Andhra News: ఉపాధి లేమితో ఉత్పాతం

రాష్ట్రంపై వృద్ధాప్య ఛాయలు పరచుకుంటున్నాయా? మెరుగైన ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడటం వల్ల ఏపీలో వయసు మళ్లినవారే ఎక్కువగా మిగలనున్నారా? మరో రెండు,

Updated : 02 May 2022 07:17 IST

రేపటి మొనగాళ్లు... ఏరీ ఎక్కడ?

రాష్ట్రంలో 0-14 ఏళ్ల పిల్లలు 19.4 శాతమే

దేశంలోకెల్లా ఏపీలోనే అతి తక్కువ

వలసలు పెరగడమే ఇందుకు కారణం

మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనతోనే పరిస్థితిలో మార్పు

రాష్ట్రంపై వృద్ధాప్య ఛాయలు పరచుకుంటున్నాయా? మెరుగైన ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడటం వల్ల ఏపీలో వయసు మళ్లినవారే ఎక్కువగా మిగలనున్నారా? మరో రెండు, మూడు దశాబ్దాల్లో వృద్ధుల రాష్ట్రంగా మిగలబోతోందా? రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, విద్యా రంగ పరిస్థితుల్ని గమనిస్తే ఇదే జరగబోతోందని అర్థమవుతోంది.

ఈనాడు - అమరావతి

కేంద్ర జనాభా లెక్కల విభాగం రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం 2019కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) నివేదిక ఈ విషయాన్నే సూచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో పద్నాలుగేళ్లు, అంతకంటే తక్కువ వయసు పిల్లల శాతం దేశం మొత్తం మీద రాష్ట్రంలోనే తక్కువని నివేదిక వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో 0-14 సంవత్సరాల పిల్లలు 19.4 శాతమే ఉన్నారు. జాతీయ సగటు 25.4 శాతం. ఇవి 2017-19 మధ్య కాలానికి సంబంధించి ఎస్‌ఆర్‌ఎస్‌ సర్వే లెక్కలు. ఆ తర్వాత మూడేళ్ల కాలంలో ఉపాధి వెతుక్కుంటూ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు యువత వలసలు మరింత పెరిగి ఉంటాయని నిపుణుల అంచనా. యువత పెద్ద ఎత్తున వలస వెళ్తుండటం రాష్ట్రానికి శ్రేయోదాయకం కాదు.

సారవంతమైన పంట భూములు, అపారమైన ఖనిజ సంపద, సుదీర్ఘ సముద్ర తీరం వంటి ప్రకృతి సిద్ధమైన అనుకూలతలు అనేకం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఈ దుస్థితి ఎదురవుతుండటం ఆలోచించాల్సిన అంశం.

యువత వలసలకు ప్రధాన కారణాలివీ..
* గట్టిగా ఓ వెయ్యి మందికి ఉపాధి కల్పించే పెద్ద పరిశ్రమలేవీ రాష్ట్రంలో రాలేదు. విశాఖలో కొన్ని ఫార్మా పరిశ్రమలు, చిత్తూరులో శ్రీసిటీ వంటి చోట్ల కొన్ని పరిశ్రమలు తప్ప పేరెన్నికగన్నవి లేవు.

* ఏ రాష్ట్రం తీసుకున్నా వివిధ రంగాలకు సంబంధించినవి 10-15 విశిష్ట విద్యా సంస్థలు (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఉంటాయి. మన రాష్ట్రంలో ఆ స్థాయి విద్యా సంస్థ ఒక్కటీ లేదు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసినప్పటికీ... పూర్తి స్థాయిలో నిధులు, వనరులు సమకూర్చకపోవడంతో అవి ఇప్పటికీ ఆ స్థాయికి ఎదగలేదు. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ల స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలూ మన రాష్ట్రంలో రావడం లేదు.

* రాష్ట్రంలో చిన్నా చితకా తప్ప పేరుగన్న ఐటీ పరిశ్రమలేవీ లేవు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఐటీ కంపెనీలూ మూతపడ్డాయి. చదువుకున్న యువతంతా ఇక్కడ అవకాశాల్లేక హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణెలకు వెళ్లిపోతున్నారు. అంతంత మాత్రం చదువుకున్న అల్పాదాయ, పేద వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు రాకపోవడంతో వారూ హైదరాబాద్‌ బాటే పడుతున్నారు.

* ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, కరోనా వంటి విపత్తులు ఉన్న ఉపాధి అవకాశాల్నీ దెబ్బతీస్తున్నాయి.

రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే..
రాష్ట్రానికి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరం లేకపోవడం వలసలకు మరో ప్రధాన కారణం. రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే... ఈ మూడేళ్లలో నగరానికి ఒక రూపం వచ్చేది. అనేక సమస్యలకు అమరావతి ఒక పరిష్కారంగా నిలిచేది. నిర్మాణ దశలోనే అమరావతి 15వేల నుంచి 20వేల మందికి ఉపాధి కల్పించింది. నిర్మాణం కొనసాగితే పదుల సంఖ్యలో విద్యా సంస్థలు, అంతర్జాతీయ స్థాయి స్కూళ్లు, ఆసుపత్రులు, ఐటీ, ఫిన్‌టెక్‌ సంస్థలు, హోటళ్లు వచ్చేవి. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చెందేవి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేవి.

ఇలా చేస్తేనే మనుగడ...
యువత తరలిపోయి, పెద్దతరమే ఇక్కడ మిగిలితే ఉత్పాదకత తగ్గిపోతుంది. సంపాదించే వాళ్లు లేక, డబ్బు చలామణీ లేక... ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడుతుంది. పల్లెటూళ్లను ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి, పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించి, మెరుగైన ఉపాధి అవకాశాలొచ్చేలా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.


రాష్ట్రంలో మిగిలేది వృద్ధులే...

* మంచి స్కూళ్లు, మంచి ఆసుపత్రులు, ఉపాధి కల్పించే పరిశ్రమలు, ఐటీ లేకపోవడంతో మెరుగైన ఉపాధి, జీవనం కోసం యువత ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిపోతున్నారు. పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో పిల్లల జనాభా క్రమంగా తగ్గుతూ వృద్ధులు పెరుగుతున్నారు.

* కొత్తతరం ఇక్కడ ఉండకుండా, ప్రస్తుత తరం క్రమంగా వృద్ధులుగా మారితే... రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మిగిలేది ఎక్కువగా వయసు మళ్లినవారే. 2030 నుంచే ఈ పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని, 2050 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుతుందని సామాజికవేత్తలు అంచనా వేస్తున్నారు.

* చదువుకున్న యువతలో 25-30 శాతం యువతే వలస వెళ్లడం సహజమనీ, 70-75 శాతం మందికి వారు ఉంటున్న ప్రాంతాలకు చుట్టుపక్కలగానీ, రాష్ట్రంలోని మరెక్కడైనాగానీ ఉపాధి అవకాశాలు లభించాలని, అప్పుడే జనాభాపరంగా సమతూకం కొనసాగుతుందని, కానీ రాష్ట్రంలో దానికి విరుద్ధంగా జరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అధిక వేతన ఉద్యోగులేరీ?
- ప్రొఫెసర్‌ శ్రీకుమార్‌, సామాజికవేత్త

ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎంటెక్‌ చేసినవారికీ ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదు. విజయవాడలో నెలకు రూ.లక్షకు పైగా జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగుల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అదే హైదరాబాద్‌లో నెలకు రూ.లక్షకుపైగా జీతం వచ్చేవారు కనీసం 10 లక్షల మంది ఉంటారు. అంత ఎక్కువ జీతాలొస్తే... కొనుగోలు శక్తి ఉంటుంది. నగదు చలామణీలోకి వస్తుంది. మరింత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని