Chandra babu naidu: చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు.

Updated : 13 Jun 2024 08:05 IST

తొలి చేవ్రాలు మెగా డీఎస్సీ దస్త్రంపైనే
రెండోది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై..
పింఛన్ల నగదు పెంపుపై మూడోది
అన్న క్యాంటీన్లు, నైపుణ్య గణనపై తర్వాతి సంతకాలు
నేడు సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం చేయనున్న చంద్రబాబు
ఈనాడు - అమరావతి

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌లో గురువారం సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఈ సంతకాలు చేస్తారు. 

నిరుద్యోగ యువతకు వరంగా డీఎస్సీ

తెదేపా అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా చంద్రబాబు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డీఎస్సీ దస్త్రంపై పెట్టనున్నారు. అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి, కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

రాకాసి చట్టానికి చెల్లుచీటీ 

రాష్ట్ర ప్రజల్ని అత్యంత భయకంపితుల్ని చేసిన ‘ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం’ (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) రద్దుపై చంద్రబాబు రెండో సంతకం పెట్టనున్నారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్‌ 31న తీసుకొచ్చింది. ఈ రాకాసి చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను పొందుపరిచారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చించుకున్నా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైకాపా నేతలు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్‌ ఫొటో ముద్రించిన పాసుపుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి, ప్రజలకు భరోసానిచ్చారు. 

పింఛను రూ.4 వేలకు పెంపు

2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు రూ.200 పింఛనును 5 రెట్లు పెంచి రూ.1000 చేశారు. తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో రూ.4 వేలకు పెంచుతామని హామీనిచ్చారు. అంతేకాదు ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంచుతామని చెప్పారు. దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న రూ.7 వేల పింఛను (జులై 1న ఇచ్చే రూ.4 వేలు+ ఏప్రిల్‌ నెల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున) అందించనున్నారు.


పేదలకు అండగా అన్నక్యాంటీన్ల పునరాగమనం

గత తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పూటకు రూ.5 చొప్పున మూడు పూటలకూ కలిపి రూ.15కే ఆహారాన్ని అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం చేసేవారు. ఇందుకుగాను అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.31.06 కోట్లు ఖర్చు పెట్టింది. తెదేపా చేపట్టిన పథకమంటే చాలు కక్షకట్టే జగన్‌.. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను కూడా నిలిపేశారు. అయినా తెదేపా నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను సొంతంగానే నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఆ మేరకు చంద్రబాబు నాలుగో సంతకాన్ని అన్నక్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు. 


నిరుద్యోగితను తగ్గించడంలో కీలకంగా నైపుణ్య గణన

యువత ఉన్నత విద్యను అభ్యసించినా.. దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు.  చంద్రబాబు ఐదో సంతకం ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు.  ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, ఏ రంగానికి ప్రాధాన్యముంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని