Amaravati: రండి.. రండి.. అమరావతికి రండి

అసలు రాజధానే లేకుండా ఐదేళ్లూ పరిపాలన సాగించిన జగన్‌ చేసిన నష్టాలను పూడ్చుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక దిక్సూచిగా ఉపయోగపడే అమరావతిని తిరిగి పట్టాలెక్కించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు.

Updated : 24 Jun 2024 06:53 IST

కేంద్రప్రభుత్వ విభాగాలు, సంస్థలతో సీఆర్డీఏ అధికారుల సంప్రదింపులు
కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని వినతి
అన్నీ కొలువుదీరితే శరవేగంగా రాజధాని అభివృద్ధి

శరవేగంగా సాగుతున్న ఎన్‌ఐడీ భవన నిర్మాణ పనులు. ఇందులో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి

ఈనాడు, అమరావతి: అసలు రాజధానే లేకుండా ఐదేళ్లూ పరిపాలన సాగించిన జగన్‌ చేసిన నష్టాలను పూడ్చుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక దిక్సూచిగా ఉపయోగపడే అమరావతిని తిరిగి పట్టాలెక్కించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. వీలైనంత త్వరగా అమరావతిని నివాసయోగ్యంగా మార్చేందుకు, అభివృద్ధి బాట పట్టించేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గతంలో తెదేపా హయాంలో రాజధానిలో వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, విభాగాలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభించేలా సీఆర్డీఏ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీని కోసం ఆయా కేంద్ర సంస్థలు, విభాగాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

ప్రణాళికాబద్ధంగా ముందుకు..

2014-19లోను, ఇప్పుడు పురపాలక శాఖ మంత్రిగా నారాయణే ఉన్నారు. ఆయన అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఇటీవల సీఆర్డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో అమరావతి పూర్వ వైభవానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 

  • గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు, జనావాసాలు పెంచేందుకు పలు సంస్థలకు భూములు కేటాయించింది. 130 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అప్పట్లో 1,135.49 ఎకరాల భూముల్ని కేటాయించింది. కొన్నింటికి ఉచితంగాను, పలు సంస్థలకు 33-60 ఏళ్ల వరకు లీజు ప్రాతిపదికన నామమాత్రపు ధరకు ఇచ్చారు. ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూసేందుకు సీఆర్డీఏ అధికారులు తొలి దశలో కేంద్రప్రభుత్వ విభాగాలు, సంస్థలపై దృష్టిసారించారు. సివిల్‌ సప్లైస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐ), ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఐఓసీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఐడీ, సీఐటీడీ, పోస్టల్‌ శాఖ, కేంద్రీయ విద్యాలయాలు, కాగ్, భారత వాతావరణ పరిశోధన విభాగం, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ), బీపీసీఎల్, యూబీఐ, ఎస్‌బీఐ తదితర వాటికి భూములు ఇచ్చారు. మొత్తం 24 కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఒక్కటే ఒప్పందం చేసుకుంది. ఒక్క విభాగమే పనులు ప్రారంభించింది. భూములిచ్చిన 18 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఐదు సంస్థలే సీఆర్డీఏతో ఒప్పందం చేసుకోగా.. ఇందులో తొమ్మిదే చెల్లింపులు చేశాయి. ఒక్క సంస్థ మాత్రమే నిర్మాణం మొదలుపెట్టింది. 
  • సాధ్యమైనంత త్వరగా భూములు తీసుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని గత రెండు రోజులుగా సీఆర్డీఏ అధికారులు వాటి ఉన్నతాధికారులతో ఫోన్‌లో సంప్రదింపులు సాగిస్తున్నారు. ఆయా సంస్థల ఉన్నతాధికారులు తమకు కేటాయించిన స్థలాలను చూపించాలని కోరుతున్నారు. వాటిని భౌతికంగా పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నట్లు సమాచారం.

అన్నీ వస్తే అమరావతి ప్రగతి బాట

భూములు కేటాయించిన సంస్థలు అమరావతిలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే రాజధాని నివాసయోగ్య నగరంగా రూపాంతరం చెందుతుంది. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల రాకతో ఆవాసాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలూ అదే స్థాయిలో ఎగబాకుతాయి. నగదు చలామణి పెరిగి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. వీటికి అనుబంధంగా పరిశ్రమలూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ త్వరితగతిన మౌలిక వసతులను సమకూర్చితే అత్యున్నత నగరంగా అమరావతి ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ముందుకు సాగితేనే అమరావతి జవసత్వాలు నింపుకొని రాష్ట్రానికి ఆర్థిక చుక్కానిలా ఎదుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని