Updated : 18 Apr 2022 05:18 IST

Andhra News: ముడితేనే మ్యుటేషన్‌!

దరఖాస్తుల్లో 45 శాతం వరకు తిరస్కృతి

సాంకేతిక అంశాలు కొన్ని.. కుంటి సాకులు మరికొన్ని

లంచాలే అసలు కారణం!

ఈనాడు - అమరావతి

మండల తహసీల్దార్‌ కార్యాలయాలు భూముల మ్యుటేషన్‌ దరఖాస్తులను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండానే.. అదనపు సమాచారం కావాలంటూ దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నాయి. రైతులు ఫీజు కట్టి.. సమర్పించే దరఖాస్తుల్లో 45 శాతం వరకు చిన్నచిన్న కారణాలతోనే తిరస్కృతి జాబితాలోకి చేరుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది పరిస్థితి తీవ్రతను స్పష్టంచేస్తోంది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో మ్యుటేషన్‌ పూర్తి చేసేందుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఒక కారణమైతే.. అడిగినంత మామూళ్లు ఇవ్వకుంటే కొన్ని మండలాల్లో దరఖాస్తులను పరిశీలించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. కిందటేడాది పూర్వ విశాఖ జిల్లాలో చోడవరం తహసీల్దార్‌ రూ. 4.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ శాఖలో నమోదయ్యే అవినీతి కేసుల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలో మ్యుటేషన్‌ కోసం వసూళ్లు జరుగుతుండగా కొన్నిసార్లు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కుతున్నారు.

మ్యుటేషన్‌ జరిగితేనే..
క్రయ, విక్రయాలు పూర్తయ్యాక కొత్త యజమాని పేరు రికార్డుల్లో చేర్చడమే మ్యుటేషన్‌ అంటే. పేరు మార్పు జరిగాక వచ్చే యాజమాన్య హక్కులతో బ్యాంకుల నుంచి రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రెవెన్యూ శాఖలో వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు కొందరు దీనిని అవకాశంగా తీసుకుని పేట్రేగిపోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం వచ్చిన తర్వాత మ్యుటేషన్‌కు డిమాండ్‌ పెరిగింది. మండల స్థాయిలో నెలకు కనీసం 200 నుంచి 500 దరఖాస్తులు వస్తుంటాయి.

నగరాలు/పట్టణాలకు సమీపంలోని మండలాల్లో అయితే నెలకు 1,000 వరకు ఉంటాయి. దరఖాస్తు అందిన రెండు వారాలకు వివరాలను సంబంధిత గ్రామంలో బహిర్గతం చేయాలి. అభ్యంతరాలు రాకుంటే.. వెబ్‌ల్యాండ్‌లో పేరు మార్చి, పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు చేయాలి. అలాగే వారసత్వంగా వచ్చిన భూములపై కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్య పత్రాలు రాసుకుని.. వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వస్తే, వాటిపై హక్కుల బదలాయింపు నెలరోజుల్లోగా పూర్తి కావాలి. కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారు. భూమి కొలతల్లో తేడాలు ఉన్నాయని, సబ్‌ డివిజన్‌ కాలేదనే కారణాలతో దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు వస్తే ఫ్యామిలీ సర్టిఫికేట్‌, ఇతరత్రా వివరాలు కావాలంటున్నారు. గత రెండు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలోని ఓ మండలంలో 60 శాతం తిరస్కారానికి గురయ్యాయి. ఆన్‌లైన్‌లో ఉన్న దాని కంటే తక్కువగా విస్తీర్ణం ఉండడం వల్ల కొన్ని పక్కన పడుతున్నాయి. ఒక సర్వే నంబరులో కొంత భాగానికి ఎవరైనా వన్‌టైం కన్వర్షన్‌ కింద దరఖాస్తు చేసుకున్నా మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడంలేదు. అయితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడం వల్ల కూడా మ్యుటేషన్లు ఆగిపోతున్నాయని, లింక్‌ డాక్యుమెంట్లు లేకున్నా.. దరఖాస్తుదారులు సమర్పించిన ఆధారాలు సహేతుకంగా లేకున్నా.. తిరస్కరించక తప్పడంలేదని సిబ్బంది చెబుతున్నారు.


25 శాతం తిరస్కృతి
దరఖాస్తులు పరిశీలించాలి

అదనంగా విస్తీర్ణం కోసం క్లెయిమ్‌ చేశారనో, సబ్‌ డివిజన్‌ అవసరమన్న కారణాలతోనో కొన్నిచోట్ల మ్యుటేషన్లు దరఖాస్తులు తిరస్కరించకూడదని భూ పరిపాలన శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు జిల్లాలకు సూచనలు పంపింది. ఒకవేళ అదనంగా సర్వే అవసరమైతే.. మ్యుటేషన్‌ గడువులోగా సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దరఖాస్తులు తిరస్కరిస్తే.. అందుకు దారితీసిన కారణాలు, స్పీకింగ్‌ ఉత్తర్వులను దరఖాస్తుదారులకు కచ్చితంగా తెలియచేయాలని తెలిపింది. కుటుంబ వివాదం కారణాలతో దరఖాస్తులను తిరస్కరించకుండా పూర్తిస్థాయిలో విచారణ జరిపాకే కేసు ముగించాలని పేర్కొంది. కోర్టు కేసుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు లేనట్లయితే.. ఏ కేసునూ తిరస్కరించకూడదు/పెండింగులో ఉంచకూడదని ఆదేశించింది. అసైన్డ్‌ భూముల విషయంలో, అసలైన వారసులు మాత్రమే మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మూడో పార్టీ చేయకూడదు. అసైనీ మరణించినట్లయితే.. రికార్డుల్లో మార్పులు చేసేందుకు అసైన్మెంట్‌ రివ్యూ కమిటీ అనుమతి అవసరం తెలిపింది. యాదృచ్ఛికంగా తిరస్కరించిన దరఖాస్తుల్లో 25% కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి పరిశీలించాలని తెలిపింది.


కిందటేడాది రెవెన్యూ శాఖలో నమోదైన 36 అవినీతి కేసుల్లో మ్యుటేషన్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ శాఖలో భూ సంబంధిత పనులకు లంచాల బెడద ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు, మ్యుటేషన్‌, భూముల సర్వే, ఇతర పనులకు భారీస్థాయిలో వసూళ్లు జరుగుతున్నాయి. ఒకవేళ దరఖాస్తుదారు మ్యుటేషన్‌కు అర్హుడు కాదనుకుంటే దానిని నిర్ధారించాల్సిన బాధ్యత తహసీల్దార్లపైనే ఉంది. అయితే... పదేపదే ఇంకా ఆధారాలు కావాలంటూ దరఖాస్తుదారులను రెవెన్యూ సిబ్బంది ముప్పతిప్పలు పెడుతున్నారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని