Chandrababu: చంద్రబాబుకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు బారులు తీరారు.

Published : 14 Jun 2024 05:20 IST

సీఎంను ఆహ్వానించేందుకు భారీగా తరలివచ్చిన ఉద్యోగులు
ఐదేళ్ల తర్వాత సచివాలయంలో పండుగ వాతావరణం

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు బారులు తీరారు. నాలుగో బ్లాక్‌ నుంచి మొదటి బ్లాక్‌ వరకు వారితో సచివాలయం ప్రాంగణం గురువారం కళకళలాడింది. చంద్రబాబు కారులో నుంచి నిలబడి ఉద్యోగులకు అభివాదం చేశారు. సీఎం.. సీఎం.. జై బాబు.. జై బాబు అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే సచివాలయంలోని మొదటి బ్లాక్‌ వద్ద రెడ్‌ కార్పెట్‌ వేసి, స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దాదాపు ఐదేళ్ల తర్వాత అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. చంద్రబాబు రాకతో వారిలో నూతనోత్సాహం కనిపించింది. మాజీ సీఎం జగన్‌.. సచివాలయానికి రాకుండానే క్యాంపు కార్యాలయం నుంచే ఐదేళ్లు పాలన సాగించారు. ఉద్యోగులు కలిసేందుకు సరిగా సమయం సైతం ఇవ్వలేదు. కానీ, చంద్రబాబు సచివాలయం నుంచే పాలన సాగించనుండడం, సీఎంను ఎప్పుడంటే అప్పుడు కలిసే అవకాశం రానుండడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువిరిసింది. 

సచివాలయానికి వచ్చే దారి పొడవునా భారీ ఫ్లెక్సీలు కట్టారు. మందడం నుంచి సచివాలయం వరకు స్వాగతం పలుకుతూ సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు నాపా ప్రసాద్, రామకృష్ణ, మురళీకృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎంగా బాధ్యతలు తీసుకొని, ఐదు అంశాలపై సంతకాలు చేసిన అనంతరం తిరిగి వెళ్తూ ఉద్యోగులకు చంద్రబాబు అభివాదం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని