Updated : 14 Apr 2022 04:54 IST

AP Education: పాఠశాలలు 6 రకాలు

జులై నుంచి ప్రారంభించాలి: సీఎం జగన్‌

మండలానికో మహిళా జూనియర్‌ కళాశాల

1 శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలుగా పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, పీపీ-2 బోధించే అంగన్‌వాడీలు

2  పీపీ-1, పీపీ-2, ఒకటి, రెండు తరగతులు బోధించేవి ఫౌండేషన్‌ పాఠశాలలు

3  పీపీ-1, పీపీ-2, ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహించేవి ఫౌండేషన్‌ ప్లస్‌ బడులు

4  3 నుంచి 7 లేదా 8 తరగతులవి ప్రీ హైస్కూళ్లు

5  3-10తరగతులు నిర్వహించేవి హైస్కూళ్లు

6  3 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అందుబాటులో ఉంటే హైస్కూల్‌ ప్లస్‌.

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జులై నుంచి ఆరు రకాల పాఠశాలలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. 2024 జులై నాటికి దశలవారీగా ఈ పాఠశాలల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ..‘అదనపు తరగతి గదులను శరవేగంగా పూర్తి చేయాలి.

ఇవి పూర్తవుతున్న కొద్దీ దశల వారీగా ఆరు రకాల బడులను ప్రారంభించాలి. పాఠశాలల ఏర్పాటుకు అనుగుణంగా సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలి. ప్రతి హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపుతో ఉండాలి. ఆంగ్ల పదాల ఉచ్ఛరణపై యాప్‌ను ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లలోనూ ఈ యాప్‌ అందుబాటులో ఉంచేలా చూడాలి’ అని ఆదేశించారు. ‘వచ్చే విద్యా సంవత్సరంలో 8వతరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలి. ప్రతి మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీటిల్లో ఒకటి అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. దీనిపై కార్యాచరణ రూపొందించాలి. నాడు-నేడు రెండోదశ పనుల వేగం పెరగాలి. రెండో దశలో 25వేల పాఠశాలల్లో రూ.11,267కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టాలి. పాఠశాలల్లో గణనీయమైన మార్పులు ఈ ఏడాది కనిపించాలి. ప్రభుత్వ వసతి గృహాలు, 468 జూనియర్‌ కళాశాలల్లో నాడు-నేడు కింద పనులు చేపట్టాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పేరు, ఇందులో భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. విద్యా కానుకకు గతేడాదితో పోలిస్తే అదనంగా రూ.200కోట్లు ఖర్చయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందుతోందా? లేదా? అన్న దానిపై పర్యవేక్షణ ఉండాలి’అని సీఎం అన్నారు.

భద్రతపై అవగాహన: పాఠశాలలు, కళాశాలల్లో భద్రతపై మహిళా పోలీసులు అవగాహన కల్పించనున్నారని అధికారులు తెలిపారు. విద్యా వ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాల మేరకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్‌ఓపీ) అధికారులు రూపొందించారు. బాల్య వివాహాల నివారణ, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, పోక్సో చట్టంపై అవగాహన, ఫిర్యాదుల బాక్సు నిర్వహణపై విద్యార్థులకు మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని