Updated : 06 Jan 2022 05:57 IST

AP News:వంద టికెట్‌ను వెయ్యికి అమ్ముకోనివ్వాలా?

దాన్ని బ్లాక్‌మార్కెటింగ్‌ అంటారా? ఇంకేమన్నా అంటారా?: మంత్రి పేర్ని నాని

అది అమ్మేవాడి నమ్మకం.. ప్రభుత్వానికి తెలిసే అమ్మితే బ్లాక్‌ మార్కెట్‌ ఎలా అంటారు?: వర్మ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000లకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు? డిమాండ్‌, సప్లయ్‌ అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా?’ అంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై ట్విటర్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరంపై ఆధారపడి ఉంటుందని వర్మ కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై వర్మ, పేర్ని నాని మధ్య రెండ్రోజులుగా ట్విటర్‌ వేదికగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో నేరుగా చర్చలు జరిపేందుకు మంత్రి నాని సంసిద్ధత తెలపడంతో.. ట్విటర్‌లో మాటల యుద్ధానికి ముగింపు పలికారు వర్మ. అంతకుముందు బుధవారం ఉదయం కూడా పేర్ని నాని, వర్మ మధ్య ట్విటర్‌లో సుదీర్ఘ చర్చ నడిచింది. వంద రూపాయల టికెట్‌ను 1000, 2000లకు అమ్ముకోనివ్వాలా అని మంత్రి ప్రశ్నించారు. ‘రూ.100 టికెట్‌ను వెయ్యికి అమ్ముకోవచ్చా అనేది అసలు ప్రశ్న కాదండి. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని.. కొనేవాడుంటే రూ.5 కోట్లకి అమ్ముతారు. ముడిపదార్థానికే విలువ ఇస్తే దాని బ్రాండ్‌కి ఎలా వెలకడతారు? కొనేవాడికి, అమ్మేవాడికి మధ్య లావాదేవీలు ఎంత జరిగాయనేదే ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే వాళ్లకు పన్ను రావాలి. బ్లాక్‌ మార్కెటింగ్‌ అనేది ప్రభుత్వానికి తెలియకుండా చేసే నేరం. ఎంతకి అమ్ముతున్నారో బహిరంగంగా చెప్పి అమ్మితే తప్పెలా అవుతుంది? బాంబే, దిల్లీల్లో వీక్‌డే బట్టి, థియేటర్‌ బట్టి, సినిమాను బట్టి టికెట్‌ ధరలు రూ.75 నుంచి రూ.2200 వరకు ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది డిమాండ్‌ అండ్‌ సప్లై సూత్రమే’ అని ఆర్జీవీ జవాబిచ్చారు.

థియేటర్లు వ్యాపార సంస్థలే..

మంత్రి స్పందిస్తూ ‘సామాన్యుడి మోజును, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్‌ ధరను నిర్ణయిస్తున్నాయి. ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని మీరడిగారు. థియేటర్లు అనేవి ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు’ అని చెప్పారు. దీనిపై వర్మ స్పందిస్తూ ‘క్షమించండి నాని గారూ.. దీన్ని లూటీ అనరు. అమ్మేవాడు, కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునేదాన్ని లావాదేవీలు అంటారు. థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలని చెప్పారు. అలా ఎవరు చెప్పారు? రాజ్యాంగంలో కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో కానీ ఉందా? మీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించుకోవటానికే ఈ నిర్వచనం మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. థియేటర్లనేవి.. కేవలం వ్యాపార సంస్థలు. ప్రజాసేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు. కావాలంటే మీ ప్రభుత్వంలో ఉన్న థియేటర్‌ యజమానులను అడగండి’ అన్నారు. ‘సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు. థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే నిబంధనలు చెబుతున్నాయి’ అని మంత్రి అన్నారు. ‘సినిమాను నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నామని చెప్పింది మీ నాయకులే’ అని వర్మ బదులిచ్చారు.

మీకూ.. మీ డ్రైవర్‌కు తేడా లేదా?

టికెట్‌ రేట్లపై వర్మ స్పందిస్తూ ‘వి ఎపిక్‌’ థియేటర్‌లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్‌ ఉన్న ఏరియాను బట్టి టికెట్‌ ధర ఎలా నిర్ణయించారు? వివిధ హోటళ్లలో ఆయా హోటల్‌ వాళ్లు, వాళ్లిచ్చే సౌకర్యాలను బట్టే ధరల పట్టిక పెట్టుకుంటారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాకు, సంపూర్ణేష్‌బాబు సినిమాకు మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా?’ అని మంత్రిని ప్రశ్నించారు. అవకాశమిస్తే సినీపరిశ్రమ సమస్యలపై వివరణ ఇస్తానని వర్మ కోరగా.. పేర్ని నాని ‘త్వరలో కలుద్దాం’అని బదులిచ్చారు.

కొడాలి నాని ఎవరో తెలియదు: వర్మ

టికెట్‌ రేట్లపై చర్చ సందర్భంగా వర్మ మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీ టికెట్‌ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని.. న్యాచురల్‌ స్టార్‌ నాని ఒక్కడే. వాళ్లు చెబుతున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని