AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌లో మొదటి 10 ర్యాంకులు అబ్బాయిలకే

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, బీస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో 78.26% విద్యార్థులు అర్హత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువమంది అర్హత సాధించారు.

Updated : 12 Jun 2024 06:45 IST

విడుదలైన ఏపీఈఏపీసెట్‌ ఫలితాలు
80.90% ఉత్తీర్ణతతో అమ్మాయిల హవా
అబ్బాయిలు 75.61%
మూడు ప్రశ్నలకు పూర్తి మార్కుల కేటాయింపు

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేస్తున్న ఉన్నత విద్యామండలి
ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహనరావు, ఉన్నత విద్యాశాఖ
ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రసాదరాజు 

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, బీస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో 78.26% విద్యార్థులు అర్హత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువమంది అర్హత సాధించారు. అమ్మాయిలు మొత్తం 1,70,082 మంది పరీక్షకు హాజరైతే వీరిలో 1,37,604 (80.90%), అబ్బాయిలు 1,69,058 మంది పరీక్ష రాస్తే 1,27,840 (75.61%) అర్హత సాధించారు. విజయవాడలో మంగళవారం ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహనరావు, జేఎన్‌టీయూ-కాకినాడ ఉపకులపతి ప్రసాదరావుతో కలిసి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. మూడు ప్రశ్నలకు పూర్తిగా మార్కులు ఇవ్వగా.. ఒక ప్రశ్నకు సమాధానం మార్చారు. ఇంటర్మీడియట్‌ మార్కులు 25%, ఈఏపీసెట్‌ మార్కులు 75%గా లెక్కించి ర్యాంకులు విడుదల చేశారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 1,95,092 మంది అర్హత సాధించగా.. ఇంటర్మీడియట్‌ మార్కులు అందని కారణంగా 1,66,012 మందికే ర్యాంకులు విడుదల చేశారు. బైపీసీ స్ట్రీమ్‌లో 70,352 మంది అర్హత సాధించగా..56,913 మందికి ర్యాంకులు ఇచ్చారు. ఇంజినీరింగ్‌లో మొదటి 10ర్యాంకుల్లో అందరూ అబ్బాయిలే ఉండగా.. వ్యవసాయ, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌లో మొదటి ర్యాంకుల్లో 2, 5, 7 స్థానాల్లో అమ్మాయిలు నిలిచారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో పరీక్ష రాసినవారందరూ అర్హత సాధించినట్లే. 

పెరిగిన ఇంజినీరింగ్‌ అర్హత

ఇంజినీరింగ్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. గతేడాది ఇంజినీరింగ్‌లో 1,71,514మంది అర్హత సాధించగా.. ఈసారి 1,95,092 మందికి పెరిగింది. 

 బైపీసీ స్ట్రీమ్‌కు 80,766 మంది పరీక్ష రాయగా.. 70,352(87.11%) అర్హత సాధించారు. గతేడాదితో పోల్చితే బైపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించినవారి సంఖ్య తగ్గింది. గతేడాది 81,203మంది అర్హత సాధించగా.. ఈసారి 70వేలకు పడిపోయింది. వ్యవసాయం, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌ లాంటి కోర్సులు ఈఏపీసెట్‌లో ఉండడంతో దీనిపై విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు. వైద్యవిద్య చదవాలనుకున్నవారు నీట్‌కు హాజరవుతున్నారు. 

రెండు పరీక్షల్లోనూ మెరిశారు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మూడోర్యాంకు సాధించిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సందేశ్‌కు ఈఏపీసెట్‌లోనూ మూడోర్యాంకు లభించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐదోర్యాంకు సాధించిన అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్‌కుమార్‌కు ఈఏపీసెట్‌లో ఎనిమిదో ర్యాంకు వచ్చింది. ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌లో మొదటిర్యాంకు సాధించిన మాకినేని జిష్ణుసాయికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 62వ ర్యాంకు వచ్చింది. ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌లో రెండోర్యాంకు సాధించిన యశ్వంత్‌రెడ్డికి అడ్వాన్స్‌డ్‌లో 50వ ర్యాంకు లభించింది. 

ఇంజినీరింగ్‌లో 1.50 లక్షల సీట్లు

అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇప్పటివరకు ఇచ్చిన అనుమతుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో కలిపి 1,58,545 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 4,720 సీట్లు ఉండగా.. ప్రైవేటులో 1,53,825 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లోనే సగానికి పైగా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి సీఎస్‌ఈలో 80,150 సీట్లు ఉండగా.. ఐటీ విభాగంలో 5,910 సీట్లు అందుబాటు ఉన్నాయి. మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌లో అన్ని కళాశాలలూ సీట్లు తగ్గించేశాయి.


త్వరలో కౌన్సెలింగ్‌..

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ త్వరలో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు తెలిపారు. ఇంజినీరింగ్‌ ఫీజుల విషయంలో హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతోపాటు కళాశాలలు, సీట్లకు సంబంధించి ఏఐసీటీఈ ఇచ్చిన అనుమతుల ప్రకారం ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు.


ఇష్టంగా చదివితే సులువే..
 మాకినేని జిష్ణుసాయి, ఏపీఈఏపీ సెట్‌ ఇంజినీరింగ్‌ ఒకటో ర్యాంకు, గుంటూరు

మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివా. ఇష్టంగా చదివితే కష్టమైన సబ్జెక్ట్‌ అయినా సులువనిపిస్తుంది. వీక్లీ, గ్రాండ్‌ పరీక్షల్లో మార్కులు ఎక్కడ తగ్గాయో చూసుకుంటూ సాధన చేశా. నిత్యం 10 గంటలకుపైగా చదువుపైనే దృష్టి పెట్టా. కెమిస్ట్రీ కొంత కష్టంగా అనిపించడంతో ఎక్కువ సమయం కేటాయించా. తెలంగాణ ఎంసెట్‌లో 11, జేఈఈ మెయిన్‌ 18, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 62వ ర్యాంకు వచ్చాయి. బాంబే ఐఐటీలో సీఎస్‌ఈ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నాన్న కృష్ణమోహన్‌ వ్యవసాయం చేస్తారు. అమ్మ జ్యోతి గృహిణి. 

గుంటూరు విద్య, న్యూస్‌టుడే


మనసు పెట్టి చదివితేనే ఫలితం
 ఎం.సాయియశ్వంత్‌రెడ్డి, ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ 2వ ర్యాంకు, కర్నూలు 

వీక్లీ, గ్రాండ్‌ పరీక్షలకు తప్పకుండా హాజరవుతూ తప్పులు పునరావృతం కాకుండా సాధన చేశా. ఒత్తిడి అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకునేవాడిని. నిత్యం 12- 14 గంటల వరకు చదువుపైనే దృష్టి పెట్టాను. మనసు పెట్టి చదవడం వల్ల ఇలాంటి ఫలితం వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో 5వ ర్యాంకు, జేఈఈ మెయిన్‌లో 36, అడ్వాన్స్‌డ్‌లో 50వ ర్యాంకు సాధించాను. అమ్మ అరుణ గృహిణి, తండ్రి రామేశ్వరరెడ్డి వ్యాపారం చేస్తారు. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. 

 కర్నూలు విద్య, న్యూస్‌టుడే


లక్ష్యం చేరుకోవాలన్న కసితో చదివా
బి.సందేశ్, ఏపీఈఏపీ సెట్‌ ఇంజినీరింగ్‌ మూడో ర్యాంకు, ఆదోని

తల్లిదండ్రుల ప్రోత్సాహం, అన్న సహిష్ను స్ఫూర్తితో పరీక్షకు సన్నద్ధమయ్యాను. లక్ష్యం చేరుకోవాలన్న కసితో రోజుకు 10 నుంచి 12 గంటలు చదివా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయి నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నా. తల్లిదండ్రులు బి.రామసుబ్బారెడ్డి, వి.రాజేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. బాంబే ఐఐటీలో సీటు సాధించి కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా. సివిల్స్‌లో శిక్షణ తీసుకొని ఐఏఎస్‌ అయ్యి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా.

 ఆదోని విద్య, న్యూస్‌టుడే


 వైద్యుడినై పేదలకు సేవలందిస్తా
 శ్రీశాంత్‌రెడ్డి, ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఒకటో ర్యాంకు, హైదరాబాద్‌

కళాశాల నిర్వాహకులు అందించిన ‘మెటీరియల్‌’ను బాగా చదివాను. ఏ కోచింగ్‌ సెంటర్‌లోనూ శిక్షణ తీసుకోలేదు. ప్రతి రోజూ రాత్రి 10 గంటలకే పడుకుని, తెల్లవారుజామున 5 గంటలకు లేచి సాధన చేసేవాడిని. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఓ కార్పొరేట్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి స్వాతి గృహిణి. ‘నీట్‌’ ఫతితాల్లో 720 మార్కులకు గాను 710 మార్కులు సాధించా. తెలంగాణ ఎంసెట్‌లో 22వ ర్యాంకు సాధించా. వైద్య విద్య చదివి పేదలకు సేవ చేయడమే లక్ష్యం. 

 నిజాంపేట, న్యూస్‌టుడే


 కార్డియాలజీ చదువుతా
 పూల దివ్యతేజ, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగం రెండో ర్యాంకు, పార్వతీపురం మన్యం జిల్లా

పక్కా ప్రణాళికతో చదవడం వల్లే 92.92 మార్కులు సాధ్యమయ్యాయి. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నీట్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 530 ర్యాంకు, తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాల్లోనూ 10వ ర్యాంకు సాధించా. తండ్రి రాంప్రసాద్‌ సత్యసాయి జిల్లాలోని కదిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి లక్ష్మీదేవి గృహిణి. ఎంబీబీఎస్‌ సీటు సాధించి కార్డియాలజిస్ట్‌ కావడమే లక్ష్యం. 

 బలిజిపేట, న్యూస్‌టుడే


 ఏపీ ఈఏపీసెట్‌లో మూడో ర్యాంకు
 ముఖేష్‌ చౌదరి, ఏపీఈఏపీ సెట్‌ అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగం మూడో ర్యాంకు, తిరుపతి జిల్లా

ఎప్పటికప్పుడు చదువుతూ అనుమానాలు నివృత్తి చేసుకోవడంతో మంచి ర్యాంకు సాధ్యమైంది. నీట్‌లో మొదటి ర్యాంకు తెచ్చుకున్నా. తండ్రి మురళీనాయుడు వెంకటగిరిలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తల్లి బేబీ సరళ గృహిణి. వీరి ప్రోత్సాహంతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఒత్తిడిని అధిగమించా. దిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో పేదలందరికీ మంచి వైద్య సేవలు అందిస్తాను. 

 తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని