AP news:సాఫ్ట్‌వేర్‌ కొలువు.. సులువే!

ఐటీ నియామకాల్లో ట్రెండ్‌ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు (సీఎస్‌ఈ) చదవాలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచుల్లోని సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌

Updated : 10 Jan 2022 04:46 IST

సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ అభ్యర్థులకూ అవకాశాలు

నైపుణ్యాలుంటే ఇంజినీరింగ్‌లో బ్రాంచితో సంబంధమే లేదు

ఈనాడు, అమరావతి: ఐటీ నియామకాల్లో ట్రెండ్‌ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు (సీఎస్‌ఈ) చదవాలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచుల్లోని సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ (ఈఈఈ) కోర్సులు చదువుతున్న వారూ తమను తాము మార్చుకుని ప్రాంగణ ఉద్యోగాలను సాధిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల మానవ వనరుల అవసరాలు పెరిగాయి. దాంతో కంపెనీలు విద్యార్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ నైపుణ్యాలున్న వారికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మంచి ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులూ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను నేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు.

* విజయవాడలోని వీఆర్‌ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో గతేడాది 273 మంది, ఈ ఏడాది 148 మంది కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అసెంచర్‌, టీసీఎస్‌ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లభించాయి. సంవత్సరానికి రూ.4.5 లక్షల నుంచి రూ.7.2 లక్షల మధ్య వేతన ప్యాకేజీలు పొందారు. వీరిలో కొందరు రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైనవారు ఉండటం గమనార్హం.

* విజయవాడ ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఈ ఏడాది 9 మంది కోర్‌ ఇంజినీరింగ్‌ వారు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సాధించారు. ఈఈఈ చదివే హరితేజ 4 కంపెనీలకు ఎంపికయ్యారు. రూ.4.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల ప్యాకేజీ వరకు వచ్చాయి.

*విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్తులో ఈ ఏడాది 168 మంది విద్యార్థులు రూ.3.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల ప్యాకేజీలు సాధించారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన మరో 14 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందారు. వీరందరూ క్యాప్‌ జెమినీ, టీసీఎస్ ఇన్పోసిస్‌లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.

కరిక్యులమ్‌లోనూ మార్పులు

స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు బేసిక్‌ ప్రోగ్రామింగ్‌ను కరిక్యులమ్‌లో భాగం చేస్తున్నాయి. సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ విద్యార్థులకు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, డాటా స్ట్రక్చర్స్‌, పైథాన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌పై శిక్షణ ఇస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు స్వయం పోర్టల్‌లోని కోర్సులు పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం అందిస్తున్నాయి. దీంతో కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారు.


అదనపు కోర్సులతో టీసీఎస్‌లో ఉద్యోగం

నేను ఈఈఈ నాలుగో ఏడాది చదువుతున్నా. ఇందులో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నందున సాఫ్ట్‌వేర్‌వైపు వెళ్దామని పైథాన్‌, ప్రోగ్రామింగ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, జావా నేర్చుకున్నా. ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్‌ కోర్సులు చేశా. టీసీఎస్‌ డిజిటల్‌లో రూ.7.2 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యా.

 - పింగళి ఐశ్వర్య


కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌పై అవగాహన అవసరం

- కాంచనపల్లి వెంకట్‌, సీఈఓ, సన్‌టెక్‌ కార్ఫ్‌ ప్లేస్‌మెంట్‌ శిక్షణ సంస్థ

ఇంజినీరింగ్‌ చదివే వారికి డొమైన్‌తోపాటు ఐటీపైనా అవగాహన ఉండాలి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చాక కొన్నిసార్లు డొమైన్‌ విజ్ఞానం ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏ కోర్సు చదివేవారికైనా ప్రోగ్రామింగ్‌, ఆపరేటింగ్‌లాంటి వాటిపై కనీస పరిజ్ఞానం అవసరమవుతుంది. కరోనాతో వచ్చిన మార్పుల కారణంగా ఐటీ నియామకాలు పెరిగాయి. ప్రాజెక్టులు అధికంగా రావడంతో కంపెనీలు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌పై అవగాహన ఉన్న వారిని తీసుకుంటున్నాయి.


3 కంపెనీల ఆఫర్లు వచ్చాయి

- ఆదిత్య మోహన్‌, మెకానికల్‌ నాలుగో ఏడాది

మెకానికల్‌ చదువుతున్నా. సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లాలని రెండో ఏడాది నుంచే ప్రొగ్రామింగ్‌తోపాటు అవసరమైన సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేశా. ప్రాంగణ నియామకాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, క్యాప్‌ జెమినీల నుంచి ఆఫర్లు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని