AP news: గుంత కనపడొద్దు

‘రాష్ట్రంలో 46 వేల కి.మీ. రహదారుల్లో.. ఎక్కడా గుంతలు కనిపించకూడదు. ముందుగా వీటిని పూడ్చే పనులు చేపట్టండి. కొత్త రోడ్ల నిర్మాణం కంటే తొలుత మరమ్మతులు, నిర్వహణ పనులపై దృష్టిపెట్టండి. ఎక్కువగా దెబ్బతిన్న రహదారుల పనులు వెంటనే మొదలుపెట్టాలి.

Updated : 16 Nov 2021 04:55 IST

జూన్‌ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తిచేయండి
పనులకు ముందు, తర్వాత ఫొటోలు తీయాలి
ఎన్‌డీబీ పనులు ప్రారంభించని గుత్తేదారులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి
సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో 46 వేల కి.మీ. రహదారుల్లో.. ఎక్కడా గుంతలు కనిపించకూడదు. ముందుగా వీటిని పూడ్చే పనులు చేపట్టండి. కొత్త రోడ్ల నిర్మాణం కంటే తొలుత మరమ్మతులు, నిర్వహణ పనులపై దృష్టిపెట్టండి. ఎక్కువగా దెబ్బతిన్న రహదారుల పనులు వెంటనే మొదలుపెట్టాలి. వచ్చే జూన్‌ నాటికి ఇవన్నీ పూర్తికావాలి. మరమ్మతులు పూర్తయ్యాక తేడా స్పష్టంగా కనిపించాలి. నాడు-నేడు తరహాలో ప్రతి రహదారినీ మరమ్మతులకు ముందు, తర్వాత ఫొటోలు తీయాలి. ఇంత చేశాక ఎవరూ విమర్శించేందుకు అవకాశం ఉండకూడదు’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ, పురపాలక, పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖల అధికారులతో సోమవారం సీఎం సమీక్షించారు.

మొత్తం 46 వేల కి.మీ. రోడ్లను ఓ యూనిట్‌గా తీసుకొని, వీటిలో అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. అన్ని రోడ్లూ బాగుచేశామనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఎక్కడా ప్యాచ్‌ కనిపించకూడదని నిర్దేశించారు. వంతెనలు, ఫ్లైఓవర్లపైనా ఈ పనులు జరగాలన్నారు. ఆర్‌అండ్‌బీతోపాటు పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలోని రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తికావాలని స్పష్టం చేశారు.  

వారం రోజుల్లో ఎన్‌డీబీ పనులు ప్రారంభించాల్సిందే
న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు వారంలో పనులు ప్రారంభించకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని నోటీసులివ్వాలని, దీనిపై అధికారులు సీరియస్‌గా స్పందించాలని జగన్‌ ఆదేశించారు. నిధులకు సంబంధించి అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వచ్చే నెలలో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పెండింగ్‌ ప్రాజెక్టుల వివరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 8,268 కి.మీ. మేర రహదారులకు ఈ నెలాఖరులోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, మరమ్మతులు ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలవల్ల పనుల్లో కొంత జాప్యమైందని చెప్పారు. సమీక్షలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని