Ramacharyulu: అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు రాజీనామా

వైకాపా పాలనలో అన్ని వ్యవస్థల్లాగే శాసన వ్యవస్థనూ భ్రష్టు పట్టించారు. నిబంధనలకు నీళ్లొదిలి ఆఘమేఘాల మీద ‘అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌’ పోస్టును ఒకేఒక్క రోజులో సృష్టించారు.

Published : 10 Jul 2024 05:04 IST

 వైకాపా హయాంలో సృష్టించిన పదవిలో ఇన్నాళ్లు కొనసాగి.. ఇప్పుడు విరమణ 
అన్నీ వివాదాస్పద నిర్ణయాలే 

ఈనాడు, అమరావతి: వైకాపా పాలనలో అన్ని వ్యవస్థల్లాగే శాసన వ్యవస్థనూ భ్రష్టు పట్టించారు. నిబంధనలకు నీళ్లొదిలి ఆఘమేఘాల మీద ‘అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌’ పోస్టును ఒకేఒక్క రోజులో సృష్టించారు. అదేరోజు ఫైల్‌ సిద్ధం చేసి మంత్రిమండలిలో పెట్టి ఆమోదించేసి, వెంటనే ఆ పోస్టులో పీపీకే రామాచార్యులును నియమించారు. 2023లో అప్పటి ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పట్టుబట్టి ఈ పని చేయించారు. అసెంబ్లీకి కార్యదర్శి (సెక్రటరీ) పోస్టు ఉండగా, దాన్ని కాదని రామాచార్యులు కోసమే ‘సెక్రటరీ జనరల్‌’ పేరిట పదవిని సృష్టించారు. 2023 ఏప్రిల్‌ నుంచి ఆ హోదాలో రామాచార్యులు కొనసాగుతున్నారు. రిటైరయ్యాక కూడా వివిధ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయాలని జూన్‌ 23న ఎన్డీయే ప్రభుత్వం ఆదేశించినా ఆయన ఇన్నాళ్లూ కదల్లేదు. మంగళవారం రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజుకు ఆయన కార్యాలయంలో అందజేశారు. శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో లేఖ సమర్పించారు.

వైకాపా సెక్రటరీ జనరల్‌ అన్నట్లుగా!

  • అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పదవిలో ఉన్నప్పటికీ, రామాచార్యులు వైకాపా సెక్రటరీ జనరల్‌ అన్నట్లుగా వ్యవహరించారు. నాటి అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకున్నారు. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైకాపా తరఫున ఎన్నికైన రఘురాజును ఆ పార్టీ ఎన్నికల ముందు పక్కన పెట్టాలని నిర్ణయించింది. కనీసం విచారణకు సమయం ఇవ్వకుండానే ఆయనపై అనర్హత వేటు వేయించడంలో రామాచార్యులే చక్రం తిప్పారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
  • ‘ఏపీ లెజిస్లేచర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ స్టడీస్, ట్రైనింగ్‌ (ఏపీఎల్‌ఐఎస్‌టీ) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, వైకాపా పెద్దలకు అస్మదీయుడైన ఓ అర్హత లేని అధికారిని దానికి డైరెక్టర్‌గా నియమించేందుకు మంత్రాంగం నడిపారు. అది కూడా ఎన్నికల ప్రకటనకు మూడు రోజుల ముందు. ఇతర అధికారులు కోర్టును ఆశ్రయించడంతో ఆ నియామకం ఆగింది.
  • వైకాపా అధినాయకత్వాన్ని ధిక్కరించిన అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్‌ను రామాచార్యులు పక్కదోవ పట్టించినట్లు ఆ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వారిని విచారించే క్రమంలో కేవలం మూడు సార్లు పిలిచి ఆ వెంటనే అనర్హత వేటు వేయొచ్చంటూ స్పీకర్‌కు సూచించి, అలాగే అమలు చేశారని ఆరోపణలున్నాయి. 
  • వైకాపా ఓడిపోయి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా రామాచార్యులు పద్ధతి మార్చుకోలేదు. అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఆయన్ను ఏమార్చేందుకు యత్నించారు. స్పీకర్‌గా తాను తొలి సంతకం చేస్తానన్న దస్త్రాన్ని సిద్ధం చేయకుండా, ఆయన్ను ప్రభావితం చేసేందుకు యత్నించారు. 

ఏరి కోరి తెచ్చుకొని, మరీ పోస్టింగ్‌ 

రాజ్యసభ సచివాలయ సలహాదారుగా ఉన్న రామాచార్యులును 2022 డిసెంబరులో అసెంబ్లీ వ్యవహారాల కన్సల్టెంట్‌గా ఏపీకి తీసుకువచ్చారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించేందుకే ఆయన్ను ఇక్కడికి రప్పించినప్పటికీ, అప్పటికే అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులు పదవీకాలం 2023 ఏప్రిల్‌ వరకు ఉన్నందున రామాచార్యులును కన్సల్టెంట్‌గా నియమించారు. బాలకృష్ణమాచార్యులు పదవీకాలం ముగిశాక ఆయన్ను కనీస గౌరవం లేకుండా అవమానకరంగా పంపించారు. వెన్వెంటనే రామాచార్యులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2017లో ఒకసారి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా వచ్చిన రామాచార్యులు ఆ పదవిలో కొద్దిరోజులు మాత్రమే కొనసాగారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని