Andhra News: ఏటా ఉద్యోగాలు భర్తీ చేయకుంటే కష్టమే!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పని చేయాలంటే ఖాళీ అవుతున్న పోస్టులను గుర్తించి, ప్రతి ఏటా భర్తీ చేయాల్సిందేనని అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్యాలయాలు ఒక పద్ధతి ప్రకారం,

Updated : 07 Mar 2022 07:03 IST

కార్యాలయాల సమర్థ పనితీరుకు ఇది తప్పనిసరి
అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక సిఫార్సు
రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పని చేయాలంటే ఖాళీ అవుతున్న పోస్టులను గుర్తించి, ప్రతి ఏటా భర్తీ చేయాల్సిందేనని అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్యాలయాలు ఒక పద్ధతి ప్రకారం, సమర్థంగా పని చేయాలంటే ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం ముఖ్యమని పేర్కొంది. ఏళ్ల తరబడి ఖాళీలను నింపకుండా.. ఒకేసారి వాటిని భర్తీ చేస్తే రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. దీనివల్ల ఒకేసారి ఉద్యోగాల భర్తీ, ఒకేసారి పదవీ విరమణ వంటి పరిస్థితులు ఏర్పడతాయని వివరించింది. ‘ప్రతి ప్రభుత్వశాఖా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా దీన్ని నవీకరించి, ఎప్పుడు ఎన్ని ఖాళీలు వస్తున్నాయన్న సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి. పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలపై కూడా స్పష్టత ఉండాలి. ఏపీపీఎస్సీ ద్వారా లేదా జిల్లా ఎంపిక కమిటీల సాయంతో లేదా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని అశుతోష్‌ కమిటీ కుండ బద్దలు కొట్టింది.

ఉద్యోగాల ఖాళీల వల్ల పనితీరుపై ప్రభావం పడుతోందని, ఇది ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోందంటూ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అనేక అభ్యర్థనలను కమిటీ అందుకుందని తెలిపింది. ప్రధానంగా జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరోవైపు సరైన సేవలందక ప్రజలూ అసంతృప్తితో ఉంటున్నారని ఉద్యోగులు పేర్కొన్నట్లు నివేదికలో వెల్లడించారు.

తన దృష్టికి వచ్చాయంటూ కమిటీ ప్రస్తావించిన అంశాలివీ..

* ప్రధానంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పశుసంవర్థకం, వ్యవసాయ, భూ పరిపాలన శాఖల్లో 20శాతానికి మించి ఖాళీలు ఉన్నాయి.

* వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

* ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోనూ భారీగా ఖాళీలున్నా భర్తీ చేయడం లేదు.

* ఏఈ, ఏఈఈ వంటి ఉద్యోగులున్నా వారికి సాయం అందించాల్సిన సిబ్బంది కొరత ఉంటోంది.

* వైద్య ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల పని భారం పెరగడంతో పాటు సెలవులూ వినియోగించుకోలేని పరిస్థితి ఉంది.

* సర్వే ఉద్యోగులకూ అధిక పని ఒత్తిడి ఉంది.

* రెవెన్యూలో పని భారానికి, సిబ్బందికీ సంబంధం లేకుండా ఉంది.

ఏటా క్యాలండర్‌ లేదు.. భర్తీ లేదు!

ఒకవైపు అశుతోష్‌ మిశ్ర కమిటీ ఉద్యోగాల భర్తీ తప్పనిసరి అని విస్పష్టంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎప్పుడో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారు. అశుతోష్‌ మిశ్ర కమిటీ పేర్కొన్న ఉద్యోగాలేవీ ఆ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినవి కావు. ప్రతి జనవరిలోనూ జాబ్‌ క్యాలండర్‌ ఇస్తామని ప్రకటించారు. జనవరిలో ఆ ఊసే లేదు. కిందటి ఏడాది జూన్‌లో 10,143 ఉద్యోగాలను 2022 మార్చి నెలాఖరులోపు భర్తీ చేస్తామన్నారు. అందులో వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల కోసం మినహా అనేక నోటిఫికేషన్లు రానేలేదు. గ్రూపు 1, 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌కు దిక్కే లేదు. పోలీసు ఉద్యోగాల భర్తీ చేయలేదు. డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఈ ఏడాది జనవరిలోనూ జాబ్‌ క్యాలండర్‌నూ విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో అటు ఉద్యోగులూ, ఇటు నిరుద్యోగులూ అసంతృప్తితో ఉన్నారు.


‘కొత్త శతాబ్దిలో పౌరుల నుంచి వస్తున్న సమకాలీన డిమాండ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల్లో అక్షరాస్యత, అవగాహన స్థాయి పెరగడం వల్ల ప్రభుత్వంపైనా ఉద్యోగులపైనా ఒత్తిడి కూడా పెరుగుతోంది. ప్రజలు అవినీతిరహిత, పారదర్శక పాలన కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా పాలన, ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన దిశగా అడుగులు వేయక తప్పదు. తక్కువ వ్యయంతోనే నాణ్యమైన సేవలు అందించాల్సి ఉంది. ఉద్యోగులు, అధికారుల తీరు మారడం, నైపుణ్యం పెరగడం వంటివి ప్రధానాంశాలవుతున్నాయి. కొత్త పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరులకు సంబంధించి సరైన ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంది’

- అశుతోష్‌ మిశ్ర నివేదిక

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని