AP Budget: రాష్ట్రంలో ఆర్థిక అరాచకం

రాష్ట్రంలో ఆర్థిక అరాచకం నెలకొందని, సామాన్యుడికి అర్థం కాని రీతిలో బడ్జెట్‌ అంకెలతో మాయ చేస్తున్నారని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Updated : 27 Mar 2022 05:08 IST

బడ్జెట్‌ అంకెలతో మాయ చేస్తున్నారు
ప్రజలకు పంచినది పోగా.. రూ.48వేల కోట్లు ఏమయ్యాయనే ప్రశ్నిస్తున్నాం
‘ఈనాడు’తో పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో ఆర్థిక అరాచకం నెలకొందని, సామాన్యుడికి అర్థం కాని రీతిలో బడ్జెట్‌ అంకెలతో మాయ చేస్తున్నారని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, కేంద్రం జోక్యం చేసుకుని చక్కదిద్దకపోతే మరింత పతనం అవుతుందని హెచ్చరించారు. ‘తెచ్చిన అప్పుల్ని ప్రజలకు పంచుతుంటే తెదేపా అల్లరి చేస్తోందని సీఎం జగన్‌ అంటున్నారు. మేం అడిగేది ప్రజలకు ఇచ్చిన డబ్బుపై కాదు.. రికార్డుల్లో లేని రూ.48వేల కోట్లు ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయనే?’ అని పేర్కొన్నారు. తప్పుచేసిన అధికారుల్ని పదవీ విరమణ తర్వాతా కాగ్‌ వెంటాడుతుందని, వారికంటూ ప్రత్యేక పేరాలు ఉంటాయని  హెచ్చరించారు.

శాసనసభ ఆమోదం లేకుండా రూ. 98 వేల కోట్ల ఖర్చు
శాసనసభ ఆమోదం లేకుండా పైసా ఖర్చు చేసే అధికారం ముఖ్యమంత్రికీ లేదు. బడ్జెట్‌లో శాఖల వారీగా నిధులను కేటాయిస్తారు. అందుకు అనుగుణంగా ఖర్చు చేయాల్సిందే. శాసనసభ ఆమోదించినట్లు ఖర్చు పెడుతున్నారా? లేదా? అనేది పీఏసీ (ప్రజా పద్దుల కమిటీ) చూస్తుంది. అయితే అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ.98వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఇది పెద్ద నేరం.

రూ.48వేల కోట్లు ఏమయ్యాయో?
ఖజానా ద్వారా చేసే చెల్లింపుల్లో.. ఖర్చుల్ని పరిశీలిస్తారు. పరిపాలన, సాంకేతిక మంజూరులతో పాటు బడ్జెట్‌ కేటాయింపులను చూస్తారు. లెక్కతేలని రూ.48,281 కోట్ల బిల్లులేవీ ట్రెజరీ ద్వారా పాస్‌ కాకుండా నేరుగా సీఎఫ్‌ఎంఎస్‌లోకి వచ్చాయి. వాటి ఖర్చును నిర్ధారించుకునే అవకాశం లేదు. వీటిపైనే కాగ్‌ అభ్యంతరం లేవనెత్తింది. అయితే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఆ ఖర్చును ర్యాటిఫై చేస్తున్నట్లు జీవో ఇచ్చేశారు. నిజానికి ఆ అధికారం ఆయనకు లేదు. ఇలా చేయడం ద్వారా లేని, చేయని ఖర్చును చూపిస్తారు. కాగ్‌ క్వాలిఫైడ్‌ ఒపీనియన్‌ ఇచ్చిందంటే లెక్కల్లో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా చేశారనే అర్థం. అంటే ప్రభుత్వ లెక్కలపై సంతృప్తి చెందలేదు.

కాగ్‌కు క్రిమినల్‌ కేసు పెట్టే అధికారం ఉంది
లెక్కలపై కాగ్‌ అడిగే అభ్యంతరాలకు ప్రభుత్వం, అధికారులు పీఏసీకి.. కాగ్‌కు సహకరించడం లేదు. ఎన్ని లేఖలు రాస్తే ఎన్నింటికి సమాధానం ఇచ్చారో రికార్డులు చూస్తే తెలుస్తుంది. అడిగిన వాటికి సమాధానం ఇవ్వకపోతే సంబంధిత అధికారిపై క్రిమినల్‌ కేసు పెట్టే హక్కులు కాగ్‌కు ఉన్నాయి. ఈ అధికారాన్ని ఉపయోగించాలని కాగ్‌ను కోరబోతున్నా. 

శ్రీకాంత్‌ ఐఏఎస్‌కు అర్హులా?
పీఏసీ ఛైర్మన్‌ అంటే అసెంబ్లీ ప్రతినిధి. ఆ హోదాతో సమాచారం కావాలని అడిగితే.. ఇవ్వాలా? వద్దా? అని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ప్రభుత్వాన్ని అడిగారు. ఆయన ఐఏఎస్‌కు అర్హులా?

ఆదాయం పెరిగినా.. అప్పులే
రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. మద్యం, పన్నుల రూపంలో ప్రజల నుంచి పిండేస్తున్నారు. 2018-19 నాటికి పన్నుల ఆదాయం రూ.58,107 కోట్లు ఉంటే.. 2022-23 బడ్జెట్లో రూ.91,049 కోట్లుగా ప్రతిపాదించారు. పన్నేతర ఆదాయం మూడేళ్ల కిందట రూ.4,396 కోట్లుంటే తాజా బడ్జెట్లో రూ.11,091 కోట్లకు చేరింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ.19,456 కోట్ల నుంచి రూ.56,033 కోట్లు అయింది. అయినా పరిమితికి మించి అప్పులు చేస్తున్నారు. ఏడాదిలో 331 రోజులు చేబదుళ్లతోనే గడిపేశారు. ఏపీఎస్‌డీసీ ద్వారా రూ.25వేల కోట్లు తెచ్చారు. పౌర సరఫరాల సంస్థకు 2018-19లో రూ.5,500 కోట్ల అప్పుంటే.. 2022-23 నాటికి దీన్ని రూ.33వేల కోట్లకు చేర్చారు.  
* మూలధన వ్యయం చేయని రాష్ట్ర ప్రభుత్వం.. రుణ అర్హత కోసం లెక్కల్లో చూపిస్తోంది. రెవెన్యూ వ్యయం కింద చూపాల్సిన రూ.4,400 కోట్లను మూలధన వ్యయంగా చూపడాన్ని సరి చేసుకోవాలని కేంద్రం చెప్పింది.


వ్యవసాయం, జలవనరులపై ఖర్చే లేదు

కీలకమైన వ్యవసాయంలో ఖర్చులు పెరిగాయి. అయినా రైతు భరోసా మినహా.. ఏమీ చేయడం లేదు. రెండున్నర ఎకరాల్లో సూక్ష్మ సేద్యం పెట్టుకోవాలంటే రైతు రూ.3 లక్షలు ఖర్చు చేయాలి. గతంలో రూ.10వేలు సరిపోయేవి. రైతు భరోసా కేంద్రాలతో తలరాత మారుస్తామంటున్న ప్రభుత్వం వాటికి రూ.18 కోట్లు కేటాయించి రూ.10 కోట్లు ఖర్చు చేసింది. సున్నా వడ్డీకి రూ.500 కోట్లు కేటాయించినా.. ఖర్చు రూ.110 కోట్లే. పంటల బీమా ఉందో లేదో తెలియడం లేదు. జల వనరులశాఖలో తెదేపా హయాంలో రూ.68వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఈ ప్రభుత్వ హయాంలో పోలవరం మినహాయిస్తే రూ.6వేల కోట్లూ ఖర్చుపెట్టలేదు. రోడ్లేయడమే నేరం అన్నట్లుగా జగన్‌ మాట్లాడుతున్నారు. రహదారుల నిర్మాణానికి రూ.100 ఖర్చు పెడితే పన్నుల రూపంలో రూ.30 రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దేశమంతా కొవిడ్‌తో అతలాకుతలమైనా రింగ్‌రోడ్‌, ఇతర రహదారులు ఆకర్షించడంతోనే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరగడానికి దోహదపడ్డాయి.
* కాగ్‌ లేవనెత్తే అభ్యంతరాలు అసాధారణమైనవే. దీనికి ఆర్థిక, ఇతర శాఖల అధికారులు బాధ్యత వహించాల్సిందే. కావాలనే తప్పుదోవ పట్టిస్తూ నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.
* పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ఈ ప్రభుత్వం దోచుకుంటోంది. గ్రామసభ తీర్మానాలు లేకుండా తీసుకుంటోంది. ఖర్చు చేసినట్లు దొంగ వినియోగ ధ్రువీకరణ పత్రాలిచ్చారు.
* రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుస్తాం. అసెంబ్లీ కళ్లుగప్పి ఎలా అప్పులు చేయొచ్చు? చట్టాల కళ్లుగప్పి ఎలా దారి మళ్లించొచ్చు అనేది మొదలైంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts