APSRTC: బస్సు ఆగిందా.. మీ పని గోవిందా!

ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాగుండాలని, బ్రేక్‌డౌన్స్‌ నియంత్రించలేకపోతే సంబంధిత డిపో మేనేజరు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఆదేశించారు.

Updated : 12 Nov 2022 06:59 IST

క్రమశిక్షణ చర్యలకు ఎండీ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాగుండాలని, బ్రేక్‌డౌన్స్‌ నియంత్రించలేకపోతే సంబంధిత డిపో మేనేజరు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల రోడ్ల మీద బస్సుల టైర్లు ఊడిపోవడం, స్టీరింగ్‌ ఊడి రావడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిపై మీడియాలో వార్తలు రాగానే, సీఎం కార్యాలయం నుంచి ఆరా తీస్తున్నారు. దీంతో బస్సుల నిర్వహణ, తనిఖీలు నిబంధనల ప్రకారం జరగాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. బస్సు బ్రేక్‌డౌన్‌ అయితే మర్నాటి ఉదయం 8 గంటల లోపు ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు. కొంతకాలంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా బ్రేక్‌డౌన్‌ కావడానికి అధ్వానపు రహదారులే కారణమని గ్యారేజీల్లో పనిచేసే మెకానికల్‌ సిబ్బంది పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు వాటి బాగోగులు చూస్తున్నప్పటికీ.. అడుగుకో గుంత ఉన్న దారులపై ప్రయాణం వల్ల పాడవుతున్నాయని చెబుతున్నారు. భారీ గుంతల వల్ల బస్సంతా కుదుపులకు గురై.. ఈ ప్రభావం చక్రాలు, స్ప్రింగ్‌ బ్లేడ్స్‌ తదితరాలపై పడి త్వరగా చెడిపోతున్నాయని పేర్కొంటున్నారు. షెడ్యూల్‌ కంటే ముందే మళ్లీ మెయింటెనెన్స్‌ చేయాల్సి వస్తోందని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని