈటీవీ’తో ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో జిల్లా కేంద్రాలు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే 3 జిల్లా కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలనే.. ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉంచాలనే నిబంధననూ సడలించామని చెప్పారు. ‘నరసాపురం మూలగా ఉండటంతో మధ్యలో ఉండే భీమవరాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించాం. రాజంపేట, మదనపల్లె చెరో పక్కగా ఉండటంతో మధ్యలో ఉండే రాయచోటి జిల్లా కేంద్రమైతే అనువుగా ఉంటుందని భావించాం. పుట్టపర్తి అయితే కదిరి, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుందని ఆలోచించాం. అందుకే ఈ 3 చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాం’ అని ఆయన వివరించారు. వీటిపై స్పందనలు మిశ్రమంగా ఉండటంతో ప్రకటించిన మేరకే కొనసాగించామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆదివారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. ‘జిల్లాల పేర్లపైనా చాలా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకుంటే తేల్చడం కష్టమనే పక్కన పెట్టాం’ అని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో సహేతుకమైన వాటిని ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు.  

లోక్‌సభ నియోజకవర్గమే ప్రాతిపదికగా అనుకున్నా..

‘లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని సాధ్యమైనంత వరకు పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా చూడాలనే ఆలోచన చేశాం. అయితే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడున్న జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటం, ఆ నియోజకవర్గాన్ని పక్క జిల్లాలో చేరిస్తే ప్రజలు ఇబ్బంది పడతారని భావించినప్పుడు మినహాయింపులిచ్చాం. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన సంతనూతలపాడును ఒంగోలులో, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లిని నెల్లూరులో, నంద్యాల లోక్‌సభలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలులో, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాప్తాడును అనంతపురం జిల్లాలో, చిత్తూరు లోక్‌సభ పరిధిలోని చంద్రగిరిని తిరుపతిలోనే ఉంచుతూ ప్రతిపాదించాం. జనవరి 25న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను ఆహ్వానించగా 16,660 వినతులొచ్చాయి. ఇందులో ప్రధానమైనవిగా 284 గుర్తించాం. వీటిని పరిశీలించిన ప్రభుత్వం.. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఒక నియోజకవర్గాన్ని 2 జిల్లాల్లోకి విభజించాల్సి వచ్చినప్పుడు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలించింది.

సగటున 8 నుంచి 12 మండలాలతో రెవెన్యూ డివిజన్‌

రెవెన్యూ డివిజన్‌ అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు గతంలో ఉన్న 51 రెవెన్యూ డివిజన్లను 62కి పెంచుతూ ప్రతిపాదించాం. చివరకు 72 ఏర్పాటయ్యాయి. కొత్తగా 23 డివిజన్లు వచ్చాయి. సగటున ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో 8 నుంచి 12 మండలాలుంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కుప్పంలో 4 మండలాలకే డివిజన్‌ ఏర్పాటు చేశాం. విజయవాడ, విశాఖపట్నం నగర ప్రాంతాలు కావడంతో జనాభా ఎక్కువ, మండలాలు తక్కువ కావడంతో అయిదారు మండలాలను డివిజన్‌ చేశాం. మండలాల సంఖ్య తగ్గడంతో కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ను తొలగించాం.

వారంలో రెండు రోజులు రంపచోడవరంలోనే..

రంపచోడవరం, ఎటపాక, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మండలాలు, మారేడుమిల్లి, దేవీపట్నం 200 కి.మీ.పైనే దూరంలో ఉన్నాయి. ఈ ఇబ్బందిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్‌ వారంలో 2 రోజుల పాటు రంపచోడవరం నుంచే విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగమంతా రెండు రోజులు అక్కడే అందుబాటులో ఉంటారు’ అని విజయ్‌ కుమార్‌ వివరించారు.

12 మంది ఎమ్మెల్యేలకు 2 జిల్లాల్లో ప్రాతినిధ్యం

విజయనగరంలో మెంటాడ, విశాఖపట్నంలో పెందుర్తి, తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి, గోకవరం, తాళ్లరేవు, కాజులూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమల, నెల్లూరు జిల్లాలో రాపూరు, సైదాపురం, కలువాయి, చిత్తూరు జిల్లాలో పుత్తూరు, వడమాలపేట, కడప జిల్లాలో సిద్దవటం, ఒంటిమిట్ట, కర్నూలు జిల్లాలో పాణ్యం, గడివేముల, అనంతపురం జిల్లాలో రామగిరి, కనగానపల్లె, చెన్నేకొత్తపల్లి మండలాలకు సంబంధించి మార్పులు జరిగాయి. ఈ మండలాలన్నీ ప్రతిపాదించిన జిల్లా నుంచి పక్క జిల్లాకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో 12 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు 2 జిల్లాల్లో ప్రాతినిధ్యం లభించనుంది. సాలూరు, పెందుర్తి, జగ్గంపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, అనపర్తి, గోపాలపురం, వెంకటగిరి, నగరి, పాణ్యం, రాజంపేట, రాప్తాడు ఎమ్మెల్యేలకు ఇలాంటి అవకాశముంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని