AP news: అంటకాగిన వారిపై అంకుశం.. ఆ మూడు జిల్లాల కలెక్టర్లు జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు

రాష్ట్రంలోని 12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. వివాదాస్పదులైన, వైకాపాతో అంటకాగిన విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాలరెడ్డిలకు పోస్టింగులు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Updated : 23 Jun 2024 09:41 IST

రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ
12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
కొందరి పోస్టింగులపై విస్మయం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. వివాదాస్పదులైన, వైకాపాతో అంటకాగిన విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాలరెడ్డిలకు పోస్టింగులు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. విశాఖపట్నంలో హయగ్రీవ, దసపల్లా మొదలుకుని రూ.వందల కోట్ల విలువైన భూములను వైకాపా నాయకుల పరం చేయటంలో మల్లికార్జున పాత్ర వివాదాస్పదమైంది. ఆ వ్యవహారాల్లో ఆయన వైకాపా నాయకులు చెప్పినట్లు నడుచుకున్నారనే ఫిర్యాదులున్నాయి. మాధవీలత కృష్ణా జిల్లా జేసీగా పనిచేసినప్పుడు వైకాపాతో అంటకాగారు. తూర్పుగోదావరి కలెక్టర్‌గా ఉన్నప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను గోదావరి వంతెనపై నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. వైకాపా నాయకుల ఇసుక అక్రమాలను చూసీచూడనట్లు వదిలేశారు. వైకాపా నాయకుల ఇసుక, మట్టి దోపిడీని కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి పట్టించుకోలేదు. వాటికి పరోక్షంగా సహకరించారు. రాజధాని అమరావతిని నాశనం చేయటానికి వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సహకరించారు. ఈ నేపథ్యంలోనే వారికి పోస్టింగు ఇవ్వలేదనే చర్చ నడుస్తోంది. 

చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగిన షగిలి షన్మోహన్‌కు పదోన్నతి కల్పించారా? అన్నట్టు.. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వటం విస్మయానికి గురిచేసింది. వైకాపా అరాచకాల పట్ల చూసీచూడనట్లు వ్యవహరించిన, అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పిన వాటికల్లా తలాడించారనే ఫిర్యాదులున్న బాపట్ల కలెక్టర్‌ రంజిత్‌బాషాకు కర్నూలులాంటి కీలక జిల్లాకు కలెక్టర్‌గా పంపించటమూ షాక్‌కు గురిచేసింది. ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థుల అరాచకాలు, అక్రమాలను చూసీచూడనట్లు వదిలేసి, వాటిని అడ్డుకున్న యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులున్న ప్రకాశం కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగు ఇవ్వటం ఎలాంటి సంకేతాలనిస్తుందన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లుగా అవకాశం ఇవ్వని నాగరాణి, అంబేద్కర్‌లకు కలెక్టర్‌లుగా ప్రభుత్వం పోస్టింగులిచ్చింది. పశ్చిమగోదావరి కలెక్టర్‌గా పనిచేసినప్పుడు వైకాపా నాయకులు చెప్పినట్లు వినలేదన్న కారణంతో అప్పట్లో బదిలీ అయిన ప్రశాంతిని తూర్పుగోదావరి కలెక్టర్‌గా నియమించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించటం, ఈ జిల్లాలన్నీ భౌగోళికంగా వరుసగా ఉండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు