Dharma Reddy: తితిదే మాజీ ఈఓ ధర్మారెడ్డిపై విజిలెన్స్‌ విచారణ

వైకాపాతో అంటకాగి, ఆ పార్టీ ప్రయోజనాల కోసం అధికారిక హోదాను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఈఓ ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది.

Published : 11 Jul 2024 04:44 IST

సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డిపైనా..
ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీవాణి టికెట్లు సహా అన్నింటా అవినీతికి పాల్పడ్డారని ధర్మారెడ్డిపై ఫిర్యాదులు

ఈనాడు, అమరావతి: వైకాపాతో అంటకాగి, ఆ పార్టీ ప్రయోజనాల కోసం అధికారిక హోదాను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఈఓ ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈ ఇద్దరు అధికారులూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టాలని పేర్కొంది. వీరి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తీసుకురావాలని నిర్దేశించింది. 

ధర్మారెడ్డిపై అనేక ఆరోపణలు

తితిదే అదనపు ఈఓగా, ఆ తర్వాత పూర్తిస్థాయి ఇన్‌ఛార్జి ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి అత్యంత వివాదాస్పద అధికారి. శ్రీవాణి ట్రస్టు టికెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో ఏర్పడ్డ పరిచయాలను దుర్వినియోగం చేసి వైకాపా కోసం విరాళాలు సేకరించారనే విమర్శలున్నాయి. తిరుమలలో గెస్ట్‌హౌస్‌లకు భూముల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులున్నాయి. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూల తయారీ ముడిసరకుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, శ్రీవారి నగదు, బంగారు డిపాజిట్లను వారికి అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారనే విమర్శలున్నాయి. ధర్మారెడ్డి అవినీతి, అక్రమాలపై  విజిలెన్స్‌ విచారణ జరిపించాలంటూ రెండు    రోజుల క్రితం తెదేపా నేతలు నీలాయపాలెం విజయ్‌కుమార్, గురజాల మాల్యాద్రి సీఎస్‌ నీరబ్‌కుమార్‌   ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. 

సివిల్‌ పనులకు బడ్జెట్‌ పెంచేసి.. నిధులు పక్కదారి పట్టించి 

‘‘తితిదే బడ్జెట్‌లో సివిల్‌ పనుల కోసం ఏటా రూ.250-300 కోట్ల వరకే గతంలో కేటాయించేవారు. ధర్మారెడ్డి ఆ కేటాయింపులను రూ.1,722 కోట్లకు పెంచేసి ఆ నిధులను పక్కదారి పట్టించారు. సివిల్‌ పనుల పేరిట అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నాయకులు, వ్యాపారవేత్తలకు అక్రమంగా దర్శనం టికెట్లు కేటాయించారు. రాజకీయ సిఫార్సుల ఆధారంగా తితిదేలోని వివిధ విభాగాల్లో సలహాదారులు, ఉద్యోగులను నియమించారు. తితిదే బోర్డు నిర్ణయాలేవీ వెబ్‌సైట్‌లో పెట్టకుండా అక్రమాలకు పాల్పడ్డారు. నిబంధనలు అతిక్రమించి తిరుపతిలోని పలు రోడ్ల నిర్మాణానికి తితిదే నిధులు వినియోగించారు. తిరుమల కాంప్లెక్స్‌ 5 (యాత్రీసదన్‌) నిర్మాణంలో రూ.98 కోట్లు కమీషన్ల రూపంలో పక్కదారి పట్టాయి. ఆసుపత్రుల నిర్మాణానికి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు విరాళమిచ్చే భక్తులకు ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలి’’ అంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. వీటన్నింటిపైనా విజిలెన్స్‌ విచారణ చేపట్టనుంది. 

విజయ్‌కుమార్‌రెడ్డిపైనా ఫిర్యాదులు 

వైకాపా హయాంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి.. ఆ శాఖలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదుచేశారు. ప్రకటనల జారీ సహా అనేక అంశాల్లో అక్రమాలు చేశారంటూ వివరాలు సమర్పించాయి. వీటన్నింటిపైనా విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని