Andhra News: వైదొలుగుతామన్న ఇసుక గుత్తేదారులు

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలు, విక్రయాల గుత్తేదారులుగా ఉన్న జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి.

Updated : 06 Jul 2024 05:15 IST

అధికారులతో భేటీలో జీసీకేసీ, ప్రతిమ ప్రతినిధుల అంగీకారం
ఉచిత ఇసుక విధానంపై నేడో, రేపో ఉత్తర్వులు
కలెక్టర్లతో నేడు సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలు, విక్రయాల గుత్తేదారులుగా ఉన్న జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం శని లేదా ఆదివారాల్లో ఉచిత ఇసుక విధానం అమలుపై ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. రాష్ట్రంలో ఈనెల 8 నుంచి కొత్త విధానం అమలు కానుంది. ప్రస్తుతం గత ప్రభుత్వంలో మాదిరిగానే టన్ను ఇసుక రూ.475కు విక్రయిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలుత జేపీ సంస్థ రెండున్నరేళ్లు ఈ వ్యాపారం చేయగా, గత డిసెంబరు నుంచి రెండేళ్ల కాలానికి జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలు టెండరు దక్కించుకొని ఒప్పందం చేసుకున్నాయి. వీటిలో ప్రతిమ సంస్థ ఉమ్మడి శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకు ఉన్న మొదటి ప్యాకేజీ, నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో కూడిన మూడో ప్యాకేజీలో వ్యాపారం చేస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఉన్న జిల్లాలకు చెందిన రెండో ప్యాకేజీని జీసీకేసీ సంస్థ నిర్వహిస్తోంది. తాజాగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో గనుల శాఖ సంచాలకుడు ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం ప్రతిమ, జీసీకేసీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తాము టెండరు ఒప్పందం నుంచి తప్పుకొంటామని వారు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎంత ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేశారు? ప్రభుత్వానికి ఎంత చెల్లించారు? ఇంకా ఎంత బకాయిలున్నాయి? తదితరాలపై మున్ముందు అధికారులు తేల్చనున్నారు.

కలెక్టర్లకు నేడు మార్గనిర్దేశం 

ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి ఎలా అమలు చేయాలో చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. జిల్లాల కలెక్టర్లు, మైనింగ్‌ డీడీలు, ఏడీలు తదితరులంతా హాజరు కానున్నారు.

  • సీనరేజ్‌ ఛార్జి టన్నుకు రూ.88, రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు ఇసుక తరలించినందుకు రవాణా ఖర్చు, జీఎస్టీ 18 శాతం కలిపి ఏయే స్టాక్‌ పాయింట్స్‌లో ఎంత ధర అనేది కలెక్టర్లు శనివారం ఖరారు చేయనున్నారు.
  • ఇసుక విక్రయాలపై పూర్తి అధికారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ)కి అప్పగించనున్నారు.
  • అన్ని జిల్లాల్లో నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక, డ్రెడ్జింగ్‌ ద్వారా తవ్వితీసింది అధికారులు లెక్క వేస్తున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ఉన్నట్లు గుర్తించారు. శనివారానికి తుది లెక్కలు తేలనున్నాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని