Home Minister Anitha: అదే బ్లడ్‌ ఉందనుకుంటే.. తప్పుకోండి: ఏపీ హోంమంత్రి వార్నింగ్‌

‘యథా రాజా.. తథా సైనికులు. ఇప్పుడు రాజు మారాడు. సైనికులు కూడా మారాలి. అలాకాకుండా ఇంతకుముందులాగే వ్యవహరిస్తాం.. మాలో అదే బ్లడ్‌ ప్రవహిస్తోంది అనుకునేవాళ్లు పక్కకు తప్పుకుంటే.. వారి స్థానంలో పనిచేసేవారు వస్తారు.

Updated : 20 Jun 2024 09:25 IST

సారథ్యం మారింది.. మీరూ మారాలి
‘వైకాపా బాధితులు’ కోరితే కేసుల రీఓపెన్‌
బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి వెల్లడి

సచివాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వంగలపూడి అనిత.
చిత్రంలో ఆ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌ తదితరులు

ఈనాడు, అమరావతి: ‘యథా రాజా.. తథా సైనికులు. ఇప్పుడు రాజు మారాడు. సైనికులు కూడా మారాలి. అలాకాకుండా ఇంతకుముందులాగే వ్యవహరిస్తాం.. మాలో అదే బ్లడ్‌ ప్రవహిస్తోంది అనుకునేవాళ్లు పక్కకు తప్పుకుంటే.. వారి స్థానంలో పనిచేసేవారు వస్తారు. ప్రజల రక్షణ కోసం పనిచేయండి. ఖాకీ డ్రెస్‌ గౌరవాన్ని పెంచండి’ అని హోం మంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఉద్దేశించి పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం ఆమె హోం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం నమోదు చేసిన సీఐడీ తదితర కేసులన్నీ పరిశీలిస్తాం. తెదేపా ఆఫీసుపై దాడి కేసు.. చంద్రయ్యను పీక కోసి చంపిన కేసు వంటివన్నీ చెక్‌ చేస్తాం. ఐదేళ్లలో సామాన్యులపై అక్రమంగా అనేక కేసులు పెట్టారు. గత వైకాపా ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు బలైపోయినవారు తమ కేసు రీఓపెన్‌ చేయాలని కోరితే.. తిరిగి తెరిచి వారికి న్యాయం చేస్తాం’ అని అనిత తెలిపారు.

గంజాయి, డ్రగ్స్‌పై 100 రోజుల ప్రణాళిక

‘హోంశాఖ తరపున 100 రోజుల కార్యాచరణ సిద్ధమైంది. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలుత వంద రోజుల్లో వీటిని చాలా వరకు తగ్గిస్తాం. ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తాం. దిశ చట్టం లేకుండా దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. అవి వాస్తవంగా మహిళా పోలీస్‌స్టేషన్లు మాత్రమే. త్వరలో వాటి పేర్లు మారుస్తాం. పోలీసులు గత అయిదేళ్లలో డ్రెస్‌పై నేమ్‌ ప్లేట్‌ లేకుండా విధులు నిర్వహించారు. ఇప్పుడు వారికి నేమ్‌ ప్లేట్‌తో విధులు నిర్వహించే ధైర్యం వచ్చింది’ అని అనిత పేర్కొన్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనితకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందజేస్తున్న డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా

అవమానించిన చోటే గౌరవమిచ్చారు

‘ఒకప్పుడు డీజీపీ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడానికి వెళితే అనుమతించకుండా, నానా యాగి చేశారు. చంద్రబాబుకు ఎవరి సమర్థత ఏమిటో తెలుసు. నేను ఏ పోలీసులతో అవమానాలకు గురయ్యానో, వారి వద్దే గౌరవంగా నిలబెట్టారు. సామాన్య టీచర్‌ను హోంమంత్రి చేశారు. తొలుత మంత్రి పదవి ఇచ్చాక, ఏదైనా శాఖ ఇస్తారని అనుకున్నాను. హోంశాఖ అనగానే కాళ్లు, చేతులు చల్లబడిపోయాయి. ఈ బాధ్యతలు తప్పకుండా నిర్వహించగలనని నమ్మకం తెచ్చుకున్నాను. మంత్రిగా బాధ్యతలు తీసుకోకుండానే ఫీల్డ్‌ మీదకు వచ్చాను. దీనిని బట్టే చంద్రబాబు, లోకేశ్‌ ఎంత ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారో అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో గీత దాటి వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకునే ముందు.. వారి పేర్లు చెబుతాను. పోలీసులూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్టేషన్లలో వారికి మౌలిక వసతులు కూడా లేవు. వీటిపై కూడా దృష్టి పెడతాం’ అని హోం మంత్రి అనిత తెలిపారు. బడ్జెట్‌ రిలీజ్‌ దస్త్రంపై ఆమె తొలి సంతకం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సహా పోలీస్‌ ఉన్నతాధికారులు అనితను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని