AP news: పాత కొత్తల కలయిక

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జనసేత అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా 24 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరిలో పలువురు కొత్తవారితో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన వారూ ఉన్నారు.

Updated : 13 Jun 2024 18:33 IST

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా 24 మందితో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. మంత్రి వర్గంలో పలువురు కొత్తవారితో పాటు పాతవారికి స్థానం కల్పించారు.

కొణిదెల పవన్‌కల్యాణ్‌ (55)

 • స్వస్థలం: హైదరాబాద్‌
 • విద్యార్హత: ఎస్సెస్సెల్సీ
 • కుటుంబ నేపథ్యం: భార్య అనా, పిల్లలు దేశాయ్‌ అకిరా నందన్, దేశాయ్‌ ఆద్య, పొలెనా అంజనా పవనోవా, మార్క్‌శంకర్‌ పవనోవిచ్‌.
 • రాజకీయ నేపథ్యం: 2008లో ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ద్వారా సేవలు అందించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి, తాము పోటీచేయకుండా కూటమి విజయంలో కీలకపాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓడారు. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో గెలిచి.. మంత్రిపదవి కైవసం చేసుకున్నారు.

నారా లోకేశ్‌ (41)

 • స్వస్థలం: హైదరాబాద్‌
 • విద్యార్హత: ఎంబీఏ (స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ) 
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌.
 • రాజకీయ నేపథ్యం: తెదేపా ప్రధానకార్యదర్శి. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై.. ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నుంచి పోటీచేసి, స్వల్ప తేడాతో ఓడారు. 2023 జనవరిలో ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించి 3,100 కిలోమీటర్లకు పైగా నడిచారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచి, రెండోసారి మంత్రిపదవి పొందారు.

కింజరాపు అచ్చెన్నాయుడు (54)

 • స్వస్థలం: నిమ్మాడ, కోటబొమ్మాళి మం. 
 • విద్యార్హత: బీఎస్సీ
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు కళావతమ్మ, దాలినాయుడు, భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్‌నాయుడు, తనూజ్‌
 • రాజకీయ నేపథ్యం: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. 1995లో హరిశ్చంద్రపురం ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీచేశారు. 1999, 2004 ఎన్నికల్లో ఇక్కడినుంచే గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన టెక్కలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి కార్మిక, క్రీడలు, ఉపాధి కల్పన, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లోనూ గెలిచారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ మంత్రి అయ్యారు.

నాదెండ్ల మనోహర్‌ (59)

 • స్వస్థలం: దోనేపూడి, కొల్లూరు మం.
 • విద్యార్హత: ఎంబీఏ (నిజాం కళాశాల)
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు నాదెండ్ల భాస్కరరావు, లలితాంబ. భార్య డాక్టర్‌ మనోహరం, పిల్లలు మిథుల్, లలిత్‌
 • రాజకీయ నేపథ్యం: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009 ఎన్నికలలో తెనాలి నుంచి కాంగ్రెస్‌పార్టీ తరఫున గెలిచారు. 2009 నుంచి ఉపసభాపతిగా, 2011 నుంచి సభాపతిగా వ్యవహరించారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2018 అక్టోబరు 12న జనసేనలో చేరారు. 2019లో జనసేన తరఫున తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికలలో పోటీచేసి గెలిచి, మంత్రిపదవి పొందారు.

నిమ్మల రామానాయుడు (55)

 • స్వస్థలం: ఆగర్తిపాలెం, పాలకొల్లు మం.
 • విద్యార్హత: ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు ధర్మారావు, రామమణి, భార్య సూర్యకుమారి, ఇద్దరు పిల్లలు
 • రాజకీయ నేపథ్యం: పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లు నుంచి వరుసగా మూడుసార్లు తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైకాపా ప్రభంజనాన్ని ఎదుర్కొని గెలిచి, ప్రజాసమస్యలపై తనదైన శైలిలో పోరాడారు. గత శాసనసభలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా, ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరోలో ప్రత్యేక ఆహ్వానితునిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లోనూ గెలిచి, తొలిసారి మంత్రిపదవి చేపట్టారు.

పొంగూరు నారాయణ (68)

 • స్వస్థలం: నెల్లూరు
 • విద్యార్హతలు: ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ 
 • కుటుంబ నేపథ్యం: భార్య రమాదేవి, పిల్లలు సింధూజ, శరణి
 • మరెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 16 రాష్ట్రాల్లో పాఠశాలలు/కళాశాలలు ఏర్పాటు చేశారు. నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌గా సుపరిచితులు. 2014 ఎన్నికల తర్వాత నారాయణ రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. గత ఎన్నికల తర్వాత సరిగ్గా ఏడాదికి ఎమెల్సీ పదవితో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. రాజధాని నిర్మాణం, భూసేకరణలో నారాయణ పాత్ర కీలకం. 2019 వరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో దిగలేదు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో తెదేపా తరఫు పోటీ చేసి.. గెలిచి మళ్లీ మంత్రి అయ్యారు. 

ఆనం రామనారాయణరెడ్డి (72)

 • స్వస్థలం: నెల్లూరు
 • విద్యార్హత: బీకాం, బీఎల్‌
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు వెంకటరెడ్డి, వెంకట రమణమ్మ, భార్య శిరీష, పిల్లలు శుభకర్‌రెడ్డి, కైవల్య
 • రాజకీయ నేపథ్యం: ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడు. 1983లో నెల్లూరు తెదేపా అభ్యర్థిగా గెలిచారు. 1985లో రాపూరు నుంచి గెలిచి ఆర్‌అండ్‌బీ మంత్రి అయ్యారు. 1989లో రాపూరు నుంచి ఓడిపోయారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి 1999లో, 2004లో రాపూరు నుంచి గెలిచి, మంత్రిగా పనిచేశారు. 2009లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్‌ మంత్రిగా వ్యవహరించారు. 1983, 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. 2014లో ఆత్మకూరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో వెంకటగిరి నుంచి వైకాపా అభ్యర్థిగా గెలిచారు. 2024లో తెదేపా తరఫున గెలిచి, మళ్లీ మంత్రి అయ్యారు.

టీజీ భరత్‌ (48)

 • స్వస్థలం: కర్నూలు
 • విద్యార్హత: ఎంబీఏ (యూకే) 
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు టీజీ వెంకటేశ్, రాజ్యలక్ష్మి, భార్య శిల్ప
 • రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2010లో పట్టణ యువజనకాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెదేపాలోకి వచ్చారు. 2019లో కర్నూలు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కర్నూలు నుంచే పోటీచేసి గెలిచారు.

బీసీ జనార్దన్‌రెడ్డి (63)

 • స్వస్థలం: యనకండ్ల గ్రామం, బనగానపల్లి మండలం
 • విద్యార్హత: బీఏ 
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు బీసీ గుర్రెడ్డి, లక్ష్మమ్మ, భార్య ఇందిర
 • రాజకీయ నేపథ్యం: 2010లో తెదేపాలో చేరారు. వెంటనే బనగానపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. 

ఎన్‌ఎండీ ఫరూక్‌ (74)

 • స్వస్థలం: ముసలిమడుగు గ్రామం, కొత్తపల్లి మండలం
 • విద్యార్హత: ఎస్సెస్సెల్సీ
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు ఇబ్రహీం ఖలీల్, జనత్‌బీ, భార్య మహబూబ్‌ చాంద్‌
 • రాజకీయ నేపథ్యం: తెదేపా ఆవిర్భావం తర్వాతో పార్టీలో చేరి 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. పురపాలకశాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1999లో మూడోసారి గెలిచి పురపాలక, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో ఆరోగ్య, మైనారిటీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2023 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2024లో నంద్యాల నుంచి పోటీచేసి నాలుగోసారి గెలిచి మంత్రిపదవి దక్కించుకున్నారు.

కొల్లు రవీంద్ర (51)

 • స్వస్థలం: మచిలీపట్నం, కృష్ణా జిల్లా 
 • విద్యార్హత: బీఏ, ఎల్‌ఎల్‌బీ
 • కుటుంబ నేపథ్యం: భార్య నీలిమ, కుమారులు పునీత్‌చంద్ర, నవీన్‌ 
 • రాజకీయ నేపథ్యం: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన దివంగత నడకుదిటి నరసింహారావు అల్లుడైన రవీంద్ర ఆయన వారసునిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2007లో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 నుంచి కొల్లు ఫౌండేషన్‌ ద్వారా పేదలకు సేవా కార్యక్రమాలు, కొవిడ్‌ సమయంలో సహాయ కార్యక్రమాలు, నిర్వహిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తొలగించినప్పటి నుంచి ఫౌండేషన్‌ ద్వారా రోజూ అన్నదానం కొనసాగిస్తున్నారు. 2009లో మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడారు. 2014 ఎన్నికల్లో గెలిచి ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమం, సాధికారత శాఖల మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన 2024 ఎన్నికల్లో విజయం సాధించారు.

ఎస్‌.సవిత (47)

 • స్వస్థలం: రాంపురం, పెనుకొండ మండలం
 • విద్యార్హత: బీఏ 
 • కుటుంబ నేపథ్యం: తండ్రి రామచంద్రారెడ్డి, తల్లి గాయత్రి, భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు జగదీశ్‌ సాయి
 • రాజకీయ నేపథ్యం: తండ్రి రామచంద్రారెడ్డి ముందునుంచీ తెదేపాలో ఉండి, ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో 14 శాఖల మంత్రిగా పనిచేశారు. తండ్రి వారసత్వంతో సవిత రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్‌.ఆర్‌.ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. తెదేపా ప్రభుత్వంలో కొంతకాలం కురుబ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండేళ్లుగా అన్నక్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో మాజీమంత్రి ఉషశ్రీచరణ్‌పై గెలిచారు.

పయ్యావుల కేశవ్‌ (59)

 • స్వస్థలం: కౌకుంట్ల, ఉరవకొండ మండలం
 • విద్యార్హత: ఎంబీఏ 
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు ఓబుళమ్మ, వెంకటనారాయణ, భార్య హేమలత, కుమారులు విక్రమ్‌సింహ, విజయ్‌సింహ
 • రాజకీయ నేపథ్యం: 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ పిలుపుతో ఉరవకొండ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా  పనిచేశారు. 2015 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల కోటా  ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్‌గాలిని తట్టుకుని  ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ అయ్యారు. పలు అంశాల్లో వైకాపా ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో బయటపెట్టారు. తాజాగా ఏడోసారి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేపట్టారు.

సత్యకుమార్‌ యాదవ్‌ (53)

 • స్వస్థలం: ప్రొద్దుటూరు, వైఎస్సార్‌ జిల్లా
 • విద్యార్హత: ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌)
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు నాగూబాయి, నాగరాజారావు.
 • రాజకీయ నేపథ్యం: విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మదనపల్లెలో డిప్లొమా చేస్తున్న సమయంలో ఏబీవీపీ తరఫున కళాశాల ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 2018లో భాజపా జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి వరకు అండమాన్‌ నికోబార్‌ భాజపా ఇన్‌ఛార్జిగా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించారు. మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేపడుతున్నారు.

కొండపల్లి శ్రీనివాస్‌ (41)

 • స్వస్థలం: గంట్యాడ, విజయనగరం జిల్లా
 • విద్యార్హత: బీటెక్‌ కంప్యూటర్స్,   అమెరికాలో ఎంఎస్‌
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు సుశీల, కొండలరావు, భార్య లక్ష్మీసింధు, పిల్లలు విహాన్, మేధ
 • రాజకీయ నేపథ్యం: తాత కొండపల్లి పైడితల్లినాయుడు జడ్పీ ఛైర్మన్‌గా, మూడుసార్లు బొబ్బిలి ఎంపీగా పనిచేశారు. తండ్రి కొండలరావు మూడుసార్లు గంట్యాడ ఎంపీపీగా ఉన్నారు. ఈయన కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో ఉంది.

గుమ్మిడి సంధ్యారాణి (50)

 • స్వస్థలం: కవిరిపల్లి, మక్కువ మం.
 • విద్యార్హత: బీఎస్సీ
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు పార్వతమ్మ, ముత్యాలు, భర్త జయకుమార్, పిల్లలు పృథ్వీ, ప్రణతి
 • రాజకీయ నేపథ్యం: తండ్రి ముత్యాలు మాజీ ఎమ్మెల్యే. ఆయన వారసత్వంతోనే సంధ్యారాణి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ ఆర్గనైజర్‌గా, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యురాలిగా వ్యవహరించారు. 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. తెదేపా జిల్లా మహిళా అధ్యక్షురాలు, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు, పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉంటూ తాజా ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.

మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (44)

 • స్వస్థలం: పడమటికోన, చిన్నమండెం మండలం
 • విద్యార్హత: బీడీఎస్‌
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు సుశీలమ్మ, నాగిరెడ్డి, భార్య హరితరెడ్డి, పిల్లలు నిశ్చల్‌ నాగిరెడ్డి, నాగ వైష్ణవిరెడ్డి
 • రాజకీయ నేపథ్యం: తండ్రి మండిపల్లి నాగిరెడ్డి రాయచోటి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా 1985, 89 ఎన్నికల్లో గెలిచారు. ఆయన మరణానంతరం సోదరుడు జయరామిరెడ్డి కుమారుడు నారాయణరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తల్లి సుశీలమ్మ చిన్నమండెం ఎంపీపీగా పనిచేశారు. రాంప్రసాద్‌రెడ్డి మూడేళ్ల క్రితం వైకాపాను వీడి తెదేపాలో చేరారు.

కొలుసు పార్థసారథి (59)

 • స్వస్థలం: కారకంపాడు, మొవ్వ, కృష్ణాజిల్లా
 • విద్యార్హత: డిగ్రీ 
 • కుటుంబ నేపథ్యం: తండ్రి పెద్దరెడ్డయ్య, తల్లి సామ్రాజ్యం, భార్య కమల లక్ష్మి, కుమారుడు నితీశ్‌ కృష్ణ
 • రాజకీయ నేపథ్యం: తండ్రి కొలుసు పెద్దరెడ్డయ్య మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా గెలిచారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన పార్థసారథి 2004లో తొలుత ఉయ్యూరు నుంచి గెలిచారు. తర్వాత 2009, 2019లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే తెదేపాలో చేరి, నూజివీడు నుంచి విజయం సాధించారు.

వాసంశెట్టి సుభాష్‌ (47)

 • స్వస్థలం: అమలాపురం
 • విద్యార్హత: బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ
 • కుటుంబ నేపథ్యం: తండ్రి వాసంశెట్టి సత్యం, తల్లి కృష్ణకుమారి అమలాపురం మున్సిపల్‌ కౌన్సిలర్లు. భార్య లక్ష్మీసునీత, కవలపిల్లలు సత్య దివిత, సత్య దీక్షిత.
 • రాజకీయ నేపథ్యం: 1995-98 కాలంలో అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో బీసీ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎస్‌ఏఎఫ్‌ స్వచ్ఛందసంస్థ ద్వారా శెట్టిబలిజ సామాజికవర్గంలో పట్టు సాధించారు. 2019 ఎన్నికల్లో వైకాపా రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అమలాపురం అల్లర్ల తర్వాత తెదేపాలో చేరారు. రామచంద్రపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, మంత్రి పదవి దక్కించుకున్నారు.

కందుల దుర్గేశ్‌ (62)

 • స్వస్థలం: రాజమహేంద్రవరం
 • విద్యార్హత: ఎంఏ (ఎకనామిక్స్‌)
 • కుటుంబ నేపథ్యం: భార్య ఉషారాణి ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు, తల్లి నామినేషన్‌ వేసినరోజు మృతిచెందారు. కుమారుడు డాక్టర్‌ కృష్ణతేజ, కుమార్తె శ్రీరంగప్రియ
 • రాజకీయ నేపథ్యం: తాత పోతుల వీరభద్రారావు 1962-67లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా, మున్సిపల్‌ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సేవలందించారు. 2007-13 మధ్య దుర్గేశ్‌ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2016 డిసెంబర్‌ 12న వైకాపాలో చేరారు. 2018 ఆగస్టు 30న జనసేనలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీచేసి గెలిచి, మంత్రి పదవి దక్కించుకున్నారు.

గొట్టిపాటి రవికుమార్‌ (48)

 • స్వస్థలం: యద్దనపూడి
 • విద్యార్హత: బీఈ (టెక్స్‌టైల్స్‌)
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు డాక్టర్‌ శేషగిరిరావు, జయంతి, భార్య ఝాన్సీ, కుమారులు హర్షవర్ధన్, మహేష్‌బాబు
 • రాజకీయ నేపథ్యం: దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన రవికుమార్‌ ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి దివంగత శేషగిరిరావుకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డితో సాన్నిహిత్యం ఉంది. వారిద్దరూ కలిసి వైద్యవిద్య చదివారు. ఆ పరిచయంతో 2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి తొలిసారిగా రవికుమార్‌ గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దవడంతో అద్దంకి నుంచి 2009లో కాంగ్రెస్‌ తరఫునే గెలిచారు. 2014లో వైకాపాలో చేరి ఆ పార్టీ తరఫున గెలిచారు. 2016లో తెదేపాలో చేరారు. 2019, 2024 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. వైకాపా ప్రభుత్వం ఆయన్ను వ్యాపారం విషయంలో పలు ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదు. ఆ నిబద్ధతను చూసే చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

అనగాని సత్యప్రసాద్‌ (52)

 • స్వస్థలం: అనగానివారిపాలెం, చెరుకుపల్లి మండలం
 • విద్యార్హత: బీఎస్సీ కంప్యూటర్స్‌
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు రంగారావు, నాగమణి, అన్న శివప్రసాద్, ఇద్దరు అక్కలు డాక్టర్‌ మంజుల, డాక్టర్‌ కమల 
 • రాజకీయ నేపథ్యం: సత్యప్రసాద్‌ పెదనాన్న అనగాని భగవంతరావు ఆర్థికమంత్రిగా పనిచేశారు. సత్యప్రసాద్‌ 2009లో రేపల్లె నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014, 2019, 2024ల్లో వరుసగా విజయం సాధించారు.

వంగలపూడి అనిత (45)

 • స్వస్థలం: సబ్బవరం, విశాఖ జిల్లా
 • విద్యార్హత: ఎంఏ, ఎంఈడీ
 • కుటుంబనేపథ్యం: తల్లిదండ్రులు అప్పారావు, స్నేహలత, పిల్లలు నిఖిల్, రేష్మితశ్రీ 
 • రాజకీయ నేపథ్యం: 2013లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి గెలిచారు. 2019లో ఆమెను కొవ్వూరు నుంచి పోటీచేయించగా ఓడిపోయారు. తర్వాత చంద్రబాబు ఆమెను తెలుగుమహిళ అధ్యక్షురాలిగా, పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించారు. పాయకరావుపేట ఇన్‌ఛార్జి బాధ్యతను మళ్లీ అనితకే అప్పగించారు. తాజా ఎన్నికల్లో మళ్లీ గెలిచి, మంత్రి అయ్యారు.

డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (54)

 • స్వస్థలం: తూర్పునాయుడుపాలెం, టంగుటూరు మండలం
 • విద్యార్హత: ఎంబీబీఎస్‌ (ఆంధ్రా వైద్యకళాశాల, విశాఖపట్నం)
 • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు డోలా కోటయ్య సిద్ధాంతి, సుబ్బమ్మ, భార్య రాజేశ్వరి, కుమారుడు కోటిసిద్ధార్థ
 • రాజకీయ నేపథ్యం: మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. కొండపి ఎస్సీ రిజర్వుడు కావడంతో ప్రభుత్వవైద్యుడి ఉద్యోగానికి రాజీనామా చేసి 2009 ఎన్నికల్లో తెదేపా నుంచి బరిలోకి దిగారు. అప్పుడు ఓడినా, 2014లో గెలిచి, తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. 2019లో వైకాపా హవాలోనూ గెలిచారు. తాజా ఎన్నికల్లో... మంత్రి ఆదిమూలపు సురేష్‌పై గెలిచి హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని