AP News:బోర్డుల పరిధి అమలు తీరుపై కేంద్రం అసంతృప్తి

కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధి అమలు తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలతో చర్చించేందుకు రంగంలోకి దిగింది. నాలుగు కీలకమైన అంశాలపై

Updated : 27 Dec 2021 05:34 IST

28న తెలుగు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చ

ఎజెండాలో నాలుగు కీలక అంశాలు

ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధి అమలు తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలతో చర్చించేందుకు రంగంలోకి దిగింది. నాలుగు కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 28న తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. నాలుగు ప్రాధాన్య అంశాలపై చర్చించనున్నట్లు కేంద్ర జల్‌శక్తి మంతిత్వ్రశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్‌కుమార్‌, సమీర్‌శర్మలకు లేఖ రాశారు. 28న ఈ సమావేశం జరుగుతుంది.

* కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులకు చెరో రూ.200 కోట్ల చొప్పున మూలధనాన్ని రెండు రాష్ట్రాలు జమచేయాల్సి ఉంది. గడువు దాటినా జమ చేయకపోవడంతోపాటు ఇంత మొత్తం చెల్లించడం సాధ్యం కాదని, దశలవారీగా చెల్లిస్తామని కోరగా, దీనికి కేంద్రం అంగీకరించలేదు. దీనిని ఎజెండాలో మొదటి అంశంగా చేర్చింది.

* కృష్ణా, గోదావరి బేసిన్లలోని మొత్తం ప్రాజెక్టులను నోటిఫికేషన్‌లో చేర్చిన కేంద్రం, పూర్తిగా బోర్డుల అజమాయిషీలో ఉండే ప్రాజెక్టులను రెండో షెడ్యూలులో, రాష్ట్రాల పర్యవేక్షణలో ఉండి నీటి వినియోగ వివరాలను బోర్డులకు అందజేసే ప్రాజెక్టులను మూడో షెడ్యూలులో చేర్చింది. రెండో షెడ్యూలులోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై పలు దఫాలు చర్చలు జరిగినా ముందడుగు పడలేదు. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తే సరిపోతుందని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌.. శ్రీశైలం ప్రాజెక్టు అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేసినా, తెలంగాణ అప్పగించిన తర్వాతనే అనే మెలిక పెట్టింది. తెలంగాణ ఏ ప్రాజెక్టును అప్పగించలేదు. ముఖ్యంగా శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తేవడానికి అంగీకరించలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారమే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిందని, షెడ్యూలు-2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డు నిర్వహణకు అప్పగించాల్సిందేనని కొన్నాళ్ల క్రితం స్పష్టం చేసింది. గోదావరిలో పెద్దవాగు మినహా ఏ ప్రాజెక్టును అప్పగించాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొనగా, దిగువన ఉన్నవి పూర్తిగా తమ అవసరాలకు సంబంధించినవే కాబట్టి అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. బోర్డుల పరిధికి సంబంధించి కీలకమైన రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని రెండో అంశంగా చర్చించనుంది.

* అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొని, వాటి సమగ్ర నివేదికలు (డీపీఆర్‌) అందజేయాలని, ఆరునెలల్లోగా అనుమతులు పొందాలని కేంద్ర జలసంఘం పేర్కొంది. కృష్ణాలో నీటి లభ్యత లేకపోవడంతో రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇచ్చే పరిస్థితి లేకపోగా, గోదావరిలో రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు అందజేశాయి. దీనిని మూడో అంశంగా చర్చించనున్నారు.

* బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల వద్ద సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సిబ్బంది జీతభత్యాలు, వసతి, వాహనాలు మొదలైనవాటికి రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఖర్చుతోపాటు నిర్వహణలో సమస్యలొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా లేవు. అయితే బోర్డులు తీసుకొనే నిర్ణయాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు జరగడానికి ఈ భద్రత అవసరమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. భద్రతను నాలుగో అంశంగా కేంద్రం ఎజెండాలో చేర్చింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని