Chandrababu: విద్యుత్‌ రంగం నష్టాలు రూ.1.29 లక్షల కోట్లు!

జగన్‌ అసమర్థ పాలనలో విద్యుత్‌ రంగం అస్తవ్యస్తంగా మారిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విద్యుత్‌ కొనుగోళ్ల పేరుతో భవిష్యత్తులో ప్రజలపై పడబోయే భారాలను పరిగణనలోకి తీసుకోకుండా పీపీఏలు కుదుర్చుకుందని.. ఇవన్నీ చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

Published : 10 Jul 2024 05:12 IST

గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పాపాల ఫలితమిది
ప్రజలపై వేసిన ఛార్జీల భారం రూ.32,166 కోట్లు
ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.49,596 కోట్లు
శ్వేతపత్రంలో వెల్లడించిన సీఎం చంద్రబాబు

విద్యుత్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ఇస్తున్న సీఎం చంద్రబాబు

జగన్‌ అసమర్థ పాలనలో విద్యుత్‌ రంగం అస్తవ్యస్తంగా మారిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విద్యుత్‌ కొనుగోళ్ల పేరుతో భవిష్యత్తులో ప్రజలపై పడబోయే భారాలను పరిగణనలోకి తీసుకోకుండా పీపీఏలు కుదుర్చుకుందని.. ఇవన్నీ చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం మూడోసారి విద్యుత్‌ సంస్థల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో విద్యుత్‌ సంస్థలు మొత్తం రూ.1,29,503 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని తెలిపారు. విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రాన్ని ఆయన సచివాలయంలో మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విద్యుత్‌ సంస్థల పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, అప్పుల గురించి వివరించారు. జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలను ఎంతలా దెబ్బతీసింది.. అందులో జరిగిన అక్రమాలేంటన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఆయన చెప్పిన వివరాలివీ...


ఐదేళ్లలో రూ.32,166 కోట్ల భారం

అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతగా నష్టం జరుగుతుందనడానికి గత ప్రభుత్వం ఒక ఉదాహరణ. విద్యుత్‌ టారిఫ్‌ పెంపు ద్వారా ప్రజలపై రూ.16,699 కోట్ల ఛార్జీల భారంతో పాటు.. ట్రూఅప్‌/ఇంధన సర్‌ఛార్జ్‌ పేరుతో రూ.5,886 కోట్లు, ట్రూఅప్‌ ఛార్జీలు రూ.3,977 కోట్లు, విద్యుత్‌ సుంకం రూ.5,604 కోట్లు కలిపి.. మొత్తం రూ.32,166 కోట్ల భారం ప్రజలపై పడింది. 


అప్పుల ఊబిలోకి విద్యుత్‌ సంస్థలు 

గత ఐదేళ్లలో విద్యుత్‌ సంస్థల అప్పులు రూ.49,596 కోట్లు పెరిగాయి. 2019లో ఉన్న అప్పులతో పోలిస్తే.. సుమారు 79% పెరిగాయి. పెట్టుబడి వ్యయం రూ.36,792 కోట్ల నుంచి రూ.46,380 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయం సుమారు రూ.40వేల కోట్లు పెరిగింది. విద్యుత్‌ సంస్థల నిర్వహణ కోసం స్వల్పకాలిక రుణాలను 10.11% వడ్డీకి తీసుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల రూ.10,892 కోట్ల అదనపు వడ్డీ భారాన్ని సంస్థలు మోయక తప్పలేదు. సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా క్షీణించింది. 

 


ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో పడిన భారాలు

  •  వీటీపీఎస్‌ నిర్మాణానికి నిధులు అందుబాటులో ఉన్నా.. పనులు పూర్తిచేయడంలో 55 నెలలు జాప్యమైంది. దీనిద్వారా చౌకధరకు రావాల్సిన 21వేల ఎంయూల విద్యుత్‌ను కోల్పోవడం వల్ల రూ.4,895 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ప్లాంటు నిర్మాణానికి తీసుకున్న అప్పులపై వడ్డీ రూపేణా రూ.2,029 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 
  •  కృష్ణపట్నం నిర్మాణాన్ని పూర్తిచేయడంలో 44 నెలలు ఆలస్యమైంది. దీనికోసం చేసిన అప్పులపై వడ్డీ రూ.2,035 కోట్లు, ఆ ప్లాంటు అందుబాటులోకి రాకపోవడంతో నష్టపోయిన విద్యుత్‌ 17వేల ఎంయూలకు రూ.3,560 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. 
  •  పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు 2023 మే నాటికి పూర్తికావాలి. దీన్ని కొత్త కాంట్రాక్టర్‌కు కేటాయించి.. 2026 నాటికి పూర్తిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆన్‌గోయింగ్‌ ఆర్బిట్రేషన్‌ కింద పాత కాంట్రాక్టర్‌కు సుమారు రూ.1,500 కోట్లు చెల్లించాలి. కాంట్రాక్టు ధరల్లో తేడా రూ.350 కోట్లు, ఏటా 2వేల ఎంయూల విద్యుత్‌ ఉత్పత్తి నష్టపోవడం వల్ల రూ.1,155 కోట్ల చొప్పున జనవరి 2026 నాటికి రూ.1,732 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. 

పెట్టుబడులు రాకుండా విధ్వంసం

  •  జగన్‌ అధికారంలోకి వచ్చాక సౌర, పవన విద్యుత్‌సంస్థలతో 2019కు ముందు కుదిరిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) సమీక్షిస్తామని ప్రకటించింది. ఆ సమయంలో ఆయా సంస్థల నుంచి విద్యుత్‌ తీసుకోవడానికి నిరాకరించారు. ఆ విద్యుత్‌ తీసుకోవాల్సిందేనని కోర్టు జోక్యం చేసుకుంది. దీనివల్ల అప్పట్లో వాడుకోని విద్యుత్‌కు రూ.9వేల కోట్లు.. నిర్వహణ వ్యయం కింద చెల్లించాల్సి వచ్చింది.
  •  సీఆర్డీయే పరిధిలో విద్యుత్‌ పనుల కాంట్రాక్టు రద్దుచేయడం వల్ల ఇప్పుడు అదే పనికి పెరిగిన అంచనాల ప్రకారం రూ.281 కోట్ల అదనపు ఖర్చు చేయాల్సి వచ్చింది. పవన, సౌరవిద్యుత్‌ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తిని బ్యాక్‌డౌన్‌ చేయడం వల్ల రూ.500 కోట్లు, హిందుజా సంస్థకు రూ.1,235 కోట్లు గత ప్రభుత్వం చెల్లించింది. 

డిస్కంల రేటింగ్‌ పడిపోయింది

ఐదేళ్లలో విద్యుత్‌ సంస్థల పనితీరు సవ్యంగా లేకపోవడం వల్ల రేటింగ్‌ దెబ్బతింది. గత తెదేపా హయాంలో క్రిసిల్‌తో పాటు ఇతర సంస్థలు కూడా ‘ఎ’ రేటింగ్‌  ఇచ్చాయి. ఇప్పుడు వాటి రేటింగ్‌ బి, సి, డిగా ఉంది. దీనివల్ల సంస్థలు తీసుకునే అప్పులపై 1.1 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వడ్డీ పెరగడంతో ఐదేళ్లలో అదనంగా రూ.2,442 కోట్ల భారం మోయాల్సి వచ్చింది. 


పీఎఫ్‌నూ వదల్లేదు

విద్యుత్‌ సంస్థల పీఎఫ్‌ ట్రస్టులో ఉన్న మొత్తంతో ఏపీ బెవరేజెస్‌ కంపెనీ బాండ్లు కొనిపించి.. ఆ మొత్తాన్ని గత ప్రభుత్వం మళ్లించి ఖర్చుచేసింది. ఏపీ జెన్‌కో రూ.2,134 కోట్లు, ట్రాన్స్‌కో రూ.379 కోట్లతో కలిపి. మొత్తం రూ.2,513 కోట్లు మళ్లించింది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 


పేదలపైనే ఛార్జీల భారం అధికం

గత ప్రభుత్వం గృహవిద్యుత్‌ వినియోగదారులపై టారిఫ్‌ భారాన్ని వేసింది. 1.53 కోట్ల మంది వినియోగదారులు పెరిగిన విద్యుత్‌ ఛార్జీల వల్ల ఇబ్బంది పడ్డారు. మరో రూ.17,137 కోట్ల ఛార్జీల పెంపు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.  


ప్రజలపై భారం వేసేలా నిర్ణయాలు

స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా అధిక ధరకు విద్యుత్‌ కొని, రూ.12,250 కోట్ల నికర భారాన్ని ప్రజలపై వేసింది. 2023-24 నాటికి 11,655 ఎంయూల విద్యుత్‌ను యూనిట్కు సగటున రూ.7.61 చొప్పున డిస్కంలు కొన్నాయి. ఇలా ఐదేళ్లలో 43,416 ఎంయూల విద్యుత్‌ కొనుగోలుకు రూ.26,030 కోట్లు డిస్కంలు ఖర్చుచేశాయి. 

  •  సెకి నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వల్ల అదనపు భారం రూ.850 కోట్లు.. జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ ఛార్జీలు ఏటా సుమారు రూ.3,500 కోట్లు కలిపి ఏటా రూ.4,350 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఒప్పందం కుదుర్చుకున్న 25 ఏళ్లలో రూ.62వేల కోట్ల భారం ప్రజలపై పడనుంది. ప్రస్తుతం ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల భారం పడకుండా కొత్త సాంకేతికత అందుబాటులో ఉంది. 
  •  పవన విద్యుత్‌ ఒప్పందాలు 5,287 మెగావాట్లు, సౌర విద్యుత్‌ 12,075 మెగావాట్లు, పీఎస్‌పీలు 12,055 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. వాటిలో ఒక్కటీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. వాటిని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం.

విద్యుత్‌రంగంలో సంస్కరణలు తెచ్చింది తెదేపానే

ఉమ్మడిరాష్ట్రంలో 1998లో విద్యుత్‌ సంస్కరణలను మొదటిసారి మేమే అమలుచేశాం. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కూడా మొదటిసారి ఏపీలో ఏర్పాటైంది. ఈ సంస్కరణల పట్ల అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ, సంస్కరణల వల్ల విద్యుత్‌రంగానికి మేలు జరిగింది. 2014-19లో రెండోసారి సంస్కరణలు తీసుకొచ్చాం. 2014 డిసెంబరు నాటికి 22.5 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ కొరతను అధిగమించి.. 2018 జనవరి నాటికి మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని