Vasudeva Reddy: వాసుదేవరెడ్డికి హైకోర్టు షాక్‌

జగన్‌ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Updated : 14 Jun 2024 08:58 IST

మధ్యంతర ముందస్తు బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ
విచారణ 18కి వాయిదా
సోదాల్లో 6 కేజీల బంగారం కొనుగోలు రసీదులు దొరికాయి
అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దన్న సీఐడీ న్యాయవాది
ఈనాడు - అమరావతి 

జగన్‌ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కీలక దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాల చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో ‘మధ్యంతర’ ముందస్తు బెయిలు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దశలో బెయిలు ఇవ్వొద్దన్న సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ విజయ్‌ విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 6న ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలను చోరీ చేసి, కారులో తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం మొగులూరుకు చెందిన గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీఎస్‌బీసీఎల్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిపై మంగళగిరి సీఐడీ ఠాణాలో కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌ నగేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన రోజు పిటిషనర్‌ దిల్లీలో ఉన్నారని చెప్పారు. అయినా రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారన్నారు. ఎలాంటి షరతులనైనా విధించి మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు. 

సీఐడీ తరఫు న్యాయవాది ఎం.లక్ష్మీనారాయణ, సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించొద్దని కోరారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. కారులో సోదాలు చేయగా 6 కేజీల బంగారం కొనుగోలుకు సంబంధించిన రశీదులు దొరికాయని, దాని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని చెప్పారు. కారులో వాసుదేవరెడ్డి ఐడీ కార్డు దొరికిందన్నారు. పిటిషనర్‌ కింద పనిచేసిన అధికారులు ఇప్పటికీ కార్పొరేషన్‌లోనే పని చేస్తున్నారని,  వాసుదేవరెడ్డికి బెయిలిస్తే వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు.  ఐపీసీ సెక్షన్లు 427, 379, 120(బి) సెక్షన్ల కింద పిటిషనర్‌పై మొదట కేసు నమోదు చేశారని, వాటితోపాటు 420, 409, 467, 471 సెక్షన్లను చేర్చాలని కోరుతూ విజయవాడ మూడో అదనపు సీఎంఎం కోర్టులో మెమో వేశామని కోర్టుకు వివరించారు. ఏడేళ్లకు పైబడి జైలు శిక్ష పడేందుకు వీలున్న సెక్షన్లు అందులో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పిటిషనర్‌కు వర్తించవన్నారు. మరోవైపు విజయవాడలోని పిటిషనర్‌ ఇంటి తాళం బద్దలుకొట్టి సోదాలు చేసేందుకు దిగువ కోర్టు అనుమతి కోరామని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ దశలో మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దన్నారు. దీంతో కోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది.

 సీఐడీ తరఫున ఈ కేసులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది మెండ లక్ష్మీనారాయణ, సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని