APPSC: ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా?

రాజకీయ నేతల పునరావాస కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)ను కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

Updated : 14 Jun 2024 06:47 IST

వైకాపా పాలనలో భ్రష్టుపట్టిన కమిషన్‌
పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏది?
ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఏకపక్ష నిర్ణయాలు
జగన్‌కు కావలసినవారితో నిండిన రాజ్యాంగ సంస్థ
ఈనాడు - అమరావతి 

రాజకీయ నేతల పునరావాస కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)ను కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన కమిషన్‌ను సంస్కరించి, ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నారు. గత ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 2,250 పోస్టుల భర్తీ నిమిత్తం 35 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో సగం పోస్టులు అంతకుముందున్న తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైనవే. జగన్‌ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించినప్పటికీ.. నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. ఇక, ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతకుముందు కార్యదర్శిగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు తెదేపా ప్రభుత్వం నియమించిన ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ను నిత్యం వేధింపులకు గురిచేశారు. ‘గౌతం సవాంగ్, సీతారామాంజనేయులు.. ఇద్దరూ కళంకిత అధికారులే. వీరి ఐపీఎస్‌ హోదాను తీసేసి, ఇద్దరినీ జైల్లో పెట్టాలి. గ్రూపు-1 అక్రమాలపై సీబీఐచే విచారణ జరిపించాలి’ అని గతేడాది మార్చిలో చంద్రబాబు డిమాండ్‌ చేసిన సంగతి ప్రస్తావనార్హం.

హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా..

గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2018 డిసెంబరు 31న 162 గ్రూపు-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. దీని ప్రకారం ప్రిలిమ్స్‌ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించిన మెయిన్స్‌ ఫలితాలను 2021 ఏప్రిల్‌ 28న వెల్లడించారు. ఈ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేయడాన్ని ఆక్షేపించిన హైకోర్టు.. మాన్యువల్‌గా ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే, న్యాయస్థానం ఆదేశాల మేరకు జవాబు పత్రాలను ఒకసారి కాకుండా, రెండుసార్లు మాన్యువల్‌గా మూల్యాంకనం చేయడంపై పలువురు అభ్యర్థులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్‌ విధానంలో మంచి మార్కులు సాధించి, ఇంటర్వ్యూలకు ఎంపికైన చాలామంది అభ్యర్థులు.. మాన్యువల్‌ మూల్యాంకనంలో తప్పిపోయారు. చివరకు మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికైన వారి జాబితాను రద్దు చేయాలని, మెయిన్స్‌ మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. కమిషన్‌ దీనిపై అప్పీల్‌ చేయగా డివిజన్‌ బెంచ్‌ ‘స్టే’ ఇచ్చింది. ఇలా నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టి, మొత్తం నియామక ప్రక్రియనే వివాదాస్పదం చేసిన ఘనత ఏపీపీఎస్సీది. మరోపక్క, గ్రూపు-1 ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మౌఖిక పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంల వారీగా ఎంపికైన వారి వివరాలూ బయట పెట్టడంలేదు. అసలే రాజకీయ నేపథ్యం గల సభ్యులతో నిండిన కమిషన్‌లో.. అభ్యర్థుల మార్కులు, మాధ్యమాన్ని వెల్లడించకపోవడం పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది. 

రాజకీయ పునరావాస కేంద్రమా?

గ్రూపు-1 నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్నే అమలు చేసింది. ఇంటర్వ్యూ లేకుండా గ్రూపు-1 ద్వారా ఎంపికైన వారు భవిష్యత్తులో అఖిల భారత సర్వీసు అధికారులుగా పదోన్నతులు పొందాలంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న కీలక అంశాన్ని విస్మరించింది. వైకాపా ప్రభుత్వంలో రాజకీయ ప్రాపకంతో సభ్యులుగా నియమితులైన వారి సమక్షంలో గ్రూపు-1 అభ్యర్థుల ఇంటర్వ్యూలు జరిగాయి. తెదేపా ప్రభుత్వం ఛైర్మన్‌గా నియమించిన ఉదయ్‌భాస్కర్‌ను మెడపట్టి బయటకు నెట్టేసిన వైకాపా ప్రభుత్వం..  కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. సభ్యుడు జీవీ సుధాకర్‌రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా నేత. మరో సభ్యుడు సుధీర్‌ మాజీ సీఎం జగన్‌ తాతయ్య రాజారెడ్డి అన్న ప్రభుదాస్‌రెడ్డి మనవడు. అలాగే సభ్యులుగా సోనీవుడ్, సీవీ శంకర్‌రెడ్డి, సెలీనా కొనసాగుతున్నారు. వైకాపా పెద్దల సిఫార్సులతోనే వీరి నియామకాలు జరిగాయి. వీరిలో క్రమం తప్పకుండా కార్యాలయానికి వచ్చేవారు కొద్ది మందే. ఎక్కువ మంది నెలకోసారి జరిగే కమిషన్‌ సమావేశాలకు హాజరవుతూ, సంతకాలకు పరిమితమవుతున్నారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి ప్రొటోకాల్‌ గల వీరికోసం ప్రత్యేక ఛాంబర్లు, సహాయకులు, సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని