Updated : 31 Jan 2022 04:48 IST

AP News:జీతాల ప్రక్రియ మందగమనమే!

అక్కడక్కడా ఖజానా సిబ్బంది హాజరు
సర్వర్‌ సమస్యలతో ఆ కొద్ది పనికీ అంతరాయం
డీడీవోల స్థాయిలోనూ సాగని ప్రక్రియ

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా కొత్త వేతన సవరణ ప్రకారం జీతాలు ఇచ్చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా ఆ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఆదివారం కూడా విధులకు హాజరై ఈ ప్రక్రియ చేపట్టాలని ఖజానా శాఖ అధికారులు తమ సిబ్బందిని ఆదేశించినా పరిస్థితి మందగమనంగానే ఉంది. ఖజానా సిబ్బంది అక్కడక్కడా హాజరై ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మరోవైపు సర్వర్‌ సహకరించకపోవడంతో పని ముందుకు సాగలేదని చెబుతున్నారు. జనవరి నెల జీతాల బిల్లుల ప్రక్రియ ముగించేందుకు ఇక ఒక్కరోజే మిగిలింది. ఎంత మేర బిల్లులు ప్రాసెస్‌ చేస్తారనేది ప్రశ్నార్థకమే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ జనవరి జీతాల బిల్లులు పెద్దగా సమర్పించలేదు. రాష్ట్రంలో మొత్తం 16,700 మంది డ్రాయింగ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారులు ఉన్నారు. వీరిలో కొన్నిచోట్లే బిల్లులు సమర్పించే ప్రక్రియ జరిగింది. పోలీసుశాఖలో వీటి సంఖ్య ఎక్కువ. వీటినీ ఖజానా అధికారులు పరిశీలించాలి. 500 మంది డీడీవోలకు సంబంధించి మాత్రమే కొంతమేర జరిగినట్లు అధికారవర్గాల సమాచారం. మరోవైపు కలెక్టర్లు జోక్యం చేసుకుని జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది.

కొందరు జిల్లా అధికారులు తమ అశక్తతను తెలియజేస్తూ ఖజానా శాఖ ఉన్నతాధికారికి లేఖలు రాశారు. ఉద్యోగులంతా తమ కొత్త జీతాల బిల్లులు సమర్పించవద్దంటూ తమ డీడీవోలకు లేఖలు రాశారని, వారూ ఆ విషయం తమకు చెప్పారని అందులో కొందరు పేర్కొన్నారు. ఉద్యోగులు సమర్పించిన లేఖలనూ కొందరు ఉన్నతాధికారులకు పంపారు.

డీడీవోలపై చర్యలకు సిఫార్సులు

అక్కడక్కడ కలెక్టర్లు జీతాల బిల్లులు ప్రాసెస్‌ చేయని ఒకరిద్దరు డీడీవోలు, ఖజానా అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జనవరి 29 సాయంత్రం 6గంటల వరకు ఏ డీడీవో వద్ద బిల్లుల ప్రగతి ఎలా ఉందో పేర్కొంటూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. మరోవైపు డీడీవోల బాధ్యతలను జాయింట్‌ కలెక్టర్లకు అప్పగిస్తున్నారంటూ ప్రచారం జరిగినా దానిపై ఉత్తర్వులు జారీ కాలేదు.


పింఛన్ల ప్రక్రియ పూర్తి

రాష్ట్రంలోని మొత్తం 4 లక్షలకు పైగా పింఛనర్లకు జనవరి నెల పింఛను కొత్త స్కేళ్ల ప్రకారం చెల్లించేందుకు రంగం సిద్ధమయింది. 2018 జులై ముందు పదవీవిరమణ చేసిన వారితో పాటు ఆ తర్వాత పదవీవిరమణ చేసిన వారికీ కొత్త పింఛన్ల బిల్లులు సిద్ధం చేశారు. ఆ మేరకు వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని