Andhra News: మందుల్లేవాయే!

ప్రభుత్వాస్పత్రికి మరోపేరు.. ధర్మాసుపత్రి. అంటే వైద్యపరీక్షల నుంచి చికిత్సలు, మందులు అన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే ప్రైవేటు ఆస్పత్రులలో ఖర్చు భరించలేని పేదలు ప్రభుత్వాస్పత్రి వైపే చూస్తారు. కానీ, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది.

Updated : 11 Aug 2022 14:38 IST

ప్రభుత్వాస్పత్రుల్లో కరవైన మందులు, సర్జికల్స్‌
గ్లౌజులు, దూదీ కరవే.. యూరిన్‌ బ్యాగులకూ కటకట
5 మాత్రలు రాస్తే ఇచ్చేది మూడే.. బయట కొనాలని సూచనలు
గుత్తేదారులకు కోట్లలో బిల్లుల పెండింగ్‌తోనే సమస్య
‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడి
ఈనాడు-అమరావతి, ఈనాడు యంత్రాంగం

ప్రభుత్వాస్పత్రికి మరోపేరు.. ధర్మాసుపత్రి. అంటే వైద్యపరీక్షల నుంచి చికిత్సలు, మందులు అన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే ప్రైవేటు ఆస్పత్రులలో ఖర్చు భరించలేని పేదలు ప్రభుత్వాస్పత్రి వైపే చూస్తారు. కానీ, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైద్యులు రోగులను చూస్తున్నారు గానీ... మందుల విషయంలో చేతులెత్తేస్తున్నారు. బీపీ, షుగర్‌ మాత్రల నుంచి శస్త్రచికిత్సలో వాడే గ్లౌజులు, దారాల వరకూ అన్నింటినీ రోగుల బంధువులే కొనుక్కుని తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చేసే ప్రకటనలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండట్లేదు. రాష్ట్రంలోని పలు బోధన, జిల్లా ప్రభుత్వాస్పత్రులను ‘ఈనాడు’ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడు ఈ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. నెలకు లేదా.. కనీసం 15 రోజులకు సరిపడా ఇవ్వాల్సిన బీపీ, షుగర్‌ మాత్రలు కూడా అయిదు రోజులకు సరిపోయేవే ఇస్తున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ఈ విషయాన్ని బోర్డు పెట్టి మరీ చెబుతున్నారు.

బయట మందులు కొనే ఖర్చుకంటే ఆస్పత్రికి వచ్చేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ కావడంతో రోగులు రావడానికి వెనకాడుతున్నారని ఓ సీనియర్‌ వైద్యుడు వ్యాఖ్యానించారు. మరోవైపు.. చాలా ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు అయ్యిన బిల్లులు పెద్దమొత్తంలో గుత్తేదారులకు పెండింగ్‌ ఉండటంతో ఇక తాము సరఫరా చేయలేమని వాళ్లు తెగేసి చెబుతున్నారు. గుండె, ఎముకల శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికీ స్టాక్‌ లేదంటూ 15 రోజులకే ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో దూదికి కూడా కొరతగానే ఉంటోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో చెవిలో వేసే డ్రాప్స్‌ కూడా లేవని సిబ్బంది రోగులకు చెబుతున్నారు. ఇక్కడ ఏడాదికి రూ.2కోట్ల మందులు అవసరం కాగా.. రూ.కోటి విలువైన మందుల సరఫరా జరుగుతోంది. ఏలూరు జిల్లా ఆస్పత్రిలో కిడ్నీ, కార్డియాలజీ, న్యూరాలజీ వైద్యం కోసం వినియోగించే పలురకాల మందులు, యాంటీ బయాటిక్స్‌, మానసిక దౌర్బల్యానికి వాడే మందులు, కాల్షియం మాత్రలు, కొన్ని ఆయింట్‌మెంట్లు, సెలైన్లు, సర్జికల్స్‌, దూది, బ్యాండేజీలు, ఐవీ సెట్లు, కుట్లు వేసే సామగ్రి అందుబాటులో లేవు. కర్నూలులోని సర్వజన వైద్యశాలలో కార్డియాలజీలో అత్యవసర మందులు లేక, బయట కొనాలని రోగులకు రాసిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగులు సైతం మందులు, ఆప్రాన్‌, గ్లౌజులు బయట కొంటున్నారు.

మంత్రి రజని వచ్చి వెళ్లినా... పురోగతి అంతంత మాత్రమే

గుంటూరు జీజీహెచ్‌లో ఇంజెక్షన్లు చేసే సిరంజీలు, పడకపై ఉండి, మరుగుదొడ్డికి వెళ్లలేని వారికి ఉపయోగించే ఐసీడీ ట్యూబ్స్‌, టీపీసెస్‌లు లేవు. శస్త్రచికిత్స థియేటర్లలో రక్తం కింద పడకుండా ఉపయోగించే సామగ్రి, కుట్లువేసే సామగ్రి, ఇతర అవసరాలకు వినియోగించే చిన్నచిన్న వస్తువులు లేవు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని వచ్చి వెళ్లినా.. వీటి విషయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి మాట్లాడుతూ సర్జికల్స్‌, కుట్ల సామగ్రి కొంత కొరతగా ఉన్నా వాటిని ఆస్పత్రి ద్వారానే కొని అందిస్తున్నామని తెలిపారు.


సరఫరా ఆగినందునే రాస్తున్నాం
- సూరిబాబు, గిద్దలూరు వైద్యుడు

యర్రగొండపాలెంలోని ఆస్పత్రిలో గ్లౌజులు, కుట్లు వేసే దారానికి తీవ్ర కొరత ఉండటంతో ఆ భారమంతా రోగులపైనే పడుతోంది. గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలలో సర్జికల్‌ వస్తువుల కొరతపై ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ సూరిబాబు స్పందిస్తూ ‘గతంలో ప్రాంతీయ వైద్యశాలలో ఉన్న పీపీ యూనిట్‌ను సంజీవరాయునిపేటకు తరలించారు. దాంతో జిల్లా వైద్యశాఖ నుంచి సర్జికల్‌ సామగ్రి నిలిచిపోయింది. ఫలితంగా రోగులకు రాస్తున్నాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.


సెలైన్లకూ కొరతే!

విశాఖ కేజీహెచ్‌లో నెలకు 30వేల వరకు సెలైన్‌ బాటిల్స్‌ వినియోగం ఉంటుంది. కొన్ని ఇంజెక్షన్ల వినియోగం వేలల్లో ఉండగా సీడీఎస్‌ నుంచి తక్కువగా వస్తున్నాయి. నెలకు పాన్‌టాప్‌, ఒమిప్రజోల్‌ వంటివి 2లక్షల మాత్రల వరకు అవసరం కాగా పంపిణీ బాగా తగ్గింది. మందుల కొరత లేదని కేజీహెచ్‌ పర్యవేక్షణాధికారి మైథిలి పేర్కొన్నారు. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో చెవిలో దురద సమస్యను తగ్గించే క్లోట్రిన్‌, తల తిరిగే సమస్యకు వెర్టిన్‌ మందులు నెల రోజుల నుంచి అందుబాటులో లేవు.


వంద రకాల మందుల్లేవు

కాకినాడ జీజీహెచ్‌లో మందులు, సర్జికల్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ నిధులు కేటాయించలేదు. అత్యవసర నిధుల కింద మందులకు రూ.49లక్షలు, సర్జికల్స్‌కు రూ.40లక్షలు కేటాయించినా ఉపయోగం లేదు. ఆప్రాన్లు, సక్షన్‌ కెథటర్లు, యూరినరీ కెథటర్లు, ఐవీ ప్లూయిడ్లు, పలు రకాల యాంటీబయోటిక్స్‌ లేవు. జీజీహెచ్‌లో 300-450 రకాల మందులు ఉండాలి. ప్రస్తుతం 100 రకాల మందులు లేవు. రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో పలు కీలక యాంటీబయోటిక్స్‌, కాల్షియం, గ్యాస్ట్రిక్‌, బీపీ, మధుమేహ మందుల కొరత ఉంది. ఇన్‌పేషెంట్లకు యూరిన్‌ బ్యాగ్‌, కాన్యులాలను రోగులే తెచ్చుకోవాల్సి వస్తోంది. సీడీఎస్‌ నుంచి 60% మందులు రావడం లేదు. మండపేట సీహెచ్‌సీలో 6 నెలలుగా యాంటీబయోటిక్స్‌ లేవు.

* ఇతర మందులు వినియోగించేటప్పుడు కడుపులో మంట రాకుండా ముందుజాగ్రత్తగా పాన్‌టాప్‌ వాడతారు. నెల్లూరు బోధనాసుపత్రిలో ఈ మాత్రలకు కొరత ఉండటంపై రోగులు ఆవేదన చెందుతున్నారు. మల్టీ విటమిన్‌, జింక్‌ సిరప్‌, పాన్‌టాప్‌, ర్యానిటిడిన్‌, గ్లైమ్‌ప్రైడ్‌ (మధుమేహం), బి-కాంప్లెక్స్‌, సిప్రోఫ్లాక్సాసిన్‌, యాంబ్రాక్సాల్‌ సిరప్‌లు లేవు.

* విజయనగరం కేంద్రాస్పత్రిలో ఎముకలు విరిగితే కట్లు కట్టడానికి వినియోగించే పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) లేదు. అత్యవసర మందుల కింద బయట కొంటున్నారు. ఘోషాస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. అక్కడ రోజుకు రూ.10 వేలు ఆస్పత్రి అభివృద్ధి నిధులను మందుల కోసం వెచ్చిస్తున్నారు.


గుత్తేదారులకు నిలిచిన చెల్లింపులు

బోధనాస్పత్రుల్లో మందులు సరఫరా చేసిన గుత్తేదారులకు భారీగా బకాయిలున్నాయి. విశాఖ కేజీహెచ్‌లో దాదాపు రూ.కోటి వరకు బిల్లులు చెల్లించాలి. కర్నూలు జీజీహెచ్‌లో రూ.90లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లోఉన్నాయి. గుంటూరు జీజీహెచ్‌కు గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఔషధాలకు రూ.9.85 కోట్లు రాగా అందులో 9.38 కోట్లను వినియోగించారు. సీడీఎస్‌లో లేని మందులు, సర్జికల్స్‌ను ప్రైవేటు దుకాణాల నుంచి సమకూర్చుకోగా వాటికి బిల్లు బకాయిలు రూ.3కోట్లకు పేరుకుపోయాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.5 కోట్లు నిలిచిపోయాయి.


గ్లౌజు, కుట్టుదారం తెచ్చుకోమన్నారు

నా భార్యను కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కోసం గిద్దలూరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చా. శస్త్రచికిత్సకు అవసరమైన గ్లౌజు, కుట్టువేసే దారం, ఇతరాలు కొని తేవాలని వైద్యులు రాసిచ్చారు. వీటిని కొని తెచ్చాను.

- బొల్లెబోయిన ప్రసాద్‌, రాజుపాలెం, గిద్దలూరు, ప్రకాశం జిల్లా


చిత్రంలోని కర్నూలుకు చెందిన మధుకుమార్‌ ఐదురోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడగా కర్నూలు సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. పక్కటెముకలకు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రిలో గ్లూకోజ్‌ తప్ప ఎలాంటి మందులూ ఇవ్వలేదు. మోనోసెఫ్‌, పాన్‌టాప్‌, లివిపిల్‌ వంటి పలు రకాల ఇంజెక్షన్లన్నీ బయటకు రాశారు. మధుకుమార్‌ ఆరోగ్యశ్రీ కింద చేరినా, ఆస్పత్రి నుంచి మందులు అందలేదు. బాధితుడి తల్లి సుమారు రూ.8వేలకు పైగా వెచ్చించి బయట కొనాల్సి వచ్చింది. ‘వైద్యులు చూసి వెళ్తున్నారు, మేమిచ్చిన ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అంతకుమించి మందులేవీ ఆస్పత్రి వాళ్లు ఇవ్వలేదు’ అని బాధితుడి తల్లి విలపించింది.


ఆస్పత్రికి వచ్చేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ

కొన్నేళ్లుగా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నా. గతంలో 15 రోజులకు సరిపడా మందులు ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం ఐదు రోజులకు తగ్గించారు. బయట కొనలేక, భారమైనా సిటీబస్సులో జీజీహెచ్‌కు వస్తున్నా. ఎండల వల్ల రావడం మరింత ఇబ్బందిగా ఉంది.

- శివానందనరావు, మధురానగర్‌, విజయవాడ


ఛాతీనొప్పి రావడంతో ఏప్రిల్‌ 20న రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో 4రోజులు చికిత్స పొందాను. డిశ్ఛార్జి సమయంలో ఆరు రకాల మాత్రలు రాస్తే మూడే ఇచ్చారు. మిగిలిన వాటిని నేనే కొనుక్కోవాల్సి వచ్చింది.

- శేషారత్నం, బుచ్చింపేట, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా

 


కొన్ని మందులు కావాలని చెప్పాం

‘ఆస్పత్రికి అవసరమైన అన్ని రకాల మందులనూ ఎప్పటికప్పుడు తెప్పిస్తూనే ఉన్నాం. ఇండెంట్‌ ప్రకారం మందులు వస్తున్నాయి. కిడ్నీ, థలసేమియా లాంటి వ్యాధులకు సంబంధించిన మందులు కావాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం’              

- సౌభాగ్యలక్ష్మి, విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని