‘బిగ్‌బాస్‌’తో ఏం సందేశమిస్తున్నారు?.. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు

బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షోలు సెన్సార్‌ లేకుండా ప్రసారమవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వాటి ద్వారా నిర్వాహకులు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని

Updated : 01 Oct 2022 08:42 IST

ఇలాంటి రియాల్టీ షోల కట్టడికి చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా?

ఆ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి

ఈనాడు, అమరావతి: బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షోలు సెన్సార్‌ లేకుండా ప్రసారమవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వాటి ద్వారా నిర్వాహకులు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించింది. ఇలాంటి షోలకు అడ్డుకట్ట వేసే విషయంలో చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా లేదా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిగ్‌బాస్‌ వంటి ప్రదర్శనల వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ.. కేంద్ర హోం, సమాచార ప్రసార, మహిళ శిశు సంక్షేమ శాఖలతోపాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ తదితరులకు నోటీసులిచ్చింది. గతంలో ఇదే తరహా అంశానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ వేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను అక్టోబర్‌ 11కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. హింస, అశ్లీలం, అసభ్యతను ప్రోత్సహించేలా ఉన్న బిగ్‌బాస్‌ షో ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ 6వ సీజన్‌ జరుగుతోందన్నారు. కార్యక్రమాన్ని సెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేవారు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి షోల కట్టడికి ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు.

* ధర్మాసనం స్పందిస్తూ.. టీవీల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలపై ఆవేదన వ్యక్తం చేసింది. మంచి సందేశాలు ఇచ్చే కార్యక్రమం ఒక్కటైనా ఉంటోందా? అని వ్యాఖ్యానించింది. గతంలో దేశభక్తుల చరిత్రలు ప్రసారం చేసే వారని గుర్తుచేసింది. పాత రోజుల్లో గొప్ప సినిమాలు చిత్రీకరించేవారని, వాటిలో మంచి సందేశం ఉండేదని పేర్కొంది. ప్రస్తుత సినిమాలు, టీవీ కార్యక్రమాలు కుటుంబసభ్యులంతా కలిసి కూర్చుని చూసేలా ఉన్నాయా అని ప్రశ్నించింది.  కొట్టుకోవడం, తిట్టుకోవడం, రెచ్చగొట్టడం తప్ప ఏముంటోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది.  దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నత విద్యావంతులే చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. సమాజంలోని సమస్యలపై ఉన్నత వర్గం మాట్లాడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌ షోపై 2019లో దాఖలు చేసిన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని