AP Cabinet: కీలక హామీలకు ఆమోద ముద్ర

ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల అమలు దిశగా రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలకు సంబంధించిన అంశాలకు ఆమోద ముద్ర వేసింది.

Updated : 25 Jun 2024 06:51 IST

మంత్రివర్గ తొలి సమావేశంలోనే పచ్చజెండా
మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌కు చెల్లుచీటీ
సామాజిక భద్రత పింఛను రూ.4 వేలకు పెంపు
నాలుగు నెలల్లో నైపుణ్య గణన పూర్తి 
తొలిదశలో 183 అన్న క్యాంటీన్ల ప్రారంభం
పోలవరం, అమరావతి సహా ఏడు అంశాలపై శ్వేతపత్రాలు
గంజాయి, మాదకద్రవ్యాలు అరికట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం
ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ
మంత్రివర్గ నిర్ణయాలు
ఈనాడు - అమరావతి 

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం

న్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల అమలు దిశగా రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలకు సంబంధించిన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. లక్షల మంది నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించేలా మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత దుర్మార్గపు చట్టమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దు చేయాలని నిర్ణయించింది. 65.30 లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచాలని తీర్మానించింది. విద్యార్థులు, యువతలో నైపుణ్య గణన చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని తీర్మానించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వ పరిపాలనలో వివిధ రంగాలు భ్రష్టుపట్టిన తీరుపై మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని తీర్మానించింది. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గం నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు. 

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి పార్థసారథి 

ఉపాధ్యాయ ఖాళీలకు అనుగుణంగా ఇకపై ఏటా డీఎస్సీ

‘మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్‌జీటీ పోస్టులు-6,371, పీఈటీలు-132, స్కూల్‌ అసిస్టెంట్‌లు-7,725, టీజీటీలు-1,781, పీజీటీలు-286, ప్రిన్సిపాల్‌ పోస్టులు-52 భర్తీ చేయనున్నాం. ఇకపై ఉపాధ్యాయ ఖాళీలకు అనుగుణంగా ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించాం. వైకాపా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలకు ముందు ఉత్తుత్తి డీఎస్సీ ప్రకటన విడుదల చేసి నిరుద్యోగుల్ని మోసగించింది. ఆరు నెలలకోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించకపోవటం వల్ల లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులు నష్టపోయారు. ఇకపై టెట్‌ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని నిర్ణయించాం. ఉపాధ్యాయుల నియామకం కంటే ముందే వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉన్నందున డిసెంబరు 10 నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 

భూ యజమాని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు పొందే అవకాశం

రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయవ్యవస్థలను అస్తవ్యస్తం చేసేలా ఉన్న ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. భూ యజమాని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తూ తీర్మానం చేసింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన నమూనా చట్టానికి జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి అసలు ఏ మాత్రం సంబంధం లేదు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఎవరో చట్టంలో స్పష్టం చేయలేదు. వివాదం ఏర్పడితే అప్పీలేట్‌ అథారిటీ ఎవరనేది పేర్కొనలేదు. ఈ భూ వివాదాలపై జిల్లా కోర్టులు, సివిల్‌ కోర్టులకు పరిధి లేకుండా చేసి.. హైకోర్టును మాత్రమే ఆశ్రయించేలా ఈ చట్టం తెచ్చారు. భాజపా పాలిత ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని తీసుకురాలేదు. పాసు పుస్తకాలపైన, సర్వేరాళ్లపైన జగన్‌ బొమ్మ వేశారు. ఆయా భూములపై వివాదాలు సృష్టించి లబ్ధి పొందేందుకు కుట్ర చేశారు. సన్న, చిన్నకారు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. 

నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు 

రాష్ట్రంలో నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించాం. మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని తీర్మానించాం. స్కిల్‌ ప్రొఫైల్స్, స్కిల్‌ నీడ్స్, స్కిల్‌ ఇన్‌ డిమాండ్, స్కిల్‌ లభ్యత మధ్య అంతరాన్ని గుర్తించటం, అంచనా వేయటం, తదనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు డిజైన్‌ చేసేలా ప్రభుత్వానికి సమాచారం అందించటం, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలు పెంపొందించుకునేలా శిక్షణ అందించటం ఈ సెన్సెస్‌ ముఖ్య లక్ష్యాలు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల్లో కోర్సు పూర్తి చేసుకుని ఏటా 4.40 లక్షల మంది యువత బయటకొస్తున్నారు. తగిన నైపుణ్యాలు లేకపోవటం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో నైపుణ్యాలు గుర్తించి, వాటిని అభివృద్ధి పరిచేందుకు వీలుగా నైపుణ్య గణన చేపడుతున్నాం. పారిశ్రామిక, వ్యవసాయ, మార్కెటింగ్, ఉత్పత్తి రంగాల్లోని సంస్థల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటికనుగుణంగా యువతను తీర్చిదిద్దాలని మంత్రివర్గం నిర్ణయించింది.

అన్నక్యాంటీన్ల పునఃప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా 203 అన్నక్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. తొలి దశలో 183 క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని తీర్మానించింది. మిగతా 20 క్యాంటీన్లను తదుపరి దశల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఆహార సరఫరా సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలో టెండర్లు పిలవనున్నాం. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్న క్యాంటీన్లను మూసేసి నిరుపేదల నోటి దగ్గర ముద్ద తీసేసింది. 

గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదానికి మంత్రివర్గ ఉపసంఘం

గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు అయిదుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిలు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. గంజాయి సాగు, రవాణా, వినియోగం అరికట్టడంపై ఈ ఉపసంఘం పనిచేస్తుంది. 


ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ 

  • ఆరోగ్య విశ్వవిద్యాలయానికి గతంలో ఉన్న ఎన్టీఆర్‌ పేరునే పునరుద్ధరించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ విశ్వవిద్యాలయం పేరును మార్చటం వల్ల విద్యార్థులు సాంకేతికపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి వినతుల మేరకు ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాం. 1986లో ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 1998లో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. గత ప్రభుత్వం దాన్ని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. 
  • అడ్వొకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. గత ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేసిన ఎస్‌.శ్రీరామ్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిల రాజీనామాల ఆమోదం. 
  • రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలి. చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు కాలవలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించాలి. రహదారులపై గోతులు పూడ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది’ అని మంత్రి పార్థసారథి వివరించారు.

పోలవరం, అమరావతి సహా ఏడు అంశాలపై శ్వేతపత్రాలు

వైకాపా ప్రభుత్వం కీలక రంగాల్ని ఎంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టేసిందో ప్రజలకు తెలిపేందుకు వీలుగా మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి జులై 18 వరకూ రెండు, మూడు రోజులకొకటి చొప్పున ఈ శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేస్తారు. 

1. పోలవరం, 
2. అమరావతి, 
3. విద్యుత్తు
4. పర్యావరణం (ల్యాండ్, శ్యాండ్, మైన్‌ తదితర వాటి దోపిడీ), 
5. ఎక్సైజ్, మద్యం, 
6. శాంతిభద్రతలు,
7. ఆర్థిక శాఖ


సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పింఛను

సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని జులై నెల నుంచి రూ.4 వేలకు పెంచుతున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దకే ఈ మొత్తం అందిస్తాం.  జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విడతల వారీగా రూ.2 వేల పింఛను రూ.3 వేలకు పెంచటానికి అయిదేళ్లు పట్టింది. అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.వెయ్యి పెంచాం. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జులైలో ఒక్కో పింఛనుదారుకు రూ.7 వేలు అందిస్తాం. దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతున్నాం. మొత్తం 65.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. పింఛను మొత్తం పెంపు వల్ల ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.819 కోట్ల మేర భారం పడుతుంది. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిల భారం రూ.1,650 కోట్లు. వైకాపా హయాంలో పింఛన్ల కోసం ఏడాదికి రూ.22,273.44 కోట్లు ఖర్చు కాగా.. మాకు 33,099.72 కోట్లు వ్యయమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని