APSEC:రాష్ట్రంలో ఓటర్లు4,07,36,279

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 4,07,36,279కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2022 చేపట్టిన ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్రంలో నికరంగా 29,544 మంది (0.07%) ఓటర్లు పెరిగారు.

Updated : 06 Jan 2022 06:01 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 4,07,36,279కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2022 చేపట్టిన ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్రంలో నికరంగా 29,544 మంది (0.07%) ఓటర్లు పెరిగారు. 2020 నవంబరు 1న రాష్ట్రంలోని 174 నియోజకవర్గాలకు సంబంధించి, నవంబరు 15న బద్వేలు నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. వాటి ప్రకారం రాష్ట్రంలో 4,07,06,804 మంది ఓటర్లుండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం కొత్తగా 1,69,916 మందిని జాబితాలో చేర్చింది. 1,40,372 మందిని తొలగించింది. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,62,880 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ వివరాలను ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ బుధవారం వెల్లడించారు. ఏపీలో గతంలో 45,917 పోలింగ్‌ కేంద్రాలు ఉండేవి. వాటి సంఖ్యను 33 పెంచడంతో మొత్తం 45,950కు చేరాయి.

9 జిల్లాల్లో పెరుగుదల... నాలుగు జిల్లాల్లో తగ్గుదల

* అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 16,745 మంది, కర్నూలు జిల్లాలో 15,092 మంది, తూర్పుగోదావరిలో 13,377 మంది ఓటర్లు పెరిగారు.

* అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 28,721 మంది, ప్రకాశంలో 8,432 మంది, కడపలో 1,738 మంది, చిత్తూరులో 1,221 మంది ఓటర్లు తగ్గారు.

* ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో మొత్తంగా 9 జిల్లాల పరిధిలో ఓటర్లు పెరగ్గా, నాలుగు జిల్లాల పరిధిలో ఓటర్లు తగ్గారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం... విజయనగరం జిల్లాలో అత్యల్పం

* అత్యధిక ఓటర్లున్న జిల్లాల జాబితాలో తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాలు వరుసగా గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలవి.

* తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో విజయనగరం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు మొదటి 4 స్థానాల్లో నిలిచాయి.

* శ్రీకాకుళం, అనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.

* రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 17,343 మంది, ప్రకాశం జిల్లాలో 8,268 మంది, విశాఖపట్నంలో 7,897 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ (721) సర్వీసు ఓటర్లున్నది నెల్లూరు జిల్లాలో..

భీమిలిలో గరిష్ఠం.. నర్సాపురంలో కనిష్ఠం..

* నియోజకవర్గాల వారీగా చూస్తే విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 3,29,669 మంది, గాజువాకలో 3,29,540 మంది, కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో 3,11,272 మంది ఓటర్లు ఉన్నారు.

* పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతి తక్కువగా 1,67,596 మంది, కృష్ణా జిల్లా పెడనలో 1,71,454 మంది, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో 1,79,103 మంది ఓటర్లు ఉన్నారు.

* రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న మొదటి మూడు నియోజకవర్గాల్లో రెండు విశాఖ జిల్లాలోనూ, అతి తక్కువ ఓటర్లున్న తొలి మూడు నియోజకవర్గాల్లో రెండు పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని