15సార్లు పిలిచినా.. గుత్తేదారులు గప్‌చుప్‌!

కొత్త ఆస్తి పన్ను విధానం అమలులోకి వచ్చాక పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెరిగినా.. అభివృద్ధి పనులకు ముందడుగు పడటం లేదు.

Published : 05 Jun 2023 04:49 IST

రూ.750 కోట్ల పెండింగ్‌ బిల్లులతో కొత్త పనులకు అనాసక్తి
పుర, నగర పాలికల్లో ముందుకెళ్లని అభివృద్ధి
సమావేశాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల గగ్గోలు
ఆదాయం పెరిగినా.. సమస్యల పరిష్కారంలో అధోగతి
ఈనాడు - అమరావతి


రెండేళ్లయింది.. ఒక్క పనైనా చేశారా? వార్డులో నీరు లేదు, రోడ్లు లేవు. సమస్యలు పరిష్కరించకపోతే పదవికి రాజీనామా చేస్తా.

 2023 ఏప్రిల్‌ 28న శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక సర్వసభ్య సమావేశంలో అధికార వైకాపా కౌన్సిలర్‌ బి.సుజాత ఆవేదన


కొత్త ఆస్తి పన్ను విధానం అమలులోకి వచ్చాక పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెరిగినా.. అభివృద్ధి పనులకు ముందడుగు పడటం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికార పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సర్వసభ్య సమావేశాల్లో ఏకరవు పెడుతున్నా, ఫలితం ఉండడం లేదు. పుర, నగరపాలక సంస్థల్లో నిధులు సమృద్ధిగా ఉన్నా.. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. పూర్తయిన పనుల బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్‌)లో అప్‌లోడ్‌ చేయడం వరకే ఇంజినీర్లు పరిమితమవుతున్నారు. బిల్లుల చెల్లింపులు తమ చేతుల్లో లేదని పుర కమిషనర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసిన పనులు కూడా ఆచరణకు నోచుకోవడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఇటీవల నాలుగైదుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో రూ.15 లక్షల అంచనాలతో 12 పనులకు అధికారులు 15సార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు. బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో కొత్త పనులకు టెండర్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని అత్యధిక పుర, నగరపాలక సంస్థల్లో దాదాపుగా ఇదే పరిస్థితి.

భారీగా పెరిగిన ఆస్తి పన్ను ఆదాయం

పట్టణ స్థానిక సంస్థలకు ప్రధాన వనరుల్లో కీలకమైన ఆస్తి పన్ను ఆదాయం మూడేళ్లలో భారీగా పెరిగింది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే కొత్త విధానం తీసుకొచ్చాక పాత బకాయిలతో కలిపి ఏటా కోట్లాది రూపాయలు వసూలవుతున్నాయి. 2020-21లో పాత బకాయిలతో కలిపి ఇళ్లు, భవనాలు, దుకాణాల నుంచి ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.990.78 కోట్లు ఉండేది. 2023-24 నాటికి రూ.1,650.33 కోట్లకు పెరిగినట్లు అంచనా. మూడేళ్లలో పుర, నగరపాలక సంస్థలకు సుమారు రూ.660 కోట్ల అదనపు ఆదాయం పెరిగింది. కొత్త విధానంలో ఏటా 10-15% వరకు ఆస్తి పన్ను ఆదాయం పెరగనుంది.

అప్‌లోడ్‌ చేయడమే.. బిల్లులు అడగొద్దు

రాష్ట్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్‌)కి అనుసంధానించిన పట్టణ స్థానిక సంస్థల పర్సనల్‌ డిపాజిట్‌(పీడీ) ఖాతాల నుంచి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యమవుతోంది. ప్రత్యేకించి ఇంజినీరింగ్‌ పనులకు బిల్లుల కోసం ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి. పుర, నగరపాలక సంస్థల్లో పూర్తి చేసిన పనుల బిల్లులను ఇంజినీర్లు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాక ఆర్థికశాఖ చెల్లింపులు చేయాలి. పీడీ ఖాతాల్లో సమృద్ధిగా నిధులున్నా.. బిల్లుల్లో కదలిక లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో చేసిన పనులకు రూ.750 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలోనే దాదాపు రూ.50 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.


‘సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసి ఏడాదైనా వార్డులో పనులు ప్రారంభించలేదు. ఇప్పటికైనా వాటిని చేయించకపోతే బలవన్మరణానికి పాల్పడతా’

- 2023 మార్చి 31న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సర్వసభ్య సమావేశానికి అధికార వైకాపా కౌన్సిలర్‌ ఎస్‌.సురేశ్‌ పెట్రోల్‌ సీసాతో హాజరై వ్యక్తం చేసిన ఆవేదన


‘వార్డులో చిన్న పనులు కూడా చేయించలేకపోతున్నాం. మొక్కుబడిగా నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశాలతో ఉపయోగం ఏంటి? కౌన్సిల్‌లో ఆమోదించిన పనులు ప్రారంభమయ్యేలా చూడాలి’

- 2022 జనవరి 31న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక సర్వసభ్య సమావేశంలో అధికార పక్ష సభ్యుల ఆందోళన


‘ప్రజా సమస్యలను సమావేశాల్లో ప్రస్తావిస్తున్నా.. ఒక్కటీ పరిష్కారం కావడం లేదు. ఈ మాత్రానికి సమావేశాలు దేనికి? వీధుల్లో పాడైన దీపం స్థానంలో కొత్తది వేయించుకోలేని దుస్థితిలో ఉన్నందుకు బాధపడుతున్నాం’

- 2022 జనవరి 31న వైయస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదన


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు