AP Budget: నేటి నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులనే అంశాన్ని నేటి శాసనసభ సలహా సంఘ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ నెల 26 వరకు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Updated : 07 Mar 2022 07:05 IST

తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం
మొత్తం 20 బిల్లుల్ని పెట్టే అవకాశం

ఈనాడు, అమరావతి: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులనే అంశాన్ని నేటి శాసనసభ సలహా సంఘ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ నెల 26 వరకు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సోమవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక... ఉభయసభలను ఉద్దేశించి  ఆయన ప్రత్యక్షంగా ప్రసంగించడం ఇదే మొదటిసారి. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ఇంతకుముందు సమావేశాల్లో ఆయన రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలోనే ప్రసంగించారు. ఈ సమావేశాల్లో సుమారు 20 బిల్లుల్ని ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు మినహా మిగతా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవనున్నారు. వారు ఉదయం 9.30కు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి నుంచి బయల్దేరతారు. 10 గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండ వేసి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనగా అసెంబ్లీకి వెళతారని తెదేపా ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రంలో నిరుద్యోగం, నైరాశ్యంలో యువత, సంక్షోభంలో రాష్ట్ర రైతాంగం, అన్నదాతల ఆత్మహత్యలు, హైకోర్టు తీర్పు-అమరావతి నిర్మాణం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ సర్వనాశనం, అక్రమ మైనింగ్‌ వంటి 19 అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని తెదేపా నిర్ణయించింది.


నేడు తెలంగాణ బడ్జెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ.2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సోమవారం ఉదయం 11.30కు శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే రూ.35,000 కోట్ల మేర బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచనుంది. సొంత పన్నుల రాబడిలో వృద్ధిరేటును 20 శాతంగా అంచనా వేస్తున్న సర్కారు పన్నేతర రాబడి, రుణాలపై ధీమాతో భారీ అంచనాలను రూపొందించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts