AP DGP: సవాంగ్‌పై వేటు
పోలీస్ బాస్ ఆకస్మిక, అనూహ్య బదిలీ
పోస్టింగు కూడా ఇవ్వని ప్రభుత్వం
సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై అనూహ్యంగా, ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో డీజీపీగా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత నిఘావిభాగం అధిపతి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని నియమించింది. ఇటీవలే అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన ఆయనకు పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌వోపీఎఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈనాడు - అమరావతి
గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీ వెనుక ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే కారణమని తెలుస్తోంది.ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రయోజనాలను నిరసిస్తూ ఈ నెల 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలమంది తరలివచ్చారు. వారంతా బీఆర్టీఎస్ రోడ్డులో భారీగా నిరసన ప్రదర్శన చేయటంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వేలమంది రావడం ఇటీవల ఇదే తొలిసారి. అంతమంది వస్తారనే విషయాన్ని డీజీపీగా గౌతమ్ సవాంగ్ అంచనా వేయలేకపోయారని, విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని నిలువరించలేకపోయారని.. ఆ వైఫల్యాల వల్లే చలో విజయవాడ విజయవంతమైందన్న భావనతో ఉన్న ప్రభుత్వం ఆయన్ను డీజీపీ పోస్టు నుంచి తప్పించినట్లు సమాచారం. ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశామని, నోటీసులిచ్చి అడ్డుకున్నామని, ఏ జిల్లా నుంచీ వందమందికి మించి విజయవాడకు రారంటూ పోలీసుశాఖ తొలుత నివేదించిందని... అదే నిజమైతే అన్ని వేలమంది ఎలా వచ్చారన్న కోణంలో ఆరాతీసిన ప్రభుత్వం... ఆ వైఫల్యానికి బాధ్యుడిగా సవాంగ్‌ను బదిలీ చేసినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చలో విజయవాడ విజయవంతమైన మర్నాడే సవాంగ్ ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చారు.
మరో ఏడాదికి పైగా సర్వీసు ఉన్నా...
సాధారణంగా డీఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేసి, పోస్టింగు ఇవ్వకపోతే వారిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీయే ఆదేశాలిస్తారు. ఇప్పటివరకూ ఆ హోదాలో కొనసాగిన అధికారే చివరికి పోస్టింగు లేక.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిన పరిస్థితి రావటం ఐపీఎస్‌లలో చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్ 1న రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మంగళవారం వరకూ ఆ పోస్టులో కొనసాగారు. రెండేళ్ల 8 నెలల 15 రోజుల పాటు ఆయన డీజీపీ పదవి నిర్వహించారు. 2023 జులై నెలాఖరు వరకూ ఆయనకు సర్వీసు ఉంది. అలాంటిది ఉన్నపళంగా ఆయన్ను బదిలీ చేయటం, పోస్టింగు ఇవ్వకపోవటం చర్చనీయాంశమైంది.
12మంది సీనియర్ అధికారులను కాదని...
ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్ సీనియార్టీ జాబితాలో కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిది 13వ పేరు. ఆయన కంటే 12 మంది అధికారులు సీనియార్టీలో ముందున్నారు. వారందర్నీ కాదని ఆయనకి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర క్యాడర్‌లో డీజీపీ హోదాలో ఉన్నవారిలో సీనియార్టీ జాబితా ప్రకారం అయిదుగురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించనుంది. వారి సర్వీసు రికార్డు, ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారిలో ముగ్గురు పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అందులో నుంచి ఒకర్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేస్తుంది. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యే అవకాశం ఉంది.
* డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను మినహాయిస్తే ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో 1986 బ్యాచ్‌కి చెందిన వీఎస్‌కే కౌముది మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా 1987 బ్యాచ్ అధికారులు ఎన్.వి.సురేంద్రబాబు, ఏఆర్.అనూరాధ, 1989 బ్యాచ్ అధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, కేఆర్‌ఎం కిషోర్‌కుమార్, సీహెచ్. ద్వారకాతిరుమలరావు, 1990 బ్యాచ్‌కి చెందిన అంజనా సిన్హా, 1991 బ్యాచ్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ హసన్ రెజా, 1992 బ్యాచ్ అధికారులు హరీష్‌కుమార్ గుప్తా, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్నారు.
ఆరోపణల నుంచి ఉద్వాసన దాకా..
డీజీపీగా గౌతమ్ సవాంగ్ వ్యవహార శైలి పలుమార్లు విమర్శల పాలైంది. ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఆయన హయాంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ విధానాల్ని, లోపాల్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టారు. ప్రభుత్వ పెద్దలు చెప్పారంటూ వారికి అనుకూలంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులపై గౌతమ్ సవాంగ్ హయాంలో తీవ్ర అణచివేత కొనసాగింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిర్వహించే కార్యక్రమాలకు కొవిడ్ నిబంధనల పేరిట పోలీసులు అనుమతి ఇచ్చేవారు కాదు. అధికార పార్టీ నాయకులు వేలమందితో కార్యక్రమాలు చేసినా పట్టించుకునేవారే కాదు. ప్రతిపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు నాయకులు తమపై జరుగుతున్న దాడుల గురించి విన్నవిద్దామని డీజీపీని కలిసేందుకు వెళ్లినా సవాంగ్ వారిని కలిసేవారు కాదు. ప్రతిపక్ష నాయకులు లేఖలు రాసినా స్పందించేవారు కాదు. వైకాపా అధికారం చేపట్టిన కొన్నాళ్లకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు రాజధానిలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. ఆ ఘటనపై గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ.. అది భావప్రకటన స్వేఛ్చ అని వ్యాఖ్యానించారు. అమరావతిలో రాజధాని ఉండాలని పోరాడుతున్న రైతులపై సవాంగ్ హయాంలో తీవ్ర అణచివేత, లాఠీఛార్జీలు సాగాయి. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. రైతులకు సంకెళ్లు వేసి మరీ తరలించారు. వారు చేపట్టిన మహా పాదయాత్రకు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటిస్తే.. ఆయన్ను విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకుని నోటీసులిచ్చారు. ఈ వ్యవహారంలో డీజీపీ హైకోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ప్రభుత్వం వద్ద మెప్పు పొందడానికే ఆయన ఈ స్థాయిలో నిబంధనల్ని పక్కన పెట్టినా.. అదే ప్రభుత్వ పెద్దలు ఆయన్ను వాడుకుని వదిలేసినట్లు పక్కన పెట్టేశారని ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై నిత్యం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే ఓ ప్రజాప్రతినిధి కొన్నాళ్ల కిందట ఓ కేసులో అరెస్టయ్యారు. ఆయనతో డీజీపీ టచ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగింది. అప్పటి నుంచే సవాంగ్‌ను నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. తర్వాత పలు సందర్భాల్లో ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పొమ్మనకుండా పొగ పెట్టి ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేశారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
కేవీ రాజేంద్రనాథరెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు
కొత్త డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులైన కేవీ రాజేంద్రనాథరెడ్డిది కడప జిల్లా. ఆయన 1992 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ ఏఎస్పీగా 1994లో తొలి పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అదనపు ఎస్పీగా పనిచేశారు. విశాఖపట్నం రూరల్, నెల్లూరు జిల్లాల ఎస్పీగా, సీఐడీ, గుంతకల్లు, విజయవాడ రైల్వే యూనిట్ల ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో సిటీ సెక్యూరిటీ, తూర్పు జోన్ డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2008 నుంచి 2010 మధ్య విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. విశాఖపట్నం జోన్ ఐజీగా, హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. పోలీసు గృహనిర్మాణ సంస్థ ఎండీ, డ్రగ్ కంట్రోల్ డీజీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ తదితర పోస్టుల్లో కొనసాగారు. 2020 ఆగస్టు 12 నుంచి నిఘా విభాగం అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో డీజీపీగా కొనసాగనున్నారు. 2026 ఏప్రిల్ మాసాంతం వరకూ ఆయనకు సర్వీసు ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Indian flag: అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా..!
-
India News
Azadi Ka Amrit Mahotsav: ఆరు ఖండాల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్..!
-
Movies News
Independence Day: ఒక్క క్షణం.. మన రియల్ హీరోలకు ప్రణమిల్లుదాం
-
India News
Modi: ‘అవినీతి.. వారసత్వం’.. దేశాన్ని పట్టిపీడిస్తోన్న చెదపురుగులు
-
General News
CM KCR: దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్
-
India News
India Corona : 15 వేల కొత్త కేసులు.. 32 మరణాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం