VC Prasad Reddy: ఏయూలో ప్రసాదరెడ్డి ప్రైవేటు సైన్యం!

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీసీ ప్రసాదరెడ్డి తన కోసం ప్రత్యేకంగా ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఇంఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఏ వర్సిటీలోనూ లేనివిధంగా ‘చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌’ పదవిని సృష్టించారు.

Updated : 24 Jun 2024 06:54 IST

ఎక్కడా లేనివిధంగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ నియామకం
రూసా నిధుల నుంచి నెలకు రూ.లక్ష జీతం చెల్లింపు
ప్రశ్నించే ఉద్యోగులు, విద్యార్థుల గొంతు నొక్కడమే పని

ఈనాడు డిజిటల్‌-విశాఖపట్నం, ఏయూ ప్రాంగణం-న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీసీ ప్రసాదరెడ్డి తన కోసం ప్రత్యేకంగా ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఇంఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఏ వర్సిటీలోనూ లేనివిధంగా ‘చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌’ పదవిని సృష్టించారు. అందులో విశ్రాంత పోలీసు అధికారి మొహమ్మద్‌ ఖాన్‌ను నియమించారు. ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) కింద అందిస్తున్న నిధుల నుంచి ఆయనకు ప్రతినెలా రూ.లక్ష వరకు జీతం చెల్లిస్తున్నారు. ఈ నిర్ణయంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. సదరు విశ్రాంత పోలీసు అధికారి సుమారు మూడేళ్లుగా ఆ పదవిలో ఉన్నా.. భయంతో నోరు మెదపని వారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. వర్సిటీలో అక్రమాలకు పాల్పడుతున్న ఆయనపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఆచార్యులు, విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

విజయసాయిరెడ్డి సహకారం 

గతంలో మొహమ్మద్‌ ఖాన్‌ విశాఖలో ఏసీపీగా పని చేశారు. 2019కి ముందు అనేక సందర్భాల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించి విమర్శలు మూటగట్టుకున్నారు. చిన్న పిల్లలతో పని చేయించుకుంటున్నారనే ఆరోపణలతో కార్మికశాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి సహకారంతో ఏయూలో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చేరారు. ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటుచేసి, అనుమతి లేకుండా ఎవరూ లోపలకు ప్రవేశించకుండా చేశారు. అప్పటికే వర్సిటీలో 100 మంది వరకు సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తుండగా.. వారు సరికాదని ఆయన మనుషులు 100 మందిని విధుల్లోకి తీసుకున్నారు. వారంతా ఖాన్‌ సెక్యూరిటీ కంపెనీకి చెందినవారేనని విమర్శలున్నాయి. వీసీ చుట్టూ అయిదుగురు సిబ్బందిని పెట్టి, ఆయన రాగానే కారు డోరు తీయడం.. సెల్యూట్‌ చేయడం వంటివి చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఉద్యోగులు, విద్యార్థులను నియంత్రించి

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ భద్రతా సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలను అక్కడి ఆచార్యులే చూస్తున్నారు. కానీ ఏయూ వీసీ మాత్రం ప్రైవేటు వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించారు. ఇన్నాళ్లూ వీసీ ప్రసాదరెడ్డి చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎదురు తిరగకుండా ప్రైవేటు సైన్యంతో నియంత్రించారు. మూడేళ్ల క్రితం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోకి వచ్చిన ఓ ఆవును ఖాన్‌ హతమార్చడాన్ని భాజపా, యాదవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గతంలో బీచ్‌ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న కొందరు వ్యక్తులపై మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సదరు నిందితులు ఆ ఖాన్‌ ప్రైవేటు సైన్యంలోని వ్యక్తులని విచారణలో తేలింది.

రూ.లక్షల్లో కమీషన్ల వసూళ్లు 

మొహమ్మద్‌ ఖాన్‌ను సెక్యూరిటీ అధికారిగా నియమించిన కొద్దిరోజుల్లోనే వీసీ ఆయనకు ట్రాన్స్‌పోర్టు డీన్‌ పోస్టును కూడా కట్టబెట్టారు. దీంతో ఆయన వర్సిటీలోని బస్సులు, ఆచార్యుల కార్లు, ఇతర రవాణా సౌకర్యాలకు సంబంధించిన ఇంధనం, మరమ్మతుల పేరిట రూ.లక్షల్లో దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇంజినీరింగ్‌ కళాశాలలో చెట్లు నరికించి తరలించడం, ప్రింటింగ్‌ ప్రెస్‌ ఖాళీ చేయించి అందులోని విలువైన సామగ్రిని అమ్ముకున్నారన్న విమర్శలున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీకి వర్సిటీ నుంచి ఇచ్చే జీతాల్లో కొంత కమీషన్‌ తీసుకుంటారని చెబుతున్నారు. ఇలా రూ.3 కోట్లకు పైగా అవినీతికి పాల్పడి ఉంటారని వర్సిటీలో చర్చ సాగుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని