Andhra News: ఉపాధ్యాయులు పాఠ్యప్రణాళిక సిద్ధం చేయాల్సిందే..!

ఉపాధ్యాయులు ఏటేటా వారి సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. సబ్జెక్టుల్లో వచ్చిన తాజా పరిణామాలను ఇందులో

Updated : 06 Apr 2022 06:39 IST

ప్రధానోపాధ్యాయుడి అనుమతితో అమలుచేయాలి

పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులు ఏటేటా వారి సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. సబ్జెక్టుల్లో వచ్చిన తాజా పరిణామాలను ఇందులో పొందుపర్చాలని సూచించింది. అకడమిక్‌, పరిపాలన సంస్కరణల అమలుకు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అకడమిక్‌ పర్యవేక్షణ అధికారులు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాటించాల్సిన నిబంధనలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. పాఠ్యప్రణాళిక సృజనాత్మకంగా, విద్యార్థుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని.. గత ప్రణాళికలకు చూచిరాతగా ఉండకూడదని పేర్కొంది. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గది పరిశీలనకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడి సూచనలు పాటించాలని, తాజా పరిణామాలతో కూడిన పాఠ్యప్రణాళిక పుస్తకాన్ని నిర్వహించాలని ఆదేశించింది. తరగతి గదిలోకి వెళ్లే ముందు బోధించే పాఠ్యప్రణాళికను ప్రధానోపాధ్యాయుడు ఆమోదించాల్సి ఉంటుందని వివరించింది. తరగతిలో వెనుకబడడానికి విద్యార్థి మాత్రమే కారణం కాదనే అంశాన్ని ప్రధానోపాధ్యాయుడు గుర్తించాలని, దీనిపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని పేర్కొంది.

* ప్రధానోపాధ్యాయుడు పాఠశాల ప్రమాణాలను నిర్దేశించుకోవాలి. విద్యా సంవత్సరం ముగిసేనాటికి ఆ లక్ష్యాలను సాధించాలి.

* అభ్యసన ఫలితాలు, తరగతి గది పరిశీలన ఆధారంగా సిబ్బంది సమావేశాన్ని ప్రధానోపాధ్యాయుడు సృజనాత్మకంగా నిర్వహించాలి.

* తరగతి జరిగే సమయంలో ఉపాధ్యాయులందరూ సెల్‌ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేయాలి. ఉపాధ్యాయుల సామర్థ్యాలు, వారి ఆసక్తికి అనుగుణంగా సహపాఠ్యాంశాలు, పీరియడ్లను ప్రధానోపాధ్యాయుడు కేటాయించాలి. పాఠశాల ఆస్తులు, వాటి నిర్వహణతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాలి.

* ఎక్కువ రోజులు బడికి గైర్హాజరైన విద్యార్థుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయ విద్య, సంక్షేమ సహాయకులు, సీఆర్సీల ద్వారా తెలుసుకోవాలి. ఎనిమిదో తరగతినుంచే విద్యార్థులకు కెరీర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.

* అందుబాటులో ఉన్న డిజిటల్‌ లెర్నింగ్‌పై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలి. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోని క్యూఆర్‌కోడ్‌లతో అకడమిక్‌ను బలోపేతం చేయాలి.

* అకడమిక్‌ పర్యవేక్షణ అధికారులు నిత్యం పాఠశాలలను సందర్శిస్తూ వాటి పనితీరును అంచనావేయాలి. వెనకబడిన బడులను పరిశీలిస్తూ ఉండాలి.

* డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు బడులను సందర్శించినప్పుడు ఆదర్శ తరగతి గది విధానాన్ని అమలుచేయాలి. పాఠశాలలో గుర్తించిన లోపాలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి సిఫార్సులను తెలపాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని