AP News:​​​​​​​అమూల్‌ కంపెనీ కాదు.. సహకార సంస్థ

అమూల్‌ కంపెనీ కాదని, సహకార రంగంలో పని చేసే సంస్థని, దానికి యజమానులు మహిళా పాడి సంఘాల సభ్యులేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది

Updated : 30 Dec 2021 05:05 IST

ఇది వచ్చిన తర్వాత పాడి రైతులకు అదనంగా రూ.10కోట్ల లబ్ధి

ప్రైవేటు డెయిరీల గుత్తాధిపత్యం చెల్లదు

కృష్ణా జిల్లాలో పాలసేకరణ ప్రారంభించిన సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: అమూల్‌ కంపెనీ కాదని, సహకార రంగంలో పని చేసే సంస్థని, దానికి యజమానులు మహిళా పాడి సంఘాల సభ్యులేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది రావడంతో పోటీ పెరిగి మిగిలిన సంస్థలకు దిక్కుతోచడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సంస్థ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత అదనంగా పాడి రైతులు రూ.10 కోట్ల లబ్ధి పొందారని వివరించారు. బుధవారం కృష్ణా జిల్లాలో అమూల్‌ పాలసేకరణ జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో పాల సేకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ... ‘ఈ సంస్థకు మిగిలిన వాటికి తేడా గమనించాలి. అమూల్‌ దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. పాల నుంచి నేరుగా చాక్లెట్‌ తయారు చేసే సంస్థ. లాభాపేక్ష లేకుండా వచ్చిన లాభాలనూ సభ్యులకు ఏడాది చివరన పంచుతుంది...’ అని వివరించారు. రాష్ట్రంలోని సహకార రంగంలోని డెయిరీలను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. మరికొంతమందికి ప్రైవేటు డెయిరీలో వాటాలు ఉండటంతో పాలకు మంచి ధర ఇవ్వాలనే ఉద్దేశం లేకుండా పోయిందని విమర్శించారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో అక్కచెళ్లమ్మలు వాటర్‌ బాటిల్‌కు... పాలు లీటరు ధరకు తేడా లేకుండా పోయిందని వాపోయారని గుర్తు చేశారు. ఒకే సంస్థ గుత్తాధిపత్యం ఉన్నా.. సంస్థలు కుమ్మక్కు (సిండికేట్‌) అయినా రైతులకు మంచి ధర ఇవ్వకుండా మోసం చేస్తారని ఆరోపించారు. ‘పాల సేకరణలో మోసాలు, కొలతల్లో మోసాలు ఉండేవి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్కువ ధర ఇచ్చే అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కృష్ణా జిల్లా చాట్రాయిలో పి.వెంకటేశ్వరమ్మ కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు పాలు పోస్తే.. గతంలో లీటరుకు రూ.44.80 ఇచ్చేవారు. ఇప్పుడు రూ.74.78 వస్తోంది. ఒక్క లీటరుకే ఇంత భారీ వ్యత్యాసం ఉంది. గత ఏడాదిలో రూ.71 కోట్ల విలువైన 168.50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తే.. రైతులకు అదనంగా రూ.10 కోట్ల ప్రయోజనం కలిగింది...’ అని సీఎం జగన్‌ వివరించారు.

లీటరుకు రూ.50 పైసల చొప్పున అదనంగా బోనస్‌: రాష్ట్రంలో 4,796 గ్రామాల్లో పాడి ఎక్కువగా ఉందని గుర్తించి రూ.1600 కోట్లతో సౌకర్యాలను కల్పిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. 2022 సెప్టెంబరు నాటికి 17,629 గ్రామాల్లో పాల సేకరణను లక్ష్యంగా ప్రణాళిక పెట్టుకున్నామన్నారు. 182 రోజులు నిరంతరాయంగా పాలు పోస్తే.. లీటరుకు రూ.50 పైసల చొప్పున అదనంగా బోనస్‌ ఇస్తామని వెల్లడించారు. కృష్ణా జిల్లాతో కలిపి ఆరు జిల్లాల్లో పాల సేకరణను అమూల్‌ ప్రారంభించిందని, మిగిలిన ఏడు జిల్లాలోనూ ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ప్రకాశంలో 245, చిత్తూరులో 275, వైఎస్సార్‌ కడపలో 149, గుంటూరులో 203, పశ్చిమగోదావరిలో 174 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతోందని వివరించారు. పశుగణాభివృద్ధిశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. 2019లో పాల వృద్ధి రేటు 1.40శాతం ఉండగా... 2021లో అది 11.70 శాతానికి పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి అమూల్‌ సంస్థ ఎండీ వీఎం పటేల్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్‌, మేకా ప్రతాప్‌ వెంకట అప్పారావు, రక్షణ నిధి, జగన్మోహన్‌రావు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎపీ డెయిరీ అభివృద్ధి సంస్థ ఎండీ బాబు పాల్గొన్నారు.


తెలంగాణలో రూ.500 కోట్లతో అమూల్‌ ప్లాంటు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసిద్ధ పాడి ఉత్పత్తుల సంస్థ అమూల్‌ తెలంగాణలో రూ. 500 కోట్లతో భారీ డెయిరీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల ఉత్పత్తుల సామర్థ్యంతో దీనిని స్థాపించి, భవిష్యత్తులో దీన్ని పది లక్షల లీటర్లకు పెంచనుంది. 18 నుంచి 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. సిద్దిపేట జిల్లా వర్గల్‌ వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఈ ప్లాంట్‌ ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్షంగా, మరో రెండువేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. బ్రెడ్‌, బిస్కెట్‌, స్నాక్స్‌, సంప్రదాయిక మిఠాయిలు తదితర బేకరీ ఉత్పత్తుల డివిజన్‌ను సైతం ఏర్పాటు చేయనుంది. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతులు, సమాఖ్యలు, సహకార సంఘాల నుంచి నుంచే సేకరిస్తామని తెలిపింది. బుధవారం పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో అమూల్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని