Andhra News: పోతేపోనీ అని వదిలేశారు!

గత జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది.

Published : 06 Jul 2024 05:49 IST

కేంద్ర నిధులకు రాష్ట్ర వాటా జమ చేయని గత వైకాపా సర్కారు
ఐదేళ్లలో రూ. 250 కోట్లు కోల్పోయిన రాష్ట్ర పోలీసు శాఖ
బలగాల ఆధునికీకరణపై కోలుకోలేని దెబ్బ

ఈనాడు, అమరావతి: గత జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రాష్ట్రాలకు సాయం (ఏఎస్‌యూఎంపీ) పథకంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి చేసిన కేటాయింపులకు.. వైకాపా ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ జమ చేయకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ఏడాదికి కనీసం రూ. 50 కోట్ల చొప్పున కోల్పోయినట్లు అంచనా. ఏఎస్‌యూఎంపీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాలు భరించాలి. జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వలేదు. అంతకు ముందు జరిగిన పలు పనులకు సంబంధించిన వినియోగ పత్రాలనూ (యూసీలు) కేంద్రానికి సమర్పించలేదు. వీటన్నింటి వల్ల నేర నియంత్రణ, పరిశోధన, కేసుల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణపరంగా అవసరమైన కీలక మౌలిక వసతులు, అధునాతన సాంకేతికత సమకూర్చుకోవటంలో పోలీసు శాఖ వెనకబడింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పలు కీలక వ్యవస్థల వార్షిక నిర్వహణకు కూడా నిధుల్లేక అవి నిర్వీర్యమయ్యాయి. మొత్తంగా జగన్‌ ప్రభుత్వం పోలీసు శాఖను అన్ని విధాలుగా నాశనం చేసి, దాని వెన్ను విరిచేసింది. 

తెదేపా హయాంలో కేటాయింపులకు మించి నిధులు 

పోలీసు బలగాల ఆధునికీకరణకు కేంద్రం కేటాయించిన నిధులకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వాటా జమ చేయటం, వినియోగ పత్రాలు సమర్పించటంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద ప్రోత్సాహకంగా అదనపు నిధులు లభించేవి. రాష్ట్ర విభజన వల్ల కీలక మౌలిక వసతుల్ని కోల్పోయిన పోలీసు శాఖకు తిరిగి వాటిని సమకూర్చుకోవటానికి ఈ నిధులు ఎంతోకొంత ఉపయోగపడేవి. రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల భవన నిర్మాణం సహా తెదేపా హయాంలో ఆ దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. ఈ ఒరవడిని కొనసాగించుంటే గత అయిదేళ్లలో పోలీసు శాఖ పటిష్ఠమయ్యేందుకు అవకాశం ఉండేది. జగన్‌ ప్రభుత్వం  వాటన్నింటినీ అటకెక్కించేసింది.

  • ఏఎస్‌యూఎంపీ పథకం కింద తెదేపా ప్రభుత్వ హయాంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 26.48 కోట్ల కేటాయింపులు చేయగా.. అంతకు దాదాపు రెట్టింపు అంటే రూ. 50.81 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అదే వైకాపా హయాంలో ఏటేటా కేంద్రం కేటాయింపులు తగ్గిపోయాయి. 2020-21 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం రూ. 6.27 కోట్లే విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపించకపోవటం, మ్యాచింగ్‌ గ్రాంట్‌ జమ చేయకపోవటమే దీనికి ప్రధాన కారణం. 
  • ఏఎస్‌యూఎంపీ కింద నిధులు రాకపోవటంతో వాహనాలు.. ఆయుధాల కొనుగోలు, అధునాతన సాంకేతిక వ్యవస్థల ఏర్పాటు తదితర విషయాల్లో పోలీసు శాఖ వెనకబడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని