Andhra News: రేపటి నుంచి ఉచిత ఇసుక

రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది.

Updated : 07 Jul 2024 08:34 IST

తొలుత నిల్వకేంద్రాల్లో ఉన్నది అందజేత
ప్రభుత్వానికి ఆదాయం లేకుండా.. తవ్వకాల ఖర్చు, సీనరేజ్‌ మాత్రమే వసూలు
అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా నిఘా
వాగులు, వంకల్లో ఎడ్ల బండిలో తవ్వితెచ్చుకునేందుకు అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్‌ మాత్రమే వసూలుచేసి ప్రజలకు అందజేయనుంది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం.. అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా వైదొలగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనులశాఖ అధికారులు లెక్కతేల్చారు. ఇదంతా సోమవారం నుంచి అందజేయనున్నారు. సెప్టెంబరు వరకు మూడు నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్‌ ఉంటుందని అంచనా వేశారు.

ఇసుక అందజేసేదిలా..

 • సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు ప్రకటించనున్నారు.
 • వాటిని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు.. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
 • నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా, నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక కార్యదళం (ఎస్‌ఈబీ), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా నిఘా ఉంచనున్నారు.
 • నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీచేస్తారు. సెక్యూరిటీ స్టేషనరీ పత్రాలతో కూడిన వేబిల్లులను గనులశాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తున్నారు.

ఈ సొమ్ము మాత్రమే చెల్లించాలి

 • సీనరేజ్‌ కింద టన్నుకు రూ.88 తీసుకుంటారు. ఇప్పటివరకు గుత్తేదారులుగా ఉన్న జీసీకేసీ, ప్రతిమ సంస్థలు ఇసుక తవ్వినందుకు అయిన ఖర్చు కింద టన్నుకు రూ.30 చొప్పున వసూలుచేస్తారు. బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే (ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో మాత్రమే) టన్నుకు రూ.225 చొప్పున తీసుకుంటారు. రీచ్‌ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే.. రవాణాఖర్చు కింద టన్నుకు, కి.మీ.కు రూ.4.90 చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చుకింద టన్నుకు రూ.20 తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18% జీఎస్టీ వేస్తారు. ఇలా అన్నీ కలిపి.. ఆయా స్టాక్‌ పాయింట్లలో టన్ను ఇసుక ఎంతనేది కలెక్టర్లు నిర్ధారణ చేస్తారు.
 • ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదు. గతంలో ప్రభుత్వం ప్రతి టన్నుకు రూ.375 చొప్పున గుత్తేదారు నుంచి వసూలుచేసేది.
 • సీనరేజ్‌ కింద వసూలు చేసే రూ.88.. జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతినెలా జమచేయనున్నారు.
 • నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20 చొప్పున తీసుకునే సొమ్మును.. వేబిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, మున్ముందు రీచ్‌లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు.
 • నిల్వకేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తారు.
 • కలెక్టర్, జిల్లా గనులశాఖ అధికారి పేరిట సంయుక్తంగా బ్యాంక్‌ ఖాతా తెరవనున్నారు. ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును ఆ ఖాతాలో జమచేస్తారు.
 • ఇందులో జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలు ఇసుక తవ్వితీసిన ఖర్చు, నిల్వ కేంద్రానికి రవాణాచేసిన ఖర్చుని ప్రభుత్వం వద్ద ఉంచనున్నారు. త్వరలో ఆ రెండు సంస్థలకు తొలగింపు నోటీసులు ఇచ్చాక, వాళ్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిల లెక్కలు తేల్చాక.. ఈ సొమ్మును బాకీ కింద జమచేసుకోనున్నారు.
 • తొలుత వారం, పది రోజులు చేతిరాతతో వేబిల్లులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ వేబిల్లులు జారీచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎడ్లబండ్లలో నేరుగా తెచ్చుకునేలా..

వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా మాన్యువల్‌గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించారు. ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లవచ్చని గనులశాఖ అధికారులు తెలిపారు.


పూడిక ఇసుక తవ్వకాలకు ఏర్పాట్లు

 • బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా, కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో)కి ఫీజులు చెల్లించి అనుమతి తీసుకోనున్నారు.
 • ఇప్పటికే జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలకు రాష్ట్రంలో పలు రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతిచ్చింది. వీటిని రద్దుచేయించి, గనులశాఖ తరఫున అనుమతులు తీసుకోనున్నారు.
 • జిల్లాల వారీగా ఏయే రీచ్‌ల్లో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉంటాయనేది అంచనాలు రూపొందిస్తున్నారు. సెప్టెంబరు చివరి నాటికి వీటికి అనుమతులు తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని