Ap DGP: నిరసనలు చేసుకోండి.. పాదయాత్రను అడ్డుకోవద్దు: ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి

‘మీ నిరసనలు మీరు చేసుకోండి. కానీ అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దు’ అని వాటి నిర్వాహకులకు చెబుతున్నామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

Updated : 15 Oct 2022 07:49 IST

నిరసనలు తెలుపుతున్న వారిని పిలిపించి ఇదే చెబుతున్నాం

ఈనాడు, అమరావతి: ‘మీ నిరసనలు మీరు చేసుకోండి. కానీ అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దు’ అని వాటి నిర్వాహకులకు చెబుతున్నామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పాదయాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ.. దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవారిని ముందుగానే పిలిపించి యాత్రను అడ్డుకోవద్దంటూ చెబుతున్నారని తెలిపారు. వాటి నిర్వాహకులూ అందుకు అంగీకరిస్తున్నారని వివరించారు. అందుకే ఇప్పటివరకూ ఎక్కడా తీవ్ర సమస్యలు వచ్చినట్లు కనిపించలేదని, అలాంటివి ఎక్కడైనా ఉత్పన్నమైతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రైతుల పాదయాత్రకు ఆటంకం కలిగేలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి పలుచోట్ల పోలీసులే కారణమవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా ‘అది పూర్తి అబద్దం. మేం సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామే తప్ప మేమే ఎందుకలా చేస్తాం? సమస్యను సంక్లిష్టం చేయదలుచుకోలేదు’ అని డీజీపీ వివరించారు.


మరికొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వివరాలివి...

పాదయాత్రకు మేమెందుకు అడ్డంకులు సృష్టిస్తాం.. మాకేం పని?
విలేకరి: : రైతుల పాదయాత్రకు పలుచోట్ల పోలీసులే అడ్డంకులు కలిగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏమంటారు?
డీజీపీ: అవి మీ ఆరోపణలు మాత్రమే. మేమెందుకు అడ్డంకులు సృష్టిస్తాం? అసలు మాకేం పని? మేము శాంతిభద్రతల పరిరక్షణకే ఉన్నాం. రోజూ ఉదయం, సాయంత్రం పాదయాత్రపై సమీక్షిస్తున్నాం. సమస్య వస్తే పరిష్కరిస్తున్నాం. వివిధ సమూహాలతో మాట్లాడి మరీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నాం. మీ ఆరోపణ సరికాదు.

విలేకరి: అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ పలువురు ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీజీపీ: ఎలాంటి ఉద్రిక్త వాతావరణమూ లేదు. ఇప్పటివరకూ ప్రశాంతంగా జరిగింది. మేము దీన్ని సమర్థంగా హ్యాండిల్‌ చేయగలం. ఆందోళన చెందాల్సిన పనిలేదు. యాత్ర సాగుతున్న ప్రాంతాల్లో అదనపు సిబ్బంది, బందోబస్తు ఇచ్చాం. ఆయా జిల్లాల ఎస్పీలు అందరితోనూ మాట్లాడుతున్నారు.

కోర్టులు తప్పు పట్టలేదు.. వివరణ అడిగితే సమాధానం ఇస్తున్నాం

విలేకరి: ఏపీ సీఐడీ పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వకుండానే పలువుర్ని అరెస్టు చేయడంపై కోర్టులు పదే పదే ఆక్షేపిస్తున్నాయి. అయినా తీరు ఎందుకు మారట్లేదు?
డీజీపీ: ఈ అంశంపై మీరు సంబంధిత అధికారితో మాట్లాడండి. నేను డీజీపీగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతోంది. మీరెందుకు అలా చేశారు, ఇలా చేశారని కోర్టులు మమ్మల్ని తప్పు పట్టలేదు. న్యాయస్థానం ఆయా అంశాలపై వివరణలు అడుగుతుంటే వాటికి సమాధానం ఇస్తున్నాం. తర్వాత ఎవర్నీ పిలిపించట్లేదు.

విలేకరి: ప్రతిపక్ష నాయకులను అసభ్యంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయట్లేదు. అదే అధికార పక్షానికి చెందినవారిని ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిన్న పోస్టు పెట్టినా వెంటనే కేసు పెడుతున్నారు. ఎందుకు ఈ ఏకపక్ష ధోరణి?
డీజీపీ: మీ దగ్గర అలాంటి ఘటనలకు సంబంధించి స్పష్టమైన వివరాలుంటే చెప్పండి. వాటిని పరిశీలిస్తాం.

హత్యల్లో పోలీసుల ప్రమేయం గుర్తిస్తే వారిపైనా చర్యలు
విలేకరి: రాష్ట్రంలో హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని ఘటనల్లో పోలీసుల ప్రమేయం కూడా ఉంటోంది. పోలీసింగ్‌ లోపమే దీనికి కారణమా? ఏం చర్యలు తీసుకుంటున్నారు?
డీజీపీ: రాష్ట్రంలో పలు హత్యలకు వివాదాలు, పాత కక్షలు కారణమని గుర్తించాం. గ్రామాల్లో అలాంటి వివాదాలు, కక్షలు ఉన్నవారి డేటాబేస్‌ తయారు చేస్తున్నాం. పిలిపించి హెచ్చరిస్తాం. ఎక్కడైనా పోలీసుల ప్రమేయం గుర్తిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటున్నాం.

విలేకరి: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని, గన్‌మెన్‌ను మారుస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదుచేశారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీజీపీ: దస్తగిరికి రక్షణ కల్పిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందీ లేదు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాం.


రుణయాప్‌ల మోసాలపై 75 కేసుల నమోదు

రుణయాప్‌ల మోసాలపై రాష్ట్రంలో ఇప్పటివరకూ 75 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. 80 మంది నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశామన్నారు. మిగతా కేసుల్లో దర్యాప్తు సాగుతోందని వివరించారు. మోసగాళ్ల బ్యాంకు ఖాతాల్ని గుర్తించి వాటి లావాదేవీలను స్తంభింపజేశామని చెప్పారు. ఆయా ఖాతాల్లో రూ.10.05 కోట్ల సొత్తు ఉందన్నారు. వీటి వెనుక ఉన్న కింగ్‌పిన్‌లను గుర్తించేందుకు దర్యాప్తు సాగిస్తున్నామని చెప్పారు. ఈ తరహా యాప్‌లను రూపొందించేవారినీ నేరగాళ్లుగానే పరిగణిస్తామన్నారు. ఈ యాప్‌ల బారినపడి మోసపోయి రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. రుణయాప్‌ల నిర్వాహకుల బెదిరిస్తే టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలు, వాటి లావాదేవీల గురించి పోలీసులకు చెప్పని బ్యాంకర్లను కూడా నేరగాళ్లుగానే పరిగణిస్తామని చెప్పారు. ఈ కేసుల దర్యాప్తు కోసం ప్రామాణిక నిర్వహణ పద్ధతులు (ఎస్‌వోపీ) రూపొందించామని డీజీపీ తెలిపారు. దాన్ని శుక్రవారం విడుదల చేశారు. అన్ని జిల్లాల ఎస్పీలకు, దర్యాప్తు అధికారులకు ఈ వివరాలు పంపిస్తామన్నారు. ‘విశాఖపట్నంలో శనివారం జరగబోయే కార్యక్రమాలు వేర్వేరు సమయాల్లో ఉన్నాయి. ఒకరి కార్యక్రమాలు మరొకరికి అడ్డం లేకుండా చూశాం. వేర్వేరు మార్గాలు కేటాయించాం. అదనపు బందోబస్తూ ఏర్పాటుచేశాం’ అని డీజీపీ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని